రెడీ | Sakshi
Sakshi News home page

రెడీ

Published Thu, Jul 3 2014 3:05 AM

Ready

కడప కలెక్టరేట్ : కడప ఎయిర్‌పోర్టు ప్రారంభానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు  తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ జాబితా కూడా సిద్ధం చేసింది.
 
 తొలుత ఈనెల 2వ తేదీన ఎయిర్‌పోర్టును ప్రారంభించాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి, పౌర విమానయాన మంత్రి బిజీగా ఉండడం వల్ల  ముహూర్తం కుదరలేదు.  ఈనెల 7 లేదా 10వ తేదీన వారు వచ్చేందుకు వీలుందని సమాచారం. ముహూర్తం ఎప్పుడు ఖరారైనా సిద్ధంగా ఉండాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు అవసరమైన ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్, నీరు, సెక్యూరిటీ, అగ్నిమాపక యంత్రాలు వంటి సౌకర్యాలను కల్పించారు. స్పైస్ జెట్, ఎయిర్ కోస్టాకు చెందిన విమానాలు కడపలో దిగే అవకాశం ఉందంటున్నారు.
 
 ఇందుకు ఆ సంస్థలు అంగీకరించినట్లు  తెలుస్తోంది. ఎయిర్ ఇండియా కూడా విమానాలు నడిపేందుకు ఇటీ వలే సర్వే కూడా నిర్వహించిందని అంటున్నారు. ఏటీఆర్ రకం విమానాలు కడప ఎయిర్‌పోర్టులో కాలిడనున్నాయి. ఇందులో 70 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.కడప మీదుగా ముంబయి నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది. రోజుకు రెండుసార్లు విమానాలు నడుస్తాయని అంటున్నారు.
 
 వివిధ వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు,ఇతర ఉన్నత స్థాయి వర్గాలు నిత్యం బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు వంటి నగరాలకు వెళుతుంటారు  వారు విమాన సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని అంచనా వేస్తున్నారు.  ప్రయాణీకుల సమస్య ఉత్పన్నం కాదని అధికారుల విశ్లేషణ. భవిష్యత్తులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పనుంది.  కడప సమీపంలోని మెగా ఇండస్ట్రియల్ పార్కులోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్తులో అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వీటనన్నింటికీ  ఎయిర్‌పోర్టు కీలకం కానుంది. ఎట్టకేలకు జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన ఎయిర్‌పోర్టు అతి త్వరలోనే ప్రారంభం కానుంది.
 

Advertisement
Advertisement