జల్సా దొంగలు | Sakshi
Sakshi News home page

జల్సా దొంగలు

Published Mon, Sep 21 2015 4:24 AM

జల్సా దొంగలు - Sakshi

కడప అర్బన్ : తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలు.. దురలవాట్లకు బానిసలై.. డబ్బు సులభంగా సంపాదించాలనే అత్యాశతో దొంగతనాలకు పాల్పడుతూ చివరకు సీసీఎస్ పోలీసుల అదుపులోకి చేరారు. కడప నగరంతోపాటు జిల్లాలోని పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లను, ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడం వీరి వృత్తిగా చేసుకున్నారు. కడప నబీకోట పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో ఏరోజుకారోజు బెంగళూరు నగరానికి చేరుకుని పబ్బుల్లో విలాసవంతంగా గడపడం అలవాటుగా చేసుకుంది.

ఆ డబ్బు అయిపోగానే తిరిగి చోరీలకు, చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు. నబీకోటలోని శివాలయం సమీపంలో ప్రతి రోజు కొంత మంది యువకులతో జతకట్టి పక్కా ప్రణాళికను తయారు చేసుకుంటారు. మొదట తాళాలు వేసిన ఇళ్లను గమనించి రావాలని దొంగల ముఠా నాయకుడు పంపిస్తాడు. తర్వాత తాము అనుకున్న ఇంటిని టార్గెట్‌గా చేసుకుని దోపిడీకి పాల్పడుతారు.

 వరుస చోరీలు:
 ఇటీవల కాలంలో కడప తాలూకా పరిధిలోని శివాలయం ఎదురు సందులో నివసిస్తున్న ఓ కుటుంబం తమ చిన్నారికి ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూడగా, తమ ఇంటి ప్రధాన ద్వారంగా ఉన్న ఫ్లైవుడ్‌తో తయారు చేసిన తలుపును పగులగొట్టి బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు. అలాగే రవీంద్రనగర్‌లో మరో నాలుగు రోజుల తర్వాత ఓ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఆ సంఘటన జరిగిన మరో నాలుగు రోజులకు నబీకోట-మరాఠి వీధి మధ్యలో ఉన్న ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో రాయవేలూరుకు వెళ్లి ఆ రోజు రాత్రి ఇంటిలో లేడు. ఆ విషయాన్ని గమనించిన దొంగలు మరుసటిరోజు సాయంత్రం ఆ వ్యక్తి వచ్చే సమయానికి దొంగతనానికి పాల్పడి భారీగా దోచుకెళ్లారు.

 స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినా..
 చైన్‌స్నాచింగ్‌ల విషయానికి వస్తే చిన్నచౌకు, వన్‌టౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో మహిళలు ఎక్కడ ఒంటరిగా వెళుతున్నా వారి వెనుకవైపు నుంచి వెళ్లి మెడపై దడేలున కొట్టి వారు తేరుకునే లోపు బంగారు ఆభరణాలను దోచుకెళుతున్నారు. నబీకోటలో వారం రోజుల క్రితం పట్టపగలు 10.30 గంటల సమయంలో ఒంటరిగా వెళుతున్న ఓ వృద్ధురాలు మెడపై కొట్టి చైన్‌ను లాక్కొని వెళుతుండగా వారిని స్థానిక యువకులు ద్విచక్ర వాహనంలో వెంబడించారు. గువ్వలచెరువు ఘాట్ వరకు వెంట పడ్డారు. అంతలోపు స్థానిక యువకుల ద్విచక్ర వాహనం పంచరు కావడంతో ఇబ్బంది పడ్డారు. సదరు చైన్ స్నాచర్లు అలాగే రాయచోటి వైపు పరారయ్యారు. ప్రకాశ్‌నగర్‌లో ఓ న్యాయవాది సతీమణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఆమె మెడపై కొట్టి తేరుకునేలోపు బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లారు.

 ఎట్టకేలకు కటకటాల పాలు:
 ఇలా చోరీలకు పాల్పడుతూ బంగారు ఆభరణాలను తీసుకొచ్చిన వాటిని సదరు ముఠా నాయకుడికి అప్పగిస్తారు. ఆయన తనకు తెలిసిన బంగారు నగల దుకాణాలలోనూ లేక ప్రైవేటు బ్యాంకులలోనూ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులో తానూ కొంత భాగాన్ని దోచుకొచ్చిన యువకులకు మరికొంత భాగాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఈ ముఠాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ జట్టులో లీడర్‌తోపాటు ఆరుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా రికవరీ కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement