రెడ్డెమ్మ సొమ్ముకే ఎసరు | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మ సొమ్ముకే ఎసరు

Published Mon, Aug 26 2019 9:36 AM

Reddemma Konda Temple Revenue Corruption in Chittoor - Sakshi

మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయ ఆదాయంలో రూ.4.5 కోట్ల నిధులు గోల్‌మాల్‌ జరిగాయి. నాలుగేళ్లుగా ఆలయ ఆదాయ, వ్యయ వివరాల రికార్డులను అధికారులు మాయం చేశారు. హుండీ ఆదాయం లెక్కించే సమయంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లడ్డూ తయారీలో గతంలో వేలం పాటలు నిర్వహించే పద్ధతికి స్వస్తి చెప్పి అధికారులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. 

సాక్షి, గుర్రంకొండ(చిత్తూరు) : రాయలసీమలోనే సంతాన దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ రెడ్డెమ్మ కొండ ఆలయంలో నాలుగేళ్లుగా  ఆదాయ లెక్కల వివరాలు గల్లంతయ్యాయి. ఆలయ అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి భద్రపరచాల్సిన దేవాదాయ శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించారు. హుండీ ఆదాయం లెక్కింపులో నిబంధనలు పాటించడం లేదు. దేవాదాయశాఖకు చెందిన వారిని కాకుండా తమకు అనుకూలమైన వ్యక్తులతో, విద్యార్థులతో హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. హుండీ ఆదాయం లెక్కింపులో కొంతమంది రూ.2వేలు, రూ.500 నోట్లు మాయం చేస్తున్నారు. బంగారం అసలైనదా కాదా అని నిర్ధారించడానికిగానూ ప్రయివేట్‌ అప్రైజర్లను తీసుకొచ్చి స్వాహా చేస్తున్నారు. 

దొడ్డిదారిన నియామకాలు
గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి ఆలయంలో ఉద్యోగులను దొడ్డిదారిని నియమించేశారు. జీవో నెంబరు 19 సాకుగా చూపించి అప్పుడు పనిచేసే ఈవోనే స్వయంగా ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించడం గమనార్హం. ఒక్కొక్కరికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు జీతాలు చెల్లిస్తూ మొత్తం 12 మందిని ఆలయంలో ఉద్యోగులుగా నియమించారు.

నాలుగేళ్లుగా మారిన తంతు
కాంట్రాక్టర్లు లడ్డూ తయారీని సక్రమంగా నిర్వహించడం లేదనే సాకుతో వేలం పాటలు నాలుగేళ్ల క్రితం రద్దు చేశారు.  అప్పటి నుంచి దేవాదాయశాఖ అధికారులే లడ్డూల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు.  ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మవారి లడ్డూ బరువు 80 గ్రాముల బరువు ఉండాలి. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న లడ్డూ బరువు 60 గ్రాముల లోపే ఉంది. లడ్డూల విక్రయం ద్వారా ఏడాదికి రూ. 24 లక్షల నుంచి రూ. 26 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక్కో లడ్డూ ధర రూ. 10గా నిర్ణయించి విక్రయిస్తుంటారు. నిబంధనల మేరకు లడ్డూ ప్రసాదాల తయారీ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రయివేట్‌ వ్యక్తుల వద్ద లడ్డూలను అధికారులు కొనుగోలు చేసి ఆలయానికి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

నాలుగేళ్ల వివరాలు లేవు
2014–2018 వరకు రెడ్డెమ్మకొండ ఆదాయ, ఖర్చు వివరాలు అందుబాటులో లేవు. గతంలో పనిచేసిన అధికారులు వాటిని ఇక్కడ స్వాధీనం చేయలేదు. దీంతో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మావద్ద లేవు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను అప్పుడు పనిచేసే ఈవో నియమించారు. లడ్డూ తయారీని కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా మేమే స్వయంగా తయారు చేయించి ఆలయంలో విక్రయిస్తున్నాం.    
– మునిరాజ, శ్రీరెడ్డెమ్మకొండ ఈవో  

Advertisement
Advertisement