పశ్చిమ డెల్టా లో తగ్గిన వరి పంట | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టా లో తగ్గిన వరి పంట

Published Mon, Dec 30 2013 12:10 AM

reduced paddy crop in west delta

 సాక్షి, గుంటూరు: ఈ ఏడాది వరుస తుపాన్లు జిల్లా రైతును నిలువునా ముంచేశాయి. సెప్టెంబరు నుంచి అక్టోబరు చివర వరకూ వెంటాడిన తుపానులతో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా ఖరీఫ్‌లో వరిసాగు చేసిన రైతులకు పెట్టుబడులు దక్కడమే కష్టమైంది. జిల్లా అంతటా ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 10 బస్తాలు నష్టపోయారు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు సుమారు రూ.15 వేలకు పైగా ఆదాయం నష్టపోయారు.

జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వల కింద, కుడికాల్వ ఆయకట్టు కింద కలిపి ఏడు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరిసాగు చేశారు. విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపులు, కోతలు, నూర్పిళ్లు.. ఇలా అన్నింటికీ కలిపి ఎకరాకు సుమారు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చయ్యాయి. కౌలు రైతులైతే డబ్బు కౌలు చెల్లించి మరీ పొలాల్ని సాగుకు తీసుకున్నారు. తీరా చేతికందిన పంట చూస్తే ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు కూడా కనిపించడం లేదు.

      కిందటేడాది ఎకరాకు గరిష్టంగా 40 బస్తాల పంట దిగుబడి తీసిన రైతాంగం ఈ ఏడాది దిగుబడిని చూసి కంగుతింటున్నారు. తెనాలి కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో వరి కోతలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. 40 శాతం మంది రైతులు కుప్పలు నూర్చి ధాన్యాన్ని ఇళ్లకు చేర్చారు. మిగతా రైతులు పొలంలోనే కుప్పలేశారు. సాగర్ కుడికాల్వ  కింద ఆలస్యంగా నాట్లు పడటంతో కోతలు కూడా ఆలస్యంగానే వచ్చాయి. ఇప్పుడిప్పుడే అందుతున్న దిగుబడుల్ని చూసి రైతాంగం కలవరపడుతోంది. పంటల సాగు కోసం బ్యాంకుల్లోనూ, ప్రయివేటు వ్యక్తుల దగ్గరా తీసుకున్న అప్పులకు సరిపడా దిగుబడులన్నా అందుతాయని కలలుగన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. సుమారు రెండు లక్షల ఎకరాల్లో దిగుబడులు బాగా తగ్గాయని వ్యవసాయ శాఖ అంచనా.

 బావురుమంటోన్న కౌలు రైతులు
 జిల్లాలోని కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరాకు రూ.10 వేల వరకూ ముందస్తు కౌలు చెల్లించి పొలాలను కౌలుకు తీసుకున్న రైతులు దిగుబడులు తగ్గడంతో తీవ్రంగా నష్టపోయారు. వేమూరు, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, పొన్నూరు, తెనాలి, బాపట్ల, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండ లాల్లో ఉన్న 60 శాతం కౌలు రైతులు కౌలు చెల్లింపులతో కలిపి ఎకరాకు రూ.20 వేలకు పైగా నష్టపోయినట్లు సమాచారం.

 బ్యాంకులు అప్పులివ్వకపోవపడంతో  అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వరి పంట సాగు చేశామనీ, ప్రకృతి ప్రకోపంతో ఆశలన్నీ అడియాశలయ్యాయని చెరుకుపల్లి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంట పైనే ఆశలు పెట్టుకున్నామనీ, కాలం కలిసి వస్తే రెండో పంట ద్వారానైనా చేసిన అప్పులు తీర్చుకుంటామని వీరంటున్నారు.

Advertisement
Advertisement