ముగిసిన వైద్యుల నియామక కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

ముగిసిన వైద్యుల నియామక కౌన్సెలింగ్

Published Sun, Feb 9 2014 2:16 AM

ముగిసిన వైద్యుల నియామక కౌన్సెలింగ్

  • రాష్ట్ర వ్యాప్తంగా   1,009 పోస్టుల భర్తీ  
  •  పోస్టింగ్ ఆర్డర్ల కోసం అభ్యర్థుల పడిగాపులు
  •  జిల్లాలో పోస్టింగ్ తీసుకున్న 40 మంది  
  •  విజయవాడ, న్యూస్‌లైన్ : వైద్య ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) నియామకాలకు సంబంధించి నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టుల కోసం 1,239 మంది హాజరగా, వారిలో 1,009 మంది పోస్టింగ్‌లు పొందారు. మిగిలిన వారు వివిధ కారణాలతో పాటు, తాము కోరుకున్న ప్రాంతంలో ఖాళీలు లేక పోస్టింగ్ తీసుకోవడానికి నిరాకరించారని సమాచారం.

    హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 5, 6వ తేదీల్లో నియామక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కేవలం ఒక్క రోజు ముందు ప్రకటించిన ఉన్నతాధికారులు, అందుకు తగిన ఏర్పాట్టు చేయలేదు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆద్యంతం నత్తనడకన సాగింది. అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న తీరుపై అభ్యర్థులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో రెండు రోజుల్లో ముగియాల్సిన కౌన్సెలింగ్‌కు నాలుగు రోజులు పట్టింది.

    శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలపాటు అభ్యర్థుందరికీ కౌన్సెలింగ్ పూర్తి చేశారు. వారికి శనివారం నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. అయితే కంప్యూటర్ ప్రింటర్లు మొరాయించడం, విద్యుత్ కోతకారణంగా మధ్యాహ్నం వరకూ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఒక్కరోజు ముందు ఫోన్‌చేసి కౌన్సెలింగ్‌కు పిలవడంతో చంటిబిడ్డలతో వచ్చామని, నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

    పోస్టింగ్ ఆర్డర్ల కోసం శనివారం నాలుగు వందల మంది అభ్యర్థులు పడిగాపులుకాశారు. సీఏఎస్‌ల నియామకాల్లో భాగంగా కృష్ణా జిల్లాలో 40 మంది కొత్త వైద్యులు పోస్టింగులు పొందారు. వారంతా 15 రోజుల్లో విధుల్లో చేరతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరసిజాక్షి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement