బియ్యం మినహా మిగతా రేషన్ బంద్ | Sakshi
Sakshi News home page

బియ్యం మినహా మిగతా రేషన్ బంద్

Published Sat, Sep 7 2013 4:43 AM

Rice ration, except for the boycott

కూలికెళ్లినా ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లలేని.. అర్ధాకలి బతుకులు వారివి. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు సర్కారు అందించే సబ్సిడీ సరుకులు, పింఛన్లు కొంతలో కొంత ఆదుకునేవి. ఒక్కపూటైనా గడిచేది. ఇప్పుడు అవీ అందని పరిస్థితుల్లో కడుపు కాళ్లు పెట్టుకోవాల్సిన దీనస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం నిరుపేదలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో రేషన్ సరుకులు, పింఛను రాళ్లు అందక లబ్ధిదారులు నానా అగచాట్లు పడుతున్నారు. అయినా వారు ఉద్యమం ఆగిపోవాలని కోరుకోవడం లేదు. రాష్ట్రం మేలు కోసం మేం పస్తులున్నా పర్వాలేదని అంటున్నారు.
 
 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం కారణంగా జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డులకు సరఫరా చేసే సరుకులు ఈ నెల అందే పరిస్థితి కనిపించడం లేదు. రేషన్ షాపుల ద్వారా తెలుపు, గులాబీ, ఇతర కార్డుదారులకు నెల నెలా బియ్యం, పంచదార, గోధుమలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్న విష యం తెలిసిందే. అయితే ఈ నెలలో బియ్యం తప్ప ఇతర సరుకులు అందే అవకాశం లేదు. దీంతో పేదవర్గాలు ఇబ్బంది పడుతున్నారు. వీటిపైనే ఆధారపడే అల్పాదాయ వర్గాల ప్రజ లు కూడా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రం విడిపోతే తీవ్ర నష్టం వాటిల్లితుందన్న విషయం వారికి కూడా అవగతమైంది. అందువల్లే గత నెలరోజులకుపైగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు  అదే ఉద్యమం కారణంగా సరుకులు కూడా అందవని తెలిసి.. కొంత బాధపడుతున్నా.. రాష్ట్రం కోసం దాన్ని దిగమింగుకుంటున్నారు. సరుకులు అందకపోయినా పర్వాలేదు గానీ.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు.
 
 జిల్లాలో 7,04,162 మంది తెల్ల రేషన్ కార్డుదారులు, 52,881 మంది అంత్యోయ కార్డుదారులు, 1379 అన్నపూర్ణ కార్డుదారులున్నారు. తెల్ల కార్డుదారులకు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తలా ఒక్కంటికీ నాలుగు కేజీల చొప్పున రూ.1 కిలోబియ్యంతో పాటు రూ. 185కు అమ్మహస్తం పథకం ద్వారా తొమ్మిది రకాల సరుకులు అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో డిపోలకు సరుకులు చేరలేదు. అయినా రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలను ఇతరుల ద్వారా తెలుసుకున్న పేద లబ్ధిదారులు అర్ధాకలితో ఉండేందుకు సిద్ధపడుతున్నారు. రెండు రోజుల క్రితం రేషన్ షాపులకు బియ్యం చేరగా, వాటిని ప్రస్తుతం లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా డీలర్లు తమకు కావాల్సిన సరుకులకు సంబంధించి ముందు నెలలోనే డీడీ తీసి పౌరసరఫరాల శాఖాధికారులకు అందజేయాల్సి ఉంటుంది. 
 
 ఆ మేరకు వారికి సరుకులు సరఫరా అవుతాయి. ఈ నెలకు సంబంధించి కూడా గత నెలలోనే డీడీలు ఇచ్చారు. అయితే బియ్యం డీడీలు మాత్రమే తీసుకున్న అధికారులు ప్రస్తుతం వాటినే సరఫరా చేశారు. మిగిలిన సరుకులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ సరుకుల డీడీలు డీలర్ల వద్దే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా సరఫరా అవుతున్న సరుకులు అందక పోగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఉల్లి ధర రూ. 40 దాటింది. దాన్ని కొనే స్థితిలో పేదలు లేరు. బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలతో పేదలు ఇబ్బందులు పడుతున్నా దానిని తట్టుకునేందుకే సిద్ధపడుతున్నారు. 
 
 అందని పింఛన్లు
 మరోవైపు పెన్షన్లు కూడా అందకపోవడంతో వాటిపైనే ఆధారపడినవారు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మొత్తం 2,79,650 మంది పింఛనుదారులున్నారు. వీరిలో 1.25,613 మంది వృద్ధులు కాగా, 78,489 మంది వితంతువులు, 31,427 మంది వికలాంగులు, 4338 మంది చేనేత కార్మికులు, 465 మంది కల్లుగీత కార్మికులు, 29,318 అభయహస్తం లబ్ధిదారులున్నారు. సమ్మెలో ఉండటం వల్ల వీరందరికీ పింఛన్లు మంజూరు చేయలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. పలు శాఖల్లో  పెద్ద ఎత్తున ఫర్నిచర్, ఇతర సామగ్రి కొనుగోళ్లు చకచకా జరిగిపోతున్నాయి. వాటికి లేని అడ్డంకులు సరుకులు, పింఛన్ల పంపిణీ ఎందుకో అర్థం కావడం లేదు.
 
 రేషన్ సరుకులు అందలేదు
 ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో రేషన్ సరుకులు అంద లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. బజారులో సరుకుల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక అర్ధాకలితో ఉంటున్నాం. డీలర్లు సరుకులు రావడం లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి రేషన్‌సరుకులు అందేలా చూడాలి.
 -సతివాడ ఈశ్వరరావు, అప్పాపురం, లావేరు మండలం 
 
 సమైక్యాంధ్ర కోసం భరిస్తాం
 సమైక్యాంధ్ర కోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాం. సమైక్యాంధ్ర కోసం గ్రామాల్లో కూలీలు, ఆటో డ్రయివర్లతో సహా అన్ని వర్గాల వారు ఉద్యమం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే నష్టపోతామంటున్నారు. అందుకే మేం కూడా సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్నాం. రేషన్ సరుకులు అందకపోవడం ఇబ్బందే అయినా సమైక్యాంధ్ర కోసం దాన్ని భరిస్తాం. 
 -దుప్పాడ గురువులు, కేశవరాయునిపురం, లావేరు మండలం
 

Advertisement
Advertisement