వేయి నుంచి ‘నూరు కాళ్లు’ | Sakshi
Sakshi News home page

వేయి నుంచి ‘నూరు కాళ్లు’

Published Tue, Jan 7 2014 3:16 AM

వేయి నుంచి ‘నూరు కాళ్లు’

సాక్షి, తిరుమల: తిరుమలలో కూల్చివేసిన వేయికాళ్ల మండపాన్ని తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉన్న శ్రీనివాసమంగాపురంలో నూరుకాళ్లతో నిర్మించేందుకు టీటీడీ సిద్ధమైంది. శ్రీవారి ఆలయం ముందున్న వేయికాళ్ల మండపాన్ని తిరుమల మాస్టర్‌ప్లాన్‌కింద 2003లో కూల్చివేసిన విషయం తెలిసిందే. పదేళ్లుగా నలుగుతున్న ఈ మండ పం వివాదాన్ని పరిష్కరించే దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది.
 
మండపం తిరుమలలో వద్దంటున్న భద్రతా కమిటీ
 
కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలో నూరుకాళ్ల మండపం నిర్మించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు కూల్చివేసిన రాతి స్తంభాలతోనే 2009లో ప్రారంభమైనా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కోర్టు ఉత్తర్వులతో గత ఏడాది  రాష్ట్ర పోలీసు, టీటీడీ అధికారులు ఆరుగురితో టీటీడీ ధర్మకర్తల మండలి కమిటీ వేసింది. టీటీడీ సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, రాష్ర్ట ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ ఐజీ మహేష్ భగవత్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, ఎస్‌బీ డీఐజీ వీసీ సజ్జనార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డితో కూడిన కమిటీ వేశారు.

సోమవారం కమిటీ సభ్యులు ఆరుగురూ కూల్చివే సిన మండపాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆలయం వద్దే నిర్మించడం వల్ల తీవ్రమైన భద్రతా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా నూరుకాళ్ల మండపాన్ని పాపవినాశనం వెళ్లే మార్గంలోని పారువేట మండపం పక్కనే నిర్మించాలన్న ప్రతిపాదన కూడా సరైనది కాదనే అభిప్రాయంతో కమిటీ ఉంది. అక్కడ నిర్మించటం వల్ల సరైన పర్యవేక్షణ లేక మండపం శిధిల స్థితికి  చేరుకోవడంతో పాటు భద్రతా సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్ధారించారు.

వేయికాళ్ల మండపాన్ని తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నిర్మించాలని టీటీడీ సిద్ధమవుతోంది.. కూల్చివేసిన చోటే మండపాన్ని నిర్మించాలని చినజీయరు స్వామి కోరుతుంటే.. అలా చేస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తప్పవని నిఘా, భద్రతా అధికారులు తేల్చిచెప్పారు. దీంతో చినజీయరు స్వామిని కూడా ప్రసన్నం చేసుకోడానికి  శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తిరుమలలోని పురాతన మండపాన్ని పునరుద్ధరించేందుకు ఎలాంటి అవరోధాలు ఉండవనే భావనతో టీటీడీ ఉంది.
 
స్థలం పరిశీలిస్తున్నాం : జేఈవో
 
వేయికాళ్ల మండపం స్థానంలో నిర్మించాలని తలపెట్టిన నూరుకాళ్ల మండపం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇందుకోసం బోర్డు నియమించిన సిక్స్‌మెన్ కమిటీ సోమవారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిందన్నారు. సున్నితమైన ఈ అంశంపై మరో మారు చర్చించి సిఫారసులను టీటీడీ ధర్మకర్తల మండలికి అందజేస్తామన్నారు. వీటితోపాటు మరో మూడు నెలల్లో ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్‌లోని తూర్పుమాడ వీధి పనులు పూర్తి చేసేలా కమిటీ నిర్ణయించిందన్నారు. అలాగే, ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పనులు కూడా మూడో దశలో ఉన్నాయని అన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement