దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు | Sakshi
Sakshi News home page

దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు

Published Thu, Sep 26 2013 2:00 AM

Robbery committed two arrested

విశాఖపట్నం, న్యూస్‌లైన్: అద్దెకు ఇల్లు కావాలని వెళ్లి ఇల్లు చూపిస్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంచేయడమేకాక ఆమెపై హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులను పెందుర్తి క్రైం పోలీసులు బుధవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్‌‌త ఏసీపీ సి.ఎం.నాయుడు తెలిపిన వివరాలివి. పెందుర్తి బ్రాహ్మణ వీధిలో ఆళ్ల సత్యనారాయణకు ఓ ఇల్లుంది. ఈ ఇంటిని ఎవరైనా అద్దెకు అడిగితే ఇవ్వాలంటూ తాళాలను ఆయన వీధిలో ఉన్న పీలా జయలక్ష్మికి అప్పగించారు.

ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కింజరాపు రాములు (33), బాలి చంద్రశేఖర్ అలి యాస్ శేఖర్ (20)లు అద్దెకు ఇల్లుందా అంటూ జయలక్ష్మిని సంప్రదించారు. ఆమె అదే వీధిలో ఉంటున్న దొడ్డి సత్యవతికి తాళాలు ఇచ్చి వచ్చిన వారికి ఇల్లు చూపించాలని కోరింది. దీంతో సత్యవతి రాములు, శేఖర్‌ను రెండో అంతస్తులో ఉన్న ఇల్లు చూపించేందుకు తీసుకువెళ్లింది. గది తలుపుతీసి సత్యవతి ఇంటిలోకి వెళ్లగా రాముల్ని బయట నిలబడమని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లాడు. సత్యవతి వెనుకగా వెళ్లి ఆమె నోట్లో గు డ్డలు కుక్కి మెడలో ఉన్న నాలుగు తులా ల పుస్తెలతాడును తెంచేశాడు.

ఈ హఠాత్పరిణామంతో అవాక్కయిన సత్యవతి గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్ద రూ ఆమెను పీకనులిమి చంపే ప్రయత్నం చేశారు. చాలాసేపైనా సత్యవతి రాకపోవడంతో అనుమానం వచ్చిన జయలక్ష్మి మేడపైకి వెళ్లగా అక్కడ సత్యవతిపై హత్యాయత్నం జరుగుతుండడాన్ని చూసి గట్టిగా అరిచింది. దీంతో నిందితులిద్దరూ సత్యవతిని వదిలేసి 16 అడుగుల మేడపై నుంచి దూకి పారిపోయారు. బాధితురాలి కుమారుడు దొడ్డినరసింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం సీఐ ఎస్.అడమ్, ఎస్‌ఐ ప్రసాద్‌లు ఘ టనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. స్థానికులు తెలిపిన ఆధారాల మేరకు నిందితులపై నిఘా పెట్టారు. బుధవారం నిందితులు విశాఖ నగరానికి వెళ్లేందుకు పెందుర్తి రైల్వేస్టేషన్‌లో వేచి ఉండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.
 
ఈజీ మనీ కోసం...

 నిందితుల్లో రాము ఆర్టీసీలో డ్రైవర్. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో యాజమాన్యం  ఉద్యోగం నుంచి తొలగించింది. డబ్బుల కోసం ఒత్తిడి పెరగడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చంద్రశేఖర్ బీకాం చదువుతున్నాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement