ఆక్రమణలపై కొరడా ఝుళిపించిన అధికారులు

22 Dec, 2013 01:15 IST|Sakshi

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ‘కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికతో గత నెలలో ‘సాక్షి’లో  వెలువడిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆక్రమణకు గురైన భూముల స్వాధీనానికి  రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ఆక్రమణకు గురైన భూమిలోని షెడ్డును, ఫెన్సింగ్ వైర్, సరిహద్దు రాళ్లను  రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ మేరకు తహశీల్దార్ గోవర్దన్, పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో జేసీబీతో శిఖం భూముల్లో నిర్మించిన షెడ్డును శనివారం తొలగించారు. అనంతరం తహశీల్దా గోవర్దన్ మాట్లాడుతూ సర్వే నంబరు 350 బొబ్బిలికుంట శిఖం భూమిలో ఆక్రమణకు గురైన భాగంలో సర్వే చేపట్టగా ఆక్రమించుకున్నది వాస్తవమేనని నిర్ధార ణ అయిందన్నారు.

15 రోజుల క్రితమే శిఖం భూమి పరిరక్షణ కోసం రూ. 40 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణం కోసం ఆర్డీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. తాము సర్వే చేసిన తర్వాత ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులు నిర్మాణ పనులు చేపట్టడం వల్లనే కూల్చివేతలు చేపట్టామని తహశీల్దార్ తెలిపా రు. శిఖం భూమి పరిరక్షణ కోసం ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. ఇకమీదట శిఖం భూమిని ఆక్రమిస్తే రెవెన్యూ యాక్టు ప్రకారం కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ గోవర్దన్  హెచ్చరించారు.
 నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారా..?
 తన పట్టా భూమిలోని షెడ్డును  రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని, ఇది సరికాదని  భూ యజమానురాలు ఇంతియాజ్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబరు 350లో కొంతభాగం క్రిస్టియన్లు, వ్మశాన వాటికకు, మరికొంత భాగాన్ని ఎస్సీల శ్మశానవాటిక కోసం ఆక్రమించుకున్నారని జూలై 1న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నిర్వహించిన సర్వేలో తేలిందని, ఆ నివేదిక ఆధారంగా శిఖం భూమిలో నిర్మించిన 42 ఇళ్లను ఎందుకు కూల్చివేయలేదని ఆమె ప్రశ్నించారు. అధికారులు పక్షపాత వైఖరితో కూల్చివేతలు చేపట్టారని, కూల్చివేసే ముందు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు.

మరిన్ని వార్తలు