‘గౌరవం’ ఏదీ? | Sakshi
Sakshi News home page

‘గౌరవం’ ఏదీ?

Published Wed, Jan 29 2014 4:18 AM

'Respect' there?

అన్నదాతలకు అండగా ఉంటూ, ఆధునిక సాగులో ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘ఆదర్శ రైతులకు’ గౌరవ వేతనం చెల్లింపు ఆలస్యమవుతోంది. యూసీలతో పేచీలు వచ్చి   బకాయిలు మూలుగుతున్నాయి. అధికారుల తీరు వల్ల 2,600 మంది ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు తమకూ కొన్ని భద్రతలు కల్పిస్తే సేవలను మరింతగా అందిస్తామని వారు ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:పంటల ప్రణాళిక, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, సాగులో సాంకేతికత, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు సమాచారం చేరవేయడంలో వారే కీలకం. పశు సంవర్దకం మొదలుకుని ఉద్యాన పంటల సాగులో ఆధునిక పద్దతులను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో వీరే ప్రధానం. వ్యవసాయంతో పాటు 14 అనుబంధ శాఖలను రైతులతో అనుసంధానించడంలో ము ఖ్య భూమిక వీరిదే. కానీ నెలల తరబడి ప్రభుత్వం నుం చి గౌరవ వేతనం అందడం లేదు. ఇప్పటికే విడుదల చేసిన డబ్బుకు అధికారులు లెక్కలు చూపడం లేదు.
 
 ఆధునిక సాగు పద్దతులు రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో ‘ఆదర్శ రైతు’ పథకాన్ని ప్రవే శ పెట్టారు. ప్రతీ 250 రైతు కుటుంబాలకు ఒకరు వంతున జిల్లాలో సుమారు మూ డు వేల మంది ఆదర్శ రైతులను నియమించారు. ఒక్కో రైతుకు నెలకు రూ. వేయి వంతున గౌరవ వేతనం చె ల్లించాల్సి వుంది. వివిధ కారణాలతో కొందరు ఆదర్శ రైతులు రాజీనామా చేయగా, మరికొందరిని పని తీరు ఆశించిన రీతిలో లేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు తొలగించారు.
 
 యూసీలు...పేచీలు
 ప్రస్తుతం జిల్లాలో 15 వ్యవసాయ సబ్ డివిజన్లలో 2600 మంది ఆదర్శ రైతులు పనిచేస్తున్నారు.  వీరికి సుమారు పది నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. అధికారులు మాత్రం 2013 జూన్ వరకు  విడుదలైనట్లు చెప్తున్నారు. కేవలం ఆరు నెలలకు సంబంధించి రూ.1.60 కోట్లు మాత్రమే  చెల్లించాల్సి  ఉందని చెప్తున్నారు. కాగా 2013 జూన్ వరకు విడుదల చేసిన మొత్తాన్ని వ్యవసాయ సబ్ డివిజన్ అధికారుల ఖాతాలో జమ చేశారు. ఆ మొత్తాన్ని ఆదర్శ రైతులకు చె ల్లించి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు (యూసీలు) సమర్పించాల్సి ఉంది. 15 సబ్ డివిజన్లకు గాను కేవలం ఐదు సబ్ డివిజన్ల నుంచి మాత్రమే వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి యూసీలు చేరాయి.
 
 వాటిని సమర్పిస్తేనే  వేతన బకాయిలు విడుదల చేస్తామని వ్యవసాయ కమిషనరేట్ మెలిక పెడుతున్నట్లు సమాచారం. యూసీల ఊసెత్తని అధికారులు బకాయిలు విడుదల చేయాలంటూ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపడంతో నిధులు విడుదల కావడం లేదు. ఓ వైపు వేతన బకాయిల కోసం వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న ‘ఆదర్శ రైతులు’ మరోవైపు ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడుతున్నారు. గతేడాది డిసెంబర్ 21న ఇందిరా పార్కు వద్ద డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రైతు సంఘం ఆందోళనకు దిగింది. జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న ధర్నా చేపట్టేందుకు వారు సిద్దమవుతున్నారు.
 
 డిమాండ్లు ఇవీ..!
  సుమారు పది నెలలుగా అందాల్సిన గౌరవ వేతనం తక్షణమే చె ల్లించాలి.
  ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతన చట్టం ప్రకారం నెలకు రూ.6900 ఇవ్వాలి.
  జీవిత బీమా, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలి.
 
 వెట్టి చాకిరీ చేస్తున్నాం
 ఏడేళ్లుగా అరకొర వేతనంతో వెట్టిచాకిరీ చేస్తున్నాం. ఆరంభంలో కొంత సమయాన్ని కేటాయిస్తే చాలని చెప్పారు. ఇప్పుడు వ్యవసాయంతో పాటు 14 అనుబంధ శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. గ్రామానికి ఏ విభాగానికి చెందిన అధికారి వచ్చినా రోజంతా వారి వెంటే ఉండాల్సి వస్తోంది. వారు అడిగిన సమాచారాన్ని ఇవ్వడంతోనే మా సమయంతా పోతోంది. అయినా ‘గౌరవ వేతనం’ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ నెల 3న టౌన్‌హాల్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ధర్నాకు దిగుతాం.
 - వేముల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా
 అధ్యక్షుడు, ఆదర్శ రైతు సంఘం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement