ఎగిసిన ఉద్యమ జ్వాల | Sakshi
Sakshi News home page

ఎగిసిన ఉద్యమ జ్వాల

Published Fri, Aug 9 2013 2:13 AM

Rise of flame movement

 కర్నూలు, న్యూస్‌లైన్: విభజన జ్వాలల్లో జిల్లా అట్టుడుకుతోంది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి  అన్ని ప్రాంతాలు ఉద్యమాలతో రగిలిపోతున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనన్న భావన ప్రజల్లోకి వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా సమైక్యపోరు మహోద్యమంగా మారింది.
 
 నియోజకవర్గ, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాల ప్రజలు సైతం పోరుబాట పట్టడం ద్వారా ప్రజా జీవనం స్తంభించిపోతోంది. నిరసన కార్యక్రమాలకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు అవుతున్నారు. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలు, కళాశాలలు సక్రమంగా తెరుచుకోవడం లేదు. ఉద్యోగులు
 కూడా ఆందోళనలో పాల్గొంటుండటంతో జిల్లా అంతటా ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన స్తంభించిపోయింది.
 
 రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లాలో తొమ్మిదో రోజు గురువారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. కర్నూలు నగరంలో మెడికల్ దుకాణాలను బంద్ చేసి నిర్వహకులు సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. డ్రగ్ డీలర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేస్తూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగర ప్రధాన రహదారులన్నీ ఆందోళనకారులతో కిటకిటలాడాయి.
 
 పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించేందకు ప్రయత్నించినా ఉద్యమకారులు ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వైద్యులు, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. సమైక్య రాష్ట్రం కోసం వినాయక్‌ఘాట్ వద్ద అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఆదోనిలో దాదాపు కిలో మీటరు మేర రోడ్డుకు ఇరువైపులా సమైక్యవాదులు చేయిచేయి కలిపి మానవహారంగా నిలబడి సమైక్య నినాదాలు వినిపించారు. జేఏసీ పిలుపులో భాగంగా వైఎస్సార్సీపీ నేత సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మానవ హరంలో పాల్గొన్నారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. కాంగ్రెస్, పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేశారు. గోస్పాడులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఒంటెద్దు బండ్లతో ప్రదర్శన జరిపారు.  కోడుమూరులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యోగులు సమైక్య ఆందోళన నిర్వహించారు.  ఆలూరులో ఆర్‌ఎంపీల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.  హాలహర్విలో జేఏసీ ఆద్వర్యంలో నడిరోడ్డుపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు.
 
 ఆత్మకూరులో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గౌడుసెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ మాజీ చెర్మైన్ బుట్టా రంగయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చెర్మైన్ మాచాని నాగరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై.రుద్రగౌడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి.
 
 రిలే దీక్షల విరమణ
 కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ  ఎస్సీ సెల్ నగర కన్వీనర్ సీ.హెచ్. మద్దయ్య చేపట్టిన రిలే దీక్షలను ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమీటి సభ్యులు తెర్నేకల్లు సురేందర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మ్యుజియం ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు నాల్గో రోజుకి చేరాయి.
 
 ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ  రాజకీయ లబ్ధికోసమే తెలుగు జాతిని రెండు ముక్కలుగా విభజించేందుకు పూనుకుందన్నారు. దీక్షలకు ప్రముఖ సామాజిక వేత్త సంజీవరెడ్డి, పలు ప్రజా సంఘాలు సఘీభావం తెలిపారు. దీక్షలలో నాగన్న, సుధాకర్, ప్రభాకర్, ఏసు, గోపాల్‌లచే ఆ పార్టీ నాయకులు డా.సలీం, పులిజాకబ్, ఎస్.ఎ రేహ్మాన్, తోఫిక్ అహ్మద్‌లు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement