పోలవరం అక్రమాలపై నివేదిక సిద్ధం! | Sakshi
Sakshi News home page

పోలవరం అక్రమాలపై నివేదిక సిద్ధం!

Published Sun, Jul 7 2019 3:58 AM

Report ready on Polavaram irregularities - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండర్లలోను, పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వడం, పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే వందల కోట్ల రూపాయలు చెల్లించడం వంటి అక్రమాలన్నింటిపై నిపుణుల కమిటీ నివేదిక తుది దశకు చేరింది. ఈ ప్రాజెక్టులో సాగిన అక్రమాలు, అవకతవకలు, అవినీతిపై పక్షం రోజుల్లోగా తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ తొలి నుంచీ వేగంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా 2013లో పోలవరం హెడ్‌ వర్క్స్‌ టెండర్ల నుంచి ఎన్నికల ముందు వరకు వివిధ దశల టెండర్లకు సంబంధించిన రికార్డులను కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. అంతేకాక.. రికార్డుల ఆధారంగా సంబంధిత అధికారుల నుంచి వివరణలూ తీసుకుంది. వీటి ఆధారంగా ‘పోలవరం’లో అక్రమాలపై ప్రాథమిక నివేదికను సోమవారం రూపొందించనుంది. ఆ తర్వాత మరోసారి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాక మంగళవారం ఆ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేయనుంది. ముఖ్యమంత్రికి సమర్పించిన అనంతరం నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించనుంది. అలాగే, పోలవరం కుడి, ఎడమ కాలువలను కూడా కమిటీ పరిశీలించనుంది. 

జలవిద్యుత్‌కూ రూ.470కోట్ల చెల్లింపులు
ఇదిలా ఉంటే.. పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులను అసలు ప్రారంభించనప్పటికీ ఆ పనులు దక్కించుకున్న సంస్థకు ఏకంగా రూ.320 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఎలా ఇచ్చారని కూడా కమిటీ సంబంధిత అధికారులను ప్రశ్నించింది. అలాగే, త్రీ డి నమూనా సర్వే పేరుతో మరో రూ.100 కోట్లు.. డిజైన్ల పేరుతో మరో రూ.50 కోట్లు.. మొత్తం రూ.470 కోట్లను ఎలా చెల్లించారని ప్రశ్నించారు. అధికారుల వివరణలు, రికార్డుల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో ఎక్కడెక్కడ అక్రమాలు, అవినీతి చోటుచేసుకుంది.. ఇందుకు బాధ్యులెవరనే అంశాలపై నిపుణుల కమిటీ సోమవారం ప్రాథమిక నివేదికను రూపొందించనుంది. ఈ నివేదికను మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌కు సమర్పించనుంది. 

అంతా చంద్రబాబు చెప్పిన మేరకే..
ప్రాజెక్టు పనులను తొలుత చేజిక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ.. ఆ పనులను చేయనప్పటికీ దానికి స్పెషల్‌ ఇంప్రెస్ట్‌ మొత్తాన్ని రూ.25 కోట్ల నుంచి రూ.170 కోట్లకు ఎలా పెంచారని నిపుణుల కమిటీ సంబంధిత అధికారులను ప్రశ్నించింది. డీజిల్‌కు, లేబర్‌కు.. అలాగే, ప్రొౖMð్లన్‌ మరమ్మత్తుల పేరుతో ఎటువంటి బిల్లులు, రశీదులు లేకుండా రూ.170 కోట్లను ఎలా చెల్లించారని నిలదీసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు చేశామని వారు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ట్రాన్స్‌ట్రాయ్‌ పనులు చేయకపోయినప్పటికీ రూ.170 కోట్లు ఇవ్వడమే కాకుండా రికవరీ కేవలం రూ.26 కోట్లే చేశారని, మిగతా రూ.144 కోట్ల రికవరీ చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా సంబధిత అధికారుల నుంచి సమాధానం కొరవడింది. అలాగే, పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల అంచనాలను పెంచేశారని, ఆ పెంచిన అంచనాలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకూ మౌనమే సమాధానం వచ్చింది. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను తొలుత ఈపీసీ విధానంలో టెండర్లను పిలవగా 66 సీ కింద రద్దు చేసినప్పటికీ మళ్లీ టెండర్లను పిలవకుండా నామినేషన్‌ మీద ఎలా ఇచ్చారంటూ నిపుణుల కమిటీ ప్రశ్నించగా అంతా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే చేశామని అధికారులు వివరించినట్లు తెలిసింది. 

Advertisement
Advertisement