‘బీమా’ ఏజెంట్ల పేరిట రియల్ దందా | Sakshi
Sakshi News home page

‘బీమా’ ఏజెంట్ల పేరిట రియల్ దందా

Published Thu, Dec 12 2013 3:49 AM

real estate business on the Insurance agents

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులుగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత్రధారులుగా రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డు భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పట్టాభూములు కొనుగోలు చేసి పక్కనే ప్రభుత్వ, అసైన్డు, అటవీశాఖలకు చెందిన భూములు కలుపుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా జీవిత బీమాలో పనిచేసే ఏజెంట్ల పేరిట సొసైటీ ఏర్పాటు చేసి, సుమారు రూ.5 కోట్ల విలువ చేసే భూమికే ఎసరు పెట్టిన వైనం ఆల స్యంగా వెలుగు చూసింది. 130 మంది ఏజెంట్ల నుంచి 2008 నుంచి 2010 సంవత్సరాల్లో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష వసూలు చేసిన సంఘం నేతలు కొందరు, ఆ పెట్టుబడితో అసైన్డు భూమిని కొనుగోలు చేసి, అందులో ఐదెకరాలు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ వ్యవహారం వెనుక నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చిన ఓ మాజీ ఆర్డీవో హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. అయితే సొసైటీ కోసం 72/2 సర్వే నంబర్‌లో కేటాయించిన పదెకరాల నుంచి కేవలం 30 మంది సభ్యులకు ప్లాట్ల ను కేటాయించారు. తక్కిన భూమితో సంఘ నేతలు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం కావడంపై బాధితులు లోకాయుక్తను ఆశ్రయించేందుకు సిద్ధం కావడంతో ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది.
 కథా కమామిషు ఇదీ..
 జీవిత బీమా సంస్థలో పనిచేసే ఏజెంట్లు సొసైటీగా ఏర్పడి కాలనీ నిర్మించుకునేందుకు స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 2004లో  ‘ఆదిలాబాద్ ఎల్‌ఐసీ ఏజెంట్ల మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’గా 130 మంది ఏజెంట్లతో సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ పేరు మీదే బట్టిసావర్‌గాం పరిధిలోని న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో పదెకరాల ప్రభుత్వ స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ లోగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా నియమితులైన వొడ్నాల వెంకటేశం, చిల్కూరి దేవన్న సంఘ సభ్యులు ఒక్కొక్కరి నుంచి సొసైటీకి కేటాయించే అసైన్డు భూమికి ప్రభుత్వ ధర చెల్లించేం దుకు రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున జమ చేశారు.
 అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో మాదాసి నర్సింహులు జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ(జీపీఏ)గా ఉన్న 72/2 సర్వే నంబర్‌లోని పదెకరాల స్థలానికి సొసైటీకి ఇచ్చేలా నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కేవలం ఐదెకరాలు మాత్రమే సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి రెవెన్యూ అధికారులు, మరో ఐదెకరాలు ఆ సం ఘం అధ్యక్ష, కార్యదర్శులతోపాటు మరో ఐదుగురు, వారి కుటుంబసభ్యులపై రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది.

 మాదాసి నర్సింహులు దగ్గర సొైసైటీ కోసం రూ.2.75 లక్షల చొప్పున కొనుగోలు చేసిన ఆ స్థలం విలువ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ప్రస్తుతం ఎకరానికి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి పలుకుతుంది. మొత్తం పదెకరాల నుంచి సొసైటీ పేరిట ఉన్న ఐదెకరాల్లో ప్లాట్లు చేసిన సంఘ నాయకులు కేవలం 30 మందికి కేటాయించి 100 మందికి మొండిచేయి చూపారు. భూముల ధర అమాంతం పెరగడంతో తమ పేర్లపై సొసైటీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం కావడం వివాదాస్పదంగా మారింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement