వ్యాధులతో విలవిల్లాడుతున్న చిగురువలస | Sakshi
Sakshi News home page

వ్యాధులతో విలవిల్లాడుతున్న చిగురువలస

Published Sat, Sep 21 2013 4:26 AM

Rims in the break-bone diagnostic tests

 వ్యాధులతో గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. ‘సాక్షి’లో వార్తలు ప్రచురితమైన వెంటనే వైద్యాధికారులు హుటాహుటిన గ్రామాలకు వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ప్లేట్‌లెట్స్ తగ్గిన వెంటనే డెంగీగా ప్రైవేట్ ల్యాబ్‌లలో నిర్ధారించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైద్యాధికారులు పేర్కొన్నారు. డెంగీ నిర్ధారణ పరీక్ష శ్రీకాకుళంలోని రిమ్స్‌లో మాత్రమే చేస్తారన్నారు. జ్వరాలతోనే బాధపడుతున్నారు తప్ప డెంగీతో కాదని గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
 చిగురువలస (సరుబుజ్జిలి), న్యూస్‌లైన్:  సరుబుజ్జిలి మండలంలోని చిగురువలసలో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరిని విశాఖపట్నం తరలించారు. బసవా రామ్మూర్తి, గుడుబండి ఎర్రయ్యతో పాటు 15 మంది జ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గుండ మణి(14)ని శ్రీకాకుళం తీసుకువెళితే రక్తపరీక్షలు చేసి డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారని బాలిక తల్లి గుండ రామలక్ష్మి తెలిపారు. వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఆర్‌కే ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని తెలి పారు. డెంగీ లక్షణాలు గుర్తించిన పల్లె రాం బాబు శుక్రవారం విశాఖపట్నం తరలించారు.
 
 కలుషిత నీరే కారణమా?
 గ్రామ సమీపంలో గల కలుషితమైన బావి నీరే వ్యాధులు ప్రబలడానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమీపంలో గల చెరువులోని కలుషిత నీరు ఊటరూపంలో బావిలో కలుస్తోందని చెప్పారు. 
 
 గతంలోనూ వ్యాధులు..
 చిగురువలస గ్రామంలో తరచూ వ్యాధులు ప్రబలుతున్నాయి. రెండేళ్ల కిందట ఈ గ్రామానికి చెందిన డుర్రు అనూష (8) బాలిక మృతి చెందింది. తర్వాత కూడా పలువురు అతిసార వ్యాధి బారినపడ్డారు. వారం రోజుల నుంచి గ్రామంలో జ్వరాలతో పలువురు మంచం పట్టినా వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఏఎన్‌ఎం స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని శ్రీగణేష్ యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల కృష్ణారావు తెలిపారు. వెంటనే వైద్యశిబిరం నిర్వహించాలని కోరారు.
 
 డెంగీ కాదు.. విషజ్వరాలే  
 మందస: మర్రిపాడు గ్రామంలో జ్వరంతో బాధపడుతున్నవారికి డెంగీ లేదని, విషజ్వరమేనని వైద్యాధికారులు స్పష్టం చేశారు. ‘మర్రిపాడులో డెంగీ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఎం.శారద, డీసీహెచ్‌ఎస్ ఎం.సునీల, జిల్లా మలేరియా నివారణా అధికారి ఎన్.అరుణ్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి జ్వర పీడుతుల వివరాలను సేకరించారు. కాశీబుగ్గ ఆస్పత్రిలో డెంగీగా నిర్ధారించిన రోగుల ఇళ్లకు వెళ్లి రిపోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో డెంగీ నిర్ధారణ పరీక్షలు శ్రీకాకుళంలోని రిమ్స్‌లో మాత్రమే చేస్తారని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్ధారించలేరని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇచ్చే రిపోర్టులను నమ్మవద్దని సూచించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది డెంగీ కేసులు పెరిగాయని చెప్పారు. 
 
 డెంగీగా నిర్ధారించిన ల్యాబ్‌ను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  వైరల్ జ్వరం, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయని, వాటిని డెంగీగా పరిగణించవద్దన్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తారని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేయవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల పరిసరాలను, లోపల పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు. ఇళ్లలో సింథిటిక్ పైడిథ్రైడ్‌ను స్ప్రే చేయాలని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో జ్వరాల తీవ్రత తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగించాలన్నారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో జిల్లా మాస్ మీడియా అధికారి బి.ముఖలింగం, హరిపురం ఎస్‌పీహెచ్‌ఓ జీవన్‌రాణి, ఏఎవో ఎం.ప్రభాకర్, మలేరియా సబ్ యూనిట్ అధికారి కె.సత్యనారాయణ, వైద్యాధికారి ఎం.రమేష్, సూపర్ వైజర్లు పి.ప్రసాదరావు, వి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 
 డీఎంహెచ్‌వో అసంతృప్తి
 లావేరు:లావేరు పీహెచ్‌సీ పనితీరుపై డీఎం హెచ్‌వో గీతాంజలి అసంతృప్తి వ్యక్తం చేశారు. లావేరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె లేబర్ రూం, కంప్యూటర్‌గది, మందుల గదిని తనిఖీ చేశారు. బుడతవలస వైద్యశిబిరానికి పూర్తిస్థాయిలో మందులు ఇవ్వకపోవడంపై పీహెచ్‌సీ ఫార్మాసిస్టు, వైద్యాధికారి భారతీదేవిని ప్రశ్నించారు. పీహెచ్‌సీలో వ్యాక్సిన్ భద్రపర్చేందుకు ఇన్వర్టరు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఐవో బి.జగన్నాథరావు, జవహర్‌బాల ఆరోగ్య రక్ష పథకం జిల్లా కో ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, రణస్థలం క్లస్టర్ సీహెచ్‌వో రాజగోపాలరావు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసరావు, హెల్త్ సూపర్‌వైజర్ పీవీ రమణమూర్తి, హెచ్‌వీ హేమకుమారి, ఏఎన్‌ఎంలు కమల, సరోజిని, రాజేశ్వరి, పి.రమణమ్మ, అరుణకుమారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
 తగ్గుముఖం పట్టని అతిసార
 ఘనసర(భామిని): ఘనసర గ్రామంలో అతి సార తగ్గుముఖం పట్టలేదు. అతిసార బాధితుల సంఖ్య పెరుతోంది. కలుషిత నీటితో వండిన ఆహార పదార్థాలు తిని ఘనసర గ్రామస్తులు అతిసారబారిన పడ్డారు. ఇప్పటికే 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం మరో ఐదుగురు డయేరియాకు గురయ్యారు. చౌదరి యుగంధర్, సుంకర రత్తమ్మ, వి.జగన్నాథం, ఎరుకుమజ్జి దశాలు, బి.బాలరాజు, నెయ్యిగాపుల అచ్యుతరావు, దామోదర లక్ష్మణరావు అతిసారతో బాధపడుతున్నారు. బాలేరు వైద్యాధికారి కె.విజయపార్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ఈఓ సీహెచ్ వెంకటరావు దొర, హెచ్‌ఏఏ భీమారావు, ఏఎన్‌ఎం చామంతి, భవానీ రోగులకు సేవలందిస్తున్నారు. 
 
 బురిడికంచరాంలో విషజ్వరాలు  
 పొందూరు: మండలంలోని బురిడికంచరాంలో వారం రోజుల నుంచి విషజ్వరాలతో ప్రజలు బాధపడుతున్నా వైద్యసేవలందించడంలో కింతలి పీహెచ్‌సీ వైద్యులు సిబ్బంది విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జ్వరపీడితులకు డెంగీ లక్షణాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. గ్రామంలో 150 మంది జ్వరంబారిన పడ్డారు. పలువురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం అమృత ఆస్పత్రిలో సుమారు 10 మంది డెంగీ అనుమానితులు వైద్య సేవలు పొందారు. ప్రస్తుతం వండాన లక్ష్మున్నాయుడు, మజ్జి శ్రీను, పిసిని రామారావు, రమ్య తదితరులు వైద్యం పొందుతున్నారు. తొలుత జ్వరం తర్వాత ఒళ్లు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, వాంతులు, విరేచనాలతో సతమతమవుతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పిలి వరహాలు, ఈసర్ల రాజారావు, నిర్మల, ముడిల రాము, వండాన దీపిక, వండాన గోవిందమ్మ తదితరులు మంచంపట్టారు. సుమారు 20 మందికి ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోయి పరిస్థితి విషమించడంతో అమృత ఆస్పత్రికి తరలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో తాము వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆరోపించారు. ఏఎన్‌ఎంలు సుజాత, రాజేశ్వరి వైద్యసేవలందిస్తున్నారు. పూర్తిస్థాయిలో వైద్యసేవలందిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని గ్రామస్తులు కోరుతున్నారు.   
 
 

Advertisement
Advertisement