భారీగా రెవెన్యూ బదిలీలు | Sakshi
Sakshi News home page

భారీగా రెవెన్యూ బదిలీలు

Published Tue, Feb 4 2014 2:28 AM

revenue Officers transfers

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. బదిలీ కానున్న అధికారుల జాబితాను రాష్ట్ర భూపరిపాలన శాఖకు సోమవారం పంపారు. అక్కడ ఆమోద ముద్ర పడిన వెంటనే అమలు చేస్తారు. ఏడుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు(ఎస్‌డీసీ), 31 మంది తహశీల్దార్లు బదిలీ కానున్నట్లు తెలిసింది.
 
 వీరిని విజయనగరం, విశాఖ జిల్లాలకు పంపుతుండగా.. వీరి స్థానంలో ఆ రెండు జిల్లాల వారిని నియమిస్తారు. ఈ ప్రక్రియ అంతా రెండు, మూడు రోజుల్లో పూర్తి అవుతుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం బదిలీపై వెళ్ళనున్నవారి జాబితాను ప్రకటించింది. ఆఫీస్ బ్యారర్లు, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పని చేస్తున్న వారికి మినహాయింపు ఉంటుందని మొదట అనుకున్నారు. అయితే ఎటువంటి ఆ మినహాయింపు లేకుండానే బదిలీలు చేయాలని సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు రావడంతో ఆ మేరకు జాబితా సిద్ధం చేశారు. దీని ప్రకారం.. మూడేళ్ల సర్వీసు మించని స్థానికేతరులు, ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్నవారు, మెడికల్ లీవ్‌లో ఉన్నవారిని మినహాయించి మిగిలిన వారందరినీ బదిలీలు చేస్తున్నారు. ఆ వివరాలు పరిశీలిస్తే..
 
  ఎస్‌డీసీ (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) క్యాడర్‌లో జిల్లాలో 15 మంది అధికారులు ఉన్నారు. వీరిలో ఏడుగురిని బదిలీ చేస్తున్నారు. మిగిలిన 8 మందికి మినహాయింపు లభించింది. వారంతా నాన్‌లోకల్ అధికారులు కావడమే దీనికి కార ణం. బదిలీ అయిన ఏడుగురులో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ రజనీకాంతరావు, టెక్కలి ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఎస్‌డీసీలు సీతారామస్వామి, హెచ్‌వీ ప్రసాద్, గున్నయ్య, ఏపీడీ ధర్మారావు ఉన్నారు.  జిల్లాలో 51 మంది తహశీల్దార్ క్యాడర్ అధికారులు ఉన్నారు. వీరిలో 31 మందికి బదిలీ కానుంది. 20 మందికి మినహాయింపు లభించింది. వీరిలో 8 మంది పదవీ విరమణకు చేరువలో ఉండగా, ఇద్దరు మెడికల్ లీవ్‌లో ఉన్నవారు. మరో 10 మంది నాన్‌లోకల్ కేటగిరీలో జిల్లాకు వచ్చి మూడేళ్లు పూర్తి కాలేదు.
 

Advertisement
Advertisement