Sakshi News home page

బోటు ప్రమాదం: ఆ మంత్రులను బర్తరఫ్‌ చేయండి!

Published Mon, Nov 13 2017 12:35 PM

remove those ministers from cabinet, demands YSRCP - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోటు బోల్తా పడి.. 20మంది చనిపోయిన తీవ్ర విషాద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ దుర్ఘటనకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యమే కారణమని మండిపడింది. ఈ ప్రమాదానికి కారణమైన హోం, ఇరిగేషన్‌, టూరిజంశాఖల మంత్రులను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పేర్కొంది. వైఎస్సార్సీపీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పార్థసారథి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, జోగీ రమేశ్‌, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం ప్రమాద స్థలాన్ని సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.


ఇంత ఘోరమా? ఇంత దారుణమా?
మరి ఘోరమైన విషయమేమిటంటే బోటు ప్రయాణికులు కనీసం లైవ్‌ జాకెట్లు ఇవ్వలేదు. లైవ్‌ జాకెట్లు  ఇవ్వకుండా 38మంది ప్రయాణికులను బోటు ఎక్కిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బోటుకు లైసెన్స్‌ కూడా లేదు. రూటుమ్యాప్‌ క్లియర్‌గా లేకపోవడం, కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్లే ప్రమాదం జరిగింది. ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంది. ఈ ప్రమాదంలో ఒంగోలు వాసులు ఎక్కువమంది చనిపోయారు. బాధితులను పరామర్శించడానికి నేను అర్ధరాత్రి హుటాహుటిన వస్తే.. ప్రమాద స్థలంలో ఎవరూ లేరు. రాత్రికి రాత్రే మృతదేహాలను ఒంగోలు తరలించారు. ఇంతటి ప్రమాదాన్ని చిన్న విషయంగా చూపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' అని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. పార్టీ తరఫున బాధితుల కుటుంబాలను అన్నివిధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో 30మంది ప్రాణాలను బలిగొన్నారు.. ఇప్పుడు మళ్లీ 20 మందిని బలి తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యం ప్రజల ప్రాణాలకు ఇవ్వడం లేదని, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.

ప్రజల ప్రాణాలతో  ప్రభుత్వం చెలగాటమాడుతోంది 

Advertisement
Advertisement