లోపాల స్కీమ్ | Sakshi
Sakshi News home page

లోపాల స్కీమ్

Published Sat, Jan 18 2014 3:40 AM

Reception is not available from the farmers to rajiv krishi vikas yojana

సాక్షి, కాకినాడ : పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డెయిరీ స్కీమ్‌కు రైతుల నుంచి ఆదరణ లభించడం లేదు. అధికారుల చిత్తశుద్ధి లోపానికి తోడు అర్థం పర్థం లేని నిబంధనలు ఈ పథకాన్ని నీరుగార్చాయి. మూడేళ్లుగా మూలుగుతున్న నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడింది.

 దారిద్య్రరేఖకు దిగువన ఉండి పాడి పరిశ్రమను స్థాపించాలనుకునే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో రాజీవ్ కృషి వికాస యోజన(ఆర్‌కేవివై) కింద 2011లో డెయిరీ స్కీమ్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున పాడి పరిశ్రమలు (డెయిరీలు) ఏర్పాటు చేయడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచాలని ఆశించారు.

 ఇందుకోసం ఐదు ముర్రాజాతి గేదెలు లేదా ఐదు సంకర జాతి ఆవులతో మినీ డెయిరీ, 20 ముర్రాజాతి గేదెలు లేదా 20 సంకర జాతి ఆవులతో మీడియం డెయిరీలను 25 శాతం సబ్సిడీతో ఈ పథకం కింద ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ పథకం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా జిల్లాలో కనీసం పట్టుమని పది యూనిట్స్ కూడా గ్రౌండ్ చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో నిధులుండీ కూడా ఈ ప్రాజెక్టు ముందుకు కదలని బండిలా తయారైంది.

 మినీడెయిరీలకు స్పందన కరువు
 తొలిఏడాది మినీడెయిరీలకు సంబంధించి  మంజూరైన 276 యూనిట్స్‌కు కేవలం 138 యూనిట్స్‌కు మాత్రమే సబ్సిడీ మొత్తంగా రూ.69 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఆ ఏడాది కేవలం 30 యూనిట్స్‌ను మాత్రమే అతికష్టమ్మీద గ్రౌండ్ చేయగలిగారు. వీటికోసం రూ.13 లక్షలను సబ్సిడీ మొత్తంగా అందజేశారు. మిగిలిన 108 యూనిట్స్‌కు సంబంధించిన సబ్సిడీ మొత్తం మిగిలిపోయింది.

2012-13లో యూనిట్ విలువను రూ.3.28 లక్షలకు పెంచి సబ్సిడీ మొత్తాన్ని రూ.80 వేలుగా నిర్ధారించారు. కొత్తగా 72 యూనిట్స్ మంజూరు చేశారు. ఇందుకోసం రూ.66 లక్షలు విడుదల చేశారు. కానీ ఆ ఏడాది  కనీసం 13 యూనిట్స్‌కు మించి గ్రౌండ్ చేయలేకపోయారు. వీటి కోసం రూ.8.95 లక్షలను సబ్సిడీ మొత్తంగా అందజేశారు.

 ఈ ఏడాది మరీ ఘోరం
 గత రెండేళ్లలో మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని 2013-14లో రూ.3.28 లక్షల యూనిట్ విలువతోనే ఏకంగా 177 యూనిట్స్ (ఓసీ, బీసీ-124, ఎస్సీ-39, ఎస్టీ-14) మంజూరు చేశారు. ఐదు గేదెలంటే ఎవరూ ముందుకు రావడం లేదనే ఆలోచనతో రెండు గేదెలతోనైనా యూనిట్ మంజూరు చేయాలని నిబంధనలో మార్పు కూడా తీసుకొచ్చారు. అయినా ఫలితం శూన్యం. గత రెండేళ్ల కంటే అత్యల్పంగా కేవలం మూడంటే మూడు యూనిట్స్‌ను మాత్రమే అతికష్టమ్మీద గ్రౌండ్ చేయగలిగారు.

 మీడియం డెయిరీల పరిస్థితీ అంతే
 మీడియం డెయిరీ ప్రాజెక్టు కింద తొలి ఏడాది జిల్లాకు ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు. 2012-13లో ఆరు యూనిట్స్ మంజూరు చేస్తే రెండు యూనిట్స్‌ను గ్రౌండ్ చేయగలిగారు. ఇక 2013-14లో మరో నాలుగు యూనిట్స్ మంజూరు చేస్తే కేవలం ఒకే ఒక్క యూనిట్‌ను మాత్రమే అతికష్టమ్మీద గ్రౌండ్ చేయగలగడం పరిస్థితికి అద్దం పడుతోంది.

 సబ్సిడీయే ప్రధాన అడ్డంకి
 కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆర్‌కేవీవై, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన సీఎం ప్యాకేజీల కింద మంజూరు చేసే ఒక గేదె/ఆవు యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఆర్‌కేవీవైలో రూ.74,115 విలువైన గేదెను, సీఎం ప్యాకేజీలో కూడా రూ.40వేల విలువైన గేదెను 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారు. అదే ఆర్‌కేవివైలో రూ. 60,235 విలువైన సంకరజాతి ఆవును, సీఎం ప్యాకేజీలో రూ.35వేల విలువైన సంకరజాతి ఆవును 50శాతం సబ్సిడీతోనే అందజేస్తున్నారు.

 ఒక గేదె తీసుకుంటేనే 50 శాతం సబ్సిడీ ఇస్తుంటే ఐదు గేదెలు తీసుకుంటే సబ్సిడీ మొత్తాన్ని పెంచాల్సింది పోయి 25 శాతం మాత్రమే ఇవ్వడమేమిటంటూ పాడిరైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు బ్యాంకర్ల అనాశక్తత కూడా పథకం నీరుగారడానికి కారణమవుతోంది. ఈ పథకంలో పాడిగేదెలకు రుణాలిచ్చేందుకు ఏ బ్యాంకు ఆసక్తి చూపడంలేదని పశుసంవర్ధక శాఖాధికారులే అంటున్నారు. లబ్దిదారులను ఒప్పిస్తున్నప్పటికీ బ్యాంకర్ల నిరాశక్తత కారణంగా సుమారు 20 శాతానికి పైగా యూనిట్స్ గ్రౌండ్ చేయలేకపోయామని చెబుతున్నారు.

 25 శాతం సబ్సిడీ కూడా ఈ స్కీమ్‌పై పాడిరైతుల నిరాశక్తతకు కారణంగా నిలుస్తోంది. మొత్తమ్మీద నిధులుండి కూడా ఈ పథకం నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు మాత్రమే గడువు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి కన్పించడంలేదు. దీంతో ఈ ఏడాది కూడా నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లు మిగిలిన నిధులను మరుసటి ఏడాది మంజూరు చేసే యూనిట్స్‌కు సర్దుబాటు చేసినప్పటికీ 2014-15లో ఆ పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. దీంతో మిగిలిన నిధులు వెనక్కి మళ్లే అవకాశం లేకపోలేదంటున్నారు.

 బ్యాంకు రుణం చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం
 మినీడెయిరీ స్కీమ్‌లో ఐదుగేదెల యూనిట్ తీసుకున్నాం. హర్యానా నుంచి తీసుకొచ్చేందుకు రవాణాకు ఒక్కొక్క గేదెకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చయింది. నిబంధనల వల్ల ఇక్కడ రూ.40వేలున్న గేదెను అక్కడ రూ.60 వేలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క గేదెకు రూ.23 వేల మేర నష్టపోయాం.

సబ్సిడీగా ఇచ్చిన రూ.80,125 వేల సొమ్ము దీనికి సరిపోయింది. ఒక్కొక్క గేదెకు రోజుకు రూ.140లు ఖర్చవుతుంది. రోజుకు అయిదు లీటర్ల వరకు పాలిస్తుండడంతో ఆ వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతోంది. బ్యాంకు రుణం చెల్లించడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. - బొరుసు గౌరీ శేషవేణి, లబ్దిదారురాలు,జి.పెదపూడి, పి.గన్నవరం మండలం.
 
 గ్రౌండ్ చేసేందుకు చాలా ప్రయత్నం చేశాం
 టార్గెట్‌కనుగుణంగా యూనిట్ల ఏర్పాటు కాకపోవడానికి సబ్సిడీ తక్కువగా ఉండడం.. బ్యాంకర్లు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలున్నాయి. అయినప్పటికీ యూనిట్ల ఏర్పాటుకు పాడిరైతులను ప్రోత్సహిస్తూనే ఉన్నాం. నిధులు మురిగిపోకుండా యూనిట్లు గ్రౌండ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. - లివింగ్ స్టన్, జాయింట్  డెరైక్టర్,  జిల్లా పశుసంవర్ధక శాఖ.

Advertisement
Advertisement