Sakshi News home page

ఎర్ర చందనానికి ఎందుకంత క్రేజ్?

Published Tue, Apr 7 2015 8:28 PM

ఎర్ర చందనానికి ఎందుకంత క్రేజ్?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా దొరికే ఎర్ర చందనానికి అంతర్జాతీయ డిమాండ్ ఎంతో ఉంది. దీంతో అక్రమంగా చెట్లను నరికేసి దుంగలకు తరలించే దొంగలు కూడా ఎక్కువే. అలా దొంగల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఎర్ర చందనం దుంగల్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం వేయగా అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి.

కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డెరైక్టర్ జనరల్ అనుమతితో 2014, డిసెంబర్ నెలలో 4,160 టన్నుల ఎర్ర చందనాన్ని ఏపీ ప్రభుత్వం ఈ వేలం వేయగా ఈ వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి. వేలంలో టన్నుకు 27.41 లక్షల రూపాయల ధర పలికింది. దొంగల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనంలో ప్రభుత్వం వద్ద ఇంకా 4,694 టన్నుల చందనం ఉంది. దీన్ని ఈ ఏడాది ప్రభుత్వం వేలం వేయాలని భావిస్తోంది. రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారంటూ విపక్షం నుంచి వచ్చిన విమర్శలకు ఎర్ర చందనాన్ని వేలం వేయడం ద్వారా మాఫీ చేస్తానని ఓ దశలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం తెల్సిందే.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్ర చందనాన్ని కొనుగోలు చేయడానికి చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు ముందున్నాయి. ‘అంతర్జాతీయ ప్రకృతి సంపద పరిరక్షణ సంఘం’ జాబితాలో చోటు చేసుకోవడం వల్ల ఎర్ర చందనం క్రయవిక్రయాలపై అంతర్జాతీయంగా పలు అంక్షలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించివున్న శేషాచలంలో అడవుల్లో 4.67 లక్షల హెక్టార్లలో ఎర్ర చందనం వనాలు విస్తారంగా ఉండడంతో అంతర్జాతీయ ఆంక్షల అడ్డంకి మనకు పెద్దగా లేదు. అలా అని చెట్లను పూర్తిగా నరికేసుకుంటామంటే కుదరదు. వేలం వేయడానికి కూడా కేంద్రం అనుమతి తప్పనిసరి.

అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విస్తారంగా ఎర్ర చందనం వనాలు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందే. అందుకనే చందనం వేలం ద్వారా వచ్చే సొమ్ములో 30 శాతం సొమ్మును ఆ వనాల పరిరక్షణకు, మిగతా 70 శాతం సొమ్మును రైతుల రుణాల మాఫీకి ఉపయోగిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

పురుషుల్లో వంధ్యత్వం నివారణకు, మహిళల్లో సంతానప్రాప్తికి ఉపయోగించే మందుల్లో ఎర్ర చందనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా విలాసవంతులు ఎర్రచందనంతో ఫర్నీచర్ కూడా చేయించుకుంటారు.
 

Advertisement

What’s your opinion

Advertisement