చినగంజాం ఎస్సై తొలగింపు | Sakshi
Sakshi News home page

చినగంజాం ఎస్సై తొలగింపు

Published Thu, Oct 2 2014 4:40 AM

చినగంజాం ఎస్సై తొలగింపు - Sakshi

గుంటూరు క్రైం : బాధ్యతారహితంగా ఉన్న ప్రకాశం జిల్లా చినగంజాం ఎస్సై దిడ్ల కిషోర్‌బాబును విధుల నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కిషోర్‌బాబు.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పలు మార్లు అధికారులు గుర్తించారు. తీరు మార్చుకోవాలని అధికారులు హెచ్చరించినా ఆయనలో మార్పు రాకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సై కిషోర్‌బాబును విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఏఎస్సై సస్పెన్షన్
భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పామూరు  ఏఎస్సై షేక్ గౌస్‌బాషాను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అదే గ్రామానికి చెందిన  ఇల్లూరి రమణమ్మ ఈ ఏడాది జనవరి 28న భూ వివాదంలో మరో వర్గం వారు తనపై దాడికి యత్నించారని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని ఖాళీ చేసే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏఎస్సై ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా కేసు నమోదు చేశారు. పోలీసు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఎస్సై వ్యవహరించారని ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా ఏఎస్సై గౌస్‌బాషాను సస్పెండ్ చేస్తూ ఐజీ
ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఒంగోలు క్రైం : చినగంజాం ఎస్సై పనితీరుపై ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కిశోర్‌బాబు తొలుత మద్దిపాడులో ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అక్కడి నుంచి చినగంజాం బదిలీ అయ్యరు. సాధారణంగా కొత్తగా ఎస్సై విధుల్లో చేరిన తర్వాత రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పిరియడ్ ఉంటుంది. అతని ప్రవర్తన, పనితీరు, ప్రజలకు సేవ చేసిన తీరుతెన్నులను పరిశీలించిన తర్వాత పోలీస్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. అనంతరం సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. అప్‌గ్రేడ్ కాకుండానే   తొలగించడం గమనార్హం.

Advertisement
Advertisement