వెంటాడిన మృత్యువు | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Published Mon, Dec 2 2013 2:38 AM

road accidents in Guntur

చింత లేకుండా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఇద్దరు పిల్లలను దిక్కులేని అనాథలను చేసింది. గుంటూరు రూరల్ మండలం బుడంపాడు వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటన తెనాలి పట్టణంలోని ముత్తెంశెట్టిపాలెంలో విషాదం నింపింది. 
 
 చేబ్రోలు/తెనాలిరూరల్/గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :శ్రీరామ్.. మనసున్న మంచి మనిషి. పేద విద్యార్థులకు చేతనైన సాయమందించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథ శవాలను తరలించడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండేవారు. అందుకే ఆయన కుటుంబమంటే చుట్టుపక్కల వారికి ఎంతో అభిమానం. తెనాలిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న మాసకమల్లి శ్రీరామ్‌దీక్షితులు(45) స్థానిక ముత్తెంశెట్టిపాలెంలోని ఓ అద్దె ఇంట్లో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్య ఉమాదేవి(40) స్థానిక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరికి శ్రావ్య(16), సాయిదుర్గా శైలేష్ (13) ఇద్దరు పిల్లలు. శైలేష్ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా శ్రావ్య గుంటూరులోని ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. వీరి సంసారం చీకూచింతా లేకుండా హాయిగా సాగిపోతోంది.  అది చూసి విధికి కన్నుకుట్టింది. ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు శ్రావ్యను చూసి వద్దామనుకున్నారు. 
 
 కుమారుడు శైలేష్‌తో కలిసి దంపతులు ద్విచక్రవాహనంపై గుంటూరు బయలుదేరారు. ఎక్కడో కర్ణాటక నుంచి నారాకోడూరు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లుకు సరుకు తరలిస్తున్న టిప్పర్ లారీ మృత్యువులా వీరిని వెంటాడింది. అతివేగంగా వస్తున్న టిప్పర్ గుంటూరు రూరల్ మండలం బుడంపాడు సమీపంలో వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అదుపు తప్పిన టిప్పర్ రోడ్డు పక్కన చింత చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక క్కడే ప్రాణాలు విడిచారు. శైలేష్ తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికులు అతడిని వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో బుడంపాడు- నారాకోడూరు మధ్య ట్రాఫిక్ జాం అయింది. సుమారు నాలుగు కి.మీ పొడువున భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. లారీ ఢీకొనడంతో మృతుల ద్విచక్ర వాహనంతో పాటు వ్యవసాయ పనుల కోసం వచ్చిన రైతు రోడ్డు పక్కన ఉంచిన మరో ద్విచక్రవాహనం కూడా నుజ్జునుజ్జు అయింది. 
 
 ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ..
 ప్రమాద విషయం తెలుసుకున్న చేబ్రోలు ఎస్‌ఐ డి.వినోద్‌కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ నరసింహ స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. గుంటూరు రూరల్ సీఐ వై.శ్రీనివారావు లారీని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల మండలంలో ఉండే కొద్దిమంది దూరపు బంధువులు మినహా శ్రీరామ్ కుటుంబాని పెద్దగా చుట్టాలు లేరు. తల్లిదండ్రులిరువురూ మృతి చెందడంతో శ్రావ్య, శైలేష్ దిక్కులేనివారయ్యారు. ప్రస్తుతం శైలేష్ గుంటూరులోని ఓ ప్రభుత్వాస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 
 

Advertisement
Advertisement