Sakshi News home page

ఆయనకిస్తే కుస్తీయే!

Published Sat, Jan 11 2014 2:51 AM

ఆయనకిస్తే కుస్తీయే! - Sakshi

  ‘రెబల్‌స్టార్’ చేరికతో బీజేపీలో ఇంటిపోరు!
  కాకినాడ పార్లమెంటు స్థానంపై కృష్ణంరాజు కన్ను!
  తమకు అవకాశం ఇవ్వకపోతే ఊరుకోబోమంటున్న నేతలు
  అవసరమైతే అధిష్టానం వద్ద
  తేల్చుకుంటామంటున్న ఆశావహులు
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :
 జిల్లా రాజకీయాల్లో ఎటువంటి ప్రభావమూ చూపని బీజేపీకి కూడా ఇంటిపోరు తప్పడం లేదు. ఒకప్పుడు ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఆ తరువాత రాజకీయాలకు దూరమైన కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు ఇటీవల మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడమే ఇందుకు కారణమవుతోంది. ఆయన కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశిస్తున్నట్టు అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అదే కనుక జరిగితే తాము అవకాశాలు కోల్పోతామని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పార్టీని నమ్ముకున్నవారిని కాదని కొత్తగా వలస వచ్చిన వారికి సీటు కేటాయిస్తే పార్టీని వీడాల్సి వస్తుందని సీనియర్లు చెబుతున్నారు. ప్రధానంగా కాకినాడ పార్లమెంట్ స్థానంపై ఆశలు పెంచుకున్న నాయకులకు కృష్ణంరాజు చేరిక రుచించడం లేదు.
 
 ఆశావహులెందరో..
  గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిన బిక్కిన విశ్వేశ్వరావు వచ్చేసారి మళ్లీ బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేసి, రూ.3 కోట్లు ఖర్చు చేసి, అప్పటినుంచీ పార్టీ కోసం పని చేస్తున్న తమను కాదని, హఠాత్తుగా వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తే ఊరుకోబోమంటున్నారు. బిక్కిన ఇప్పటికే హోర్డింగ్‌లు కూడా సిద్ధం చేసుకున్నారు.
 
  మరోపక్క బీసీ సామాజికవర్గ నాయకుడు వాసంశెట్టి సత్య కూడా కాకినాడ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్టు రేసులో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అధిక సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి కూడా టీడీపీ టిక్కెట్టు తనకే వస్తుందని ఆశించారు. అయితే, కైట్ విద్యా సంస్థల అధినేత పోతుల వెంకట విశ్వాన్ని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో సత్య ‘సైకిల్’ దిగి కమలం గూటికి చేరారు. బీజేపీలో బీసీ కోటాతో అయినా కాకినాడ సీటు వస్తుందన్న భరోసాతో ఉన్న సత్య ఆశ.. కృష్ణంరాజు చేరికతో అడియాస అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ‘బీజేపీలోకి వచ్చి తప్పు చేశానా?’ అని ఆయన మధనపడుతున్నారు.
 
  బీజేపీ సీనియర్ నాయకుడు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పైడా కృష్ణమోహన్ పార్లమెంట్ లేదా, కాకినాడ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న ఆయన ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
 
  ఇంతమంది కాకినాడ సీటుపై ఆశ పడుతుంటే పార్టీలో చేరీ చేరగానే కృష్ణంరాజుకు సీటు ఎలా ఇస్తారో చూస్తామని నాయకులు అంటున్నారు. అవసరమైతే ఈ విషయాన్ని అధిష్టానం వద్దనే తేల్చుకోవాలనుకుంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement