అంకితభావంతోనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

అంకితభావంతోనే అభివృద్ధి

Published Sun, Jan 27 2019 11:05 AM

Republic Day Celebration In Srikakulam - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  ‘జాతీయ నాయకులు ఆశించిన ఉజ్వల భవిషత్‌ కోసం ప్రతిఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలి. జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు అందరి సహకారం అవసరం. అందరూ సహకరిస్తేనే జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని’ కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి అన్నారు. 70వ గణతంత్ర వేడుకలు శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు.

అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇటీవల జరిగిన జన్మభూమి–మా ఊరు, గ్రామ దర్శిని కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నామన్నారు. సుమారు 26,335 వినతులు వచ్చాయన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిందని, ఉద్దానం ప్రాంతం పూర్తిగా పాడైందన్నారు. బాధితులను ఆదుకోవడానికి తీవ్ర కృషి జరిగిందని చెప్పారు. ఉద్దానం పునర్నిర్మాణానికి  ‘తూర్పు’ కార్యక్రమం చేపట్టామన్నారు.

  వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
 జిల్లా వ్యయవసాయ ఆధారితం కావడంతో రైతులు లాభసాటి వ్యవసాయం దిశగా అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ చెప్పారు. ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, అధిక దిగుబడులు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఖరీప్‌లో రూ.1475 కోట్లు, రబీలో రూ. 428 కోట్లును రైతులకు రుణాలుగా అందించామన్నారు. షెడ్యూలు కులాల వారికి రాయితీతో పనిముట్లు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 8,305 మంది రైతులకు రూ.5.88 కోట్లు బీమాగా అందించామని,  రైతు రుణ మాఫీ కింద 3 లక్షల మందికి రూ. 403 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు వివరించారు. తుంపర, బిందు సేద్యాలకు రూ.29 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

ఉద్యానవన మిషన్‌ద్వారా వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించి రూ. 1459.34 లక్షలు లక్ష్యంగా తీసుకున్నామన్నారు.  పాడి పంట అభివృద్ధికి పశుగ్రాసం పెంపకం, వివిధ కార్పొరేషన్ల ద్వారా పశువుల పంపిణీ చేస్తామన్నారు. మత్స్య సంపదను పెంచేందుకు  ఆక్వా అభివృద్ధి, చెరువుల్లో చేపల పెంపకానికి పెద్ద పీట వేశామన్నారు. జిల్లాలో 12 ఆక్వా సాగు కేంద్రాలు ప్రారంభించామన్నారు. పొలాలకు సాగునీరు అందించేందుకు బీఆర్‌ఆర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు, మూడు పంటలు పండిం చేందుకు రైతులకు అవకాశం ఇస్తామన్నారు. 

వంశధార–నాగావళి అనుసంధానం
వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు జరుగుతున్నాయని కలెక్టర్‌ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. రూ. 84.90 కోట్లుతో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. రూ. 466 కోట్లుతో ఆఫషోర్‌ ప్రాజె పనులు చేపట్టడం జరిగిందన్నారు. వంశధార–బాహుదా నదులు అనుసంధానానికి రూ. 6,342 కోట్లుతో అంచనాలు రూపొందించామన్నారు. 

తాగునీటి నీటి ఎద్దడి నివారణకు..
తాగునీటి సమస్యను అ«ధిగమించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ చెప్పారు. జలుమూరు, సావరకోట మండలాల్లోని 37 గ్రామాల్లో తాగునీరు అందించేందుకు రూ.28 కోట్లు, గార మండలంలోని 18 గ్రామాలకు రూ.4.5 కోట్లుతో పనులు జరుగుతున్నాయన్నారు. ఫోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో రూ.43.60 కోట్లుతో మూడు శుద్ధ జల పథకాలు మంజూరు చేశామన్నారు. ఉద్దానంలో మంచినీటి కోసం రూ.510 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

సర్కార్‌ బడుల బలోపేతానికి చర్యలు
 ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంపై దృష్టిసారించామని కలెక్టర్‌ చెప్పారు. భవనాలు, ప్రహరీల నిర్మాణం, మరమ్మతులు, తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు.  208 పాఠశాలలకు ఆదనపు తరగతి గదులు మంజూరు చేశారు. వైద్యంపై కూడా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఆస్పతుల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరగుతోందని,  వైద్య పరీక్షలకు ఉచిత ల్యాబ్‌లున్నాయన్నారు.
  
మరికొన్నింటిపై దృష్టి...
–పేదవారికి  గత నాలుగున్నరేళ్లలో 89,185 ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్‌ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 3.50 ఎకరాల్లో శాంతినగర్‌ కాలనీలో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నదీతీరంలో రివర్యూ పార్కులను ఏర్పాటు చేస్తునామన్నారు.  ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, పాలకొండ పురపాలక సంఘాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి జరుగుతోందన్నారు. చిన్నారి చూపు కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు సరఫరా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3,961 మంది పిల్లలకు కళ్లద్దాలు అందజేశామన్నారు.

కిడ్నీ రోగులపై ..
 ్డఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేందుకు,  వారిలో భయాన్ని పొగొట్టేందుకు అవసమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిమ్స్‌లో 16 డయాలసిస్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్దానంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరుపుతున్నామన్నారు. స్కీనింగ్‌ పరీక్షల్లో 13,093 మందికి మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టు గుర్తించామన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి చర్యలు
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి 451 ఎకరాల భూమి గుర్తించామని కలెక్టర్‌ చెప్పారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భావనపాడు పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం జరుగుతోందని.. ఇది పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా  రహదారులు, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో 3,78,819 కుటుంబాలకు పని కల్పిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు, జిల్లా జడ్డీ బబిత, ఇన్‌చార్జి ఎస్పీ టి.పనసారెడ్డి,  జేసీ–2 పి.రజనీకాంతరావు, డీఆర్‌వో కె.నరేంద్ర ప్రసాద్, బీఆర్‌ఏయూ వీసీ కూన రామ్‌జీ,  జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అలాగే వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఉద్యోగులకు, వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అతిథులు ప్రదానం చేశారు.

Advertisement
Advertisement