మున్సిపోల్స్‌కు రెడీ | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌కు రెడీ

Published Sun, Mar 2 2014 4:47 AM

ready for municipal election

సాక్షి ప్రతినిధి, విజయనగరం:మున్సి‘పోల్స్’కు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయింది.  ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల రిజర్వేషన్లు ఖరారు చేసింది. విధానపరమైన అభ్యంతరాలు ఉన్న నెల్లిమర్ల నగర పంచాయతికీ రిజర్వేషన్ ప్రకటించింది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాల్టీ చైర్మన్ పదవులు అన్ రిజర్వుడు కాగా, సాలూరు చైర్‌పర్సన్ పదవిని మహిళ(జనరల్)కు కేటాయించారు.
 
 ఇక నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ పదవి బీసీ మహిళకు ఖరారైంది.  మున్సిపాల్టీల పరిధిలోని వార్డులకు గత జూలైలోనే రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో మున్సిపాల్టీల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసినట్టయింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఆదివారం వార్డుల వారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితా విడుదలకు చర్యలు తీసుకుంది. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రానికే ఆయా జాబితాలను కలెక్టర్‌కు మున్సిపల్ అధికారులు అందజేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఫీవర్ మొదలయింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనంతో ఓటమి భయం పట్టుకుని మూడున్నర  ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తూ వస్తున్న సర్కార్‌పై రాష్ట్ర హైకోర్టు గతనెల 3వ తేదీన మండిపడిన విషయం తెలిసిందే. 
 
 మార్చి 3వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని గడువు కూడా ఇచ్చింది. ఈలోపే ఎన్నికల ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని కోరింది. అయినా ఎన్నికల నిర్వహణపై సర్కార్ ఆసక్తి చూపలేదు. ఆ దిశగా చర్యలు కూడా తీసుకోలేదు. ఈ క్రమంలోనే  సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే సర్కార్‌కు అక్కడ కూడా చుక్కెదురయింది.   ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో షాక్ తిన్న సర్కార్ తప్పని పరిస్థితుల్లో ఎన్నికలపై దృష్టి సారించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే రిజర్వేషన్లను శనివారం సాయంత్రం ప్రకటించింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 274 ఈవీఎంలు జిల్లాకు  చేరాయి. ఇంకోవైపు ఆదివారం ఫొటో ఎలక్టోరల్ జాబితాలను విడుదల చేయనుంది.
 
 ఎన్నికల నిర్వహణపై అనుమానాలు 
  కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టినా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మాత్రం అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రపతి పాలన, మరోవైపు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై  సందేహాలు నెలకొన్నాయి. సాధారణ ఎన్నికలకు ముందా వెనకా అనేది అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. అంతా గందరగోళంగా ఉందని అంటున్నారు.
 
 నేతల్లో ఆశలు 
 మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో నేతల్లో ఆశలు చిగురించాయి. మూడున్నరేళ్లుగా వాయిదా వేస్తూ రావడంతో నిరాశకు గురైన నేతలంతా తాజా పరిణామాలతో సంతోషపడుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆశావహులంతా తమ ప్రయత్నాల్లో ఉన్నారు. పరిస్థితులపై అంచనాలు వేసుకుంటున్నారు. పార్టీ నాయకత్వాలైతే  వార్డుల వారీగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై  చర్చించుకుంటున్నాయి.  రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం అంతగా ఉత్సాహం కన్పించడం లేదు. పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ఎన్నికలు జరగనుండడంతో ఆందోళన చెందుతున్నారు. 
 

Advertisement
Advertisement