ప్రయాణం..ప్రమాదం | Sakshi
Sakshi News home page

ప్రయాణం..ప్రమాదం

Published Wed, Sep 23 2015 1:44 AM

ప్రయాణం..ప్రమాదం - Sakshi

రహదారులు రక్తమోడుతున్నాయి.. వాహనాలు మృత్యు శకటాలవుతున్నాయి.. రోడ్డెక్కితే ఇంటికి చేరే వరకు ప్రాణాలకు గ్యారంటీ లేదు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి వద్ద బూడిద లారీ ప్రమాదంతో 16 మంది మృతి చెందారు. కె.కోటపాడు మండలంలో బ్రాండిక్స్ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో 28మంది గాయపడ్డారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రమాదం ప్రాణాలను హరిస్తోంది. ఈ పాపం ఎవరిది? అజాగ్రత్తగా ఉన్న ప్రజలదా.. నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానిదా.. నిబంధనలు పాటించని వాహన చోదకులదా?
 
 మర్రిపాలెం, నక్కపల్లి, పాడేరు : రోడ్డు ప్రమాదం జరిగితే పరుగులు తీస్తారు.. మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామంటారు.. బాధితులకు పరిహారం ప్రకటిస్తారు.. ఇదో ప్రహసనం.. ఎన్ని ప్రమాదాలు జరిగినా పాఠం నేర్వని జడత్వం.. అధికారులు, నాయకులు ఇదే తీరున వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2014లో దాదాపు 1,250కి పైగా ప్రమాదాలు జరిగాయి. 330 మంది మృతి చెందగా, 940 మంది క్షతగాత్రులుగా మిగిలారు. వీరిలో 75 మంది రవాణా తరహా వాహనాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకోగా 250 మందికి పైగా చికిత్స అందుకున్నారు.

2015 ఆగస్టు నాటికి సుమారు 900 ప్రమాదాలు చోటుచేసుకోగా 235 మంది మృతి చెందారు. ఇంకా 660 మంది గాయపడ్డారు. వీరిలో రవాణా వాహనాల ప్రమేయంతో 68 మంది మృతి చెందగా 150 మంది క్షతగాత్రులయ్యారు. సరకు రవాణా వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రవాణా వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినా ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్టు ఉండటంతో ప్రాణనష్టం జరుగుతోంది.

 ఘాట్ రోడ్.. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్
 ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు పరిమితికి మించిన ప్రయాణికులతో రవాణా సాగిస్తున్నాయి. కొండలు, గుట్టలపై ఘాట్ రోడ్డులలో ఈ వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. వాయు వేగంతోపాటు ఓవర్‌లోడింగ్ ప్రమాదాలకు కారణమవుతోంది. పదిమందికి మాత్రమే సరిపడే వాహనాలలో ముప్ఫై, నలభై మందిని ఎక్కించి ప్రైవేటు ఆపరేటర్లు వాహనాలను నడుపుతున్నారు. వీటికి అనుమతులు ఉన్నాయో లేదో చూసే నాధులే కరువయ్యారు. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. క్షతగాత్రులు విశాఖపట్నం తరలించేలోగా మృత్యువాత పడుతున్నారు.

పెదబయలు మండలం రూఢకోట సమీపంలో రెండు వారాల క్రితం జీపు బోల్తా పడిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన రూఢకోట పీహెచ్‌సీ ల్యాబ్ టెక్నీషియన్ చికిత్స కోసం విశాఖపట్నం తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇటీవల జీకేవీధి మండలం జర్రెల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు గిరిజనులు మృతి చెందారు. పాడేరు ఘాట్‌లో మార్చి నెల 25న పెదకోడాపల్లి వద్ద జరిగిన రెండు జీపు ప్రమాదాల్లో ఒక మహిళ, మరో గిరిజనుడు మృతి చెందారు. రవాణా శాఖ నిఘా లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువయ్యాయి.

 హైవేలో ఉల్లంఘనలు... జాడలేని పెట్రోలింగ్
 జాతీయ రహదారులపై లారీలు, ఇతరత్రా రవాణా వాహనాలలో ప్రయాణాలు డ్రైవర్లకు, క్లీనర్‌లకు కలిసి వస్తోంది. ఆర్టీసీ ధరలతో పోల్చితే లారీలలో ప్రయాణం తక్కువ ఖర్చుగా ఉంటోంది. దీంతో గ్రామీణులు, కూలీలు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవర్ క్యాబిన్, వెనుక భాగంలో కూర్చోబెట్టి ప్రయాణికులను తరలిస్తున్నారు. వాహనాల మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ తదితర చర్యలకు చెక్ పెట్టాల్సిన పెట్రోలింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో దాదాపు 150 కిలోమీటర్ల పొడవుతో హైవే ఉంది. నిత్యం ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

 విచ్చలవిడిగా మద్యం దుకాణాలు
 హైవేలలో అర్ధరాత్రి వరకు తెరచి ఉన్న డాబాలు, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మద్యం దుకాణాల వల్ల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం.

 ఉత్తుత్తి విశ్రాంతి గదులు
 హైవేలలో ప్రతి 50, 100 కిలో మీటర్లకు వి శ్రాంతి గదులు ఏర్పాటు చేస్తామని చేసిన ప్ర భుత్వ ప్రకటన అమలుకు ఇంతవరకు చర్యలు మొదలు కాలేదు. వీటిని ఎక్కడ ఎలా నిర్మిస్తారన్న విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదు. విశ్రాంతి గదులు ఎవరి సహకారంతో నిర్మిస్తారు.. ఎవరు పర్యవేక్షిస్తారన్న విషయంలో స్పష్టత లేదు.

 అటకెక్కిన డబుల్ డ్రైవర్స్ నిబంధన:
 నేషనల్ పర్మిట్ లారీలలో డబుల్ డ్రైవర్ నిబంధన అమలు జరగాలి. అయితే అంతర్రాష్ట్ర వాహనాలలో డబుల్ డ్రైవర్ నిబంధన ఉల్లంఘిస్తున్నారు. 10 శాతం వాహనాలలో కూడా డబుల్ డ్రైవర్ విధానం అమలు జరగడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలలో డ్రైవర్ నిబంధన వర్తిస్తున్నా తెలుగు రాష్ట్రాలలో ఆ జాడ లేదు.
 
 ప్రమాద ప్రాంతాలలో ప్రత్యేక నిఘా
 జిల్లాలో ప్రమాద కూడళ్లు, ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అటువంటి ప్రాంతాలలో నిఘా ఉంటుంది. రాంగ్ రూట్ డ్రైవింగ్, అతి వేగం అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రమాదాల నియంత్రణకు చొరవ చూపుతాం. రవాణా వాహనాలలో ప్రయాణికులను తరలించడం పట్ల ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసి నియంత్రిస్తాం.
 -ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ
 
 ట్రామాకేర్ ఎక్కడ?
 నక్కపల్లిలో రూ.70 లక్షల వ్యయంతో 30 పడకల ఆస్పత్రి నిర్మించినా.. ట్రామా కేర్ సెంటర్ లేక అత్యవర వైద్యం అందడం లేదు. కనీసం అంబులెన్స్‌కూడా ఉండదు. 108 వాహనం వచ్చేలోపు ప్రాణాలు పోతున్నాయి.      గత ఏడాది గొడిచర్ల వద్ద ఆగిఉన్న లారీని ఇన్నోవా ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన రవిసుధాకర్ నక్కపల్లిలో సరైన సదుపాయంలేక విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.  

ఈ ఏడాది ఏప్రిల్‌లో నక్కపల్లి గురుకుల పాఠశాల ఎదురుగా రోడ్డుపై నిలుచున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని నక్కపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు బలమైన గాయాలు తగలడంతో సరైన వైద్యం అందక ఇద్దరూ మరణించారు.  విశాఖ-పాయకరావుపేటల మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది. 3 గంటలపాటు ప్రయాణించాలి. ఈమధ్యలో ఎక్కడా సరైన ఆస్పత్రి, ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం గమనార్హం. 40 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనాన్ని సమకూర్చారు. రెండు మండలాలకు ఒక 108 వాహనం ఉంది. ఇది ఎక్కడైనా అత్యవసర కేసుకు అటెండ్ అయిన సందర్భంలో ప్రమాదం జరిగితే ప్రైవేటు వాహనాలే గతి.

Advertisement
Advertisement