చుక్కల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు | Sakshi
Sakshi News home page

చుక్కల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు

Published Thu, Nov 27 2014 1:42 AM

Registration hike charges

విజయవాడ : రిజిస్ట్రేషన్ శాఖలో స్టాంప్ డ్యూటీ చార్జీలు గురువారం నుంచి భారీగా పెరగనున్నాయి. గతంలో ఉన్న చార్జీల కంటే సగానికి సగం పెంచుతూ టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై మరింత అదనపు భారం పడనుంది. జిల్లాలోని 28 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా విధించింది. ఇప్పటికే అక్టోబర్ నాటికి రూ.350 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా లభించింది. సేల్ డీడ్‌ల (అమ్మకాలు)పై ఒక  శాతం స్టాంప్ డ్యూటీ పెరిగింది. ఫీజులు కూడా 0.5 శాతం పెంచారు. మొత్తం మీద సేల్ డీడ్‌లపై ఆరు శాతం నుంచి 7.5 శాతానికి స్టాంప్ డ్యూటీ, ఫీజులు పెరిగాయి. అంటే లక్ష రూపాయల విలువ గల ఆస్తి రిజిస్ట్రేషన్ చేసేవారిపై రూ.1,500 అదనంగా భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గిఫ్ట్ డీడ్‌లు, సెటిల్‌మెంట్‌లకు కూడా స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం పెంచింది.

గతంలో గిఫ్ట్ డీడ్‌లకు సంబంధించి ఒక శాతం స్టాంప్ డ్యూటీ ఉండగా, అది మూడు శాతానికి పెరిగింది. సెటిల్‌మెంట్ డీడ్‌కు సంబంధించి ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచారు. పార్టిషన్ డీడ్‌కు సంబంధించి గతంలో ఉన్న రూ.20 వేల ఫీజును రద్దు చేసి, దానికి కూడా ఒక శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా స్టాంప్ డ్యూటీలు, ఫీజులు పెంచడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement