పునరావాసం కార్యక్రమాల్లో జాప్యంపై అసంతృప్తి : కలెక్టర్ అహ్మద్ బాబు | Sakshi
Sakshi News home page

పునరావాసం కార్యక్రమాల్లో జాప్యంపై అసంతృప్తి : కలెక్టర్ అహ్మద్ బాబు

Published Wed, Aug 14 2013 6:10 AM

Rehabilitation programs delayed discontent: Collector Babu Ahmed

ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు నిర్వాసితులకు రెండ్రోజుల్లో పరిహారం అందించాలని కలెక్టర్ అహ్మద్ బాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాజెక్టు ముంపు బాధితుల పునరావాసం కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిపేట, నంనూర్, రాంపల్లి, కొండపల్లి గ్రామాల్లో 1,719 మంది బాధితులకు పునరావాసం డబ్బులు మంజూరు చేయాలని 20 రోజుల క్రితం చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌ఆర్ ఇంజినీర్, ప్రిన్సిపాల్ సెక్రెటరీలతో మాట్లాడి రూ.35 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. 20 రోజులు గడుస్తున్నా సమాచారం అందించలేదని పునరావాస కార్యక్రమాల అధికారి ఎస్.తిరుపతిరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం కల్పించాలని ఆదేశిస్తే డబ్బులు విడుదల కాలేదని చెబుతారు, డబ్బులు విడుదలైతే విచారణ, తదితర కారణాలు చూపుతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
 
 300 మందికి పరిహారం అం దించేందుకు సిద్ధం చేసినట్లు తిరుపతిరావు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 65 గేట్లకు గాను 45 గేట్లు పూర్తయ్యాయని, మిగతా వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని కలెక్టర్ చెప్పారు. అక్టోబర్‌లో ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల బాధితులను తక్షణమే ఖాళీ చేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సుజాతశర్మ, ఏజేసీ వెంకటయ్య, డీఆర్వో ఎస్‌ఎస్ రాజు, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, గజ్జన్న, నర్సింగ్‌రావు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ అశోక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
 
 ఓటరు నమోదు దరఖాస్తులు పరిశీలించాలి
 కలెక్టరేట్ : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది, ఇవీఎంల పరిశీలన వంటి కార్యక్రమాలను పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఫారం 6, 7, 8, 8ఏ ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరిం చామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన 85 శాతం పూర్తి చేశామని, జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో విల్‌ఫోన్లతో పోలింగ్ కేంద్రా ల కనెక్టివిటీ చేయడం జరిగిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల నుంచి కనెక్టివిటీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఎస్డీసీ, కేఆర్సీ ఎస్డీసీ, ఉట్నూర్ ఆర్డీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సుజాతశర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్‌ఎస్ రాజు, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, గజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement