Sakshi News home page

రెవె‘న్యూ’.. జగడం

Published Tue, Dec 30 2014 3:43 AM

రెవె‘న్యూ’.. జగడం

* గంటాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లో మంత్రి అయ్యన్న మంత్రాంగం
* భూ వ్యవహారంపై విజిలెన్స్ విచారణతో కలకలం
* ఆర్డీవోపై వేటు కోసం వ్యూహం!
* మంత్రుల మధ్య వేడెక్కుతున్న రాజకీయం

సాక్షి, విశాఖపట్నం : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో మంత్రి అయ్యన్న బాణం సంధించారు. కోట్ల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా స్వామి భక్తిని ప్రదర్శించే అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు మంత్రి గంటాకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటుకు మార్గం సుగమం చేశారు. అదను చూసి వేసిన ఎత్తుకు మంత్రి గంటా బిత్తరపోవాల్సిన పరిస్థితి కల్పించారు.

భీమిలి, పరవాడలలో భూ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జిల్లా రాజకీయ, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఇప్పటికే ఉప్పూ నిప్పుగా ఉన్న అయ్యన్న, గంటాల మధ్య తాజా ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. ఇద్దరు మంత్రుల ఆధిపత్యపోరులో తాము అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో పనిచేయడం కంటే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడం ఉత్తమమని కూడా భావిస్తున్నారు.

జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... పరవాడ మండలంలో సర్వే నంబర్ 54లో 32.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఒక ప్రభుత్వ పెద్ద ఎప్పటి నుంచో కన్నేశారు. అదే విధంగా భీమిలి మండలం గంభీరంలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ఇదే రీతిలో ఆక్రమించాలని ఎప్పటినుంచో పథకం పన్నారు. ఈ భూములు ప్రస్తుతం రైతులు, స్థానికుల ఆక్రమణలో ఉన్నాయి.

వీటిని ఎలాగైనా తన పరం చేసుకోవాలని కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో సదరు ప్రభుత్వ పెద్ద చక్రం తిప్పారు. తన అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారి ద్వారా  కథ నడిపించారు. గత ప్రభుత్వ హయాంలోనే గంభీరం వద్ద ఉన్న భూములను  క్రమబద్ధీకరించుకున్నారని సమాచారం.

పరవాడలో రైతుల ఆక్రమణలో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చే విషయం పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ఆ కీలక నేత, ఈయన తనకు అనుకూలుడైన రెవెన్యూ అధికారి ఒకరు సదరు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను టాంపరింగ్ చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా పరిగణించారు. కానీ ఆ కీలక నేత ఒత్తిడితో టాంపరింగ్ విషయం తెలిసినా సదరు అధికారి మిన్నకుండిపోయినట్టుగా తెలియవచ్చింది. భీమునిపట్నం మండలంలోని చిప్పాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 86/4, 184/6లలో ఉన్న భూముల రికార్డులను తారుమారు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ సర్వే నంబర్‌లో సుమారు 500 ఎకరాల్లో ఓ లేబొరేటరీ ఉండగా, మిగిలిన భూముల్లో అటవీ, విజయనగరం జిల్లా మాన్‌సాస్ భూములు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై సీఎం, డీప్యూటీ సీఎంలకు ఫిర్యాదుల వెల్లువెత్తడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీల్లో రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమైన సదరు రెవెన్యూ అధికారిపై ఈ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. విచారణ పేరుతో సదరు అధికారిని బలవంతంగా పంపించేందుకే జిల్లాకు చెందిన కీలక మంత్రి పావులు కదిపినట్టుగా తెలుస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement