రూ.22 కోట్లు బొక్కేశారు..! | Sakshi
Sakshi News home page

రూ.22 కోట్లు బొక్కేశారు..!

Published Mon, Jul 13 2015 12:27 AM

Robbery of Rs 22 crore ..!

నగరపాలక సంస్థలో భారీ కుంభకోణం
♦ భవన నిర్మాణాల అనుమతుల మంజూరులో చేతివాటం
♦ ఒక్కొక్క యజమాని నుంచి రూ.లక్షల్లో తీసుకుని వేలల్లో జమ
♦ మిగిలిన సొమ్మును మింగేసిన లెసైన్స్‌డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు
♦ ఆడిట్ తనిఖీల్లో వెలుగు చూసిన అవినీతి బాగోతం
♦ బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఉన్నతాధికారులు
♦ టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసిన భవనాల ప్లాన్లపై విజిలెన్స్‌కు లేఖ

నగరపాలక సంస్థలో ఇదో భారీ కుంభకోణం..సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును పక్కదారి పట్టించి  ఏకంగా 22 కోట్ల రూపాయల వరకు బొక్కేశారు. ఈ అవినీతి దందాలో పరిపాలన సిబ్బంది, లెసైన్స్‌డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల నుంచి పూర్వ కమిషనర్ల వరకు కార్పొరేషన్‌కు పంగనామాలు పెట్టినవారే. మూడేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ అవినీతి బాగోతంపై  ‘సాక్షి’ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇది..
 
 అరండల్‌పేట(గుంటూరు) : నగరపాలక సంస్థ అంటేనే అవినీతికి కేరాఫ్ అని ప్రజలు భావిస్తుంటారు. అందులో పట్టణ ప్రణాళిక విభాగం అంటే  ముడుపులు ఇవ్వనిదే పనిజరగదన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఈ సారి అధికారులు సరికొత్త పంథాలో అవినీతికి తెరతీశారు. నగరంలో భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాల కోసం అనుమతులు కోరుతూ లెసైన్స్‌డ్ ఇంజినీర్లు ద్వారా భవన యజమానులు కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకొనేవారు. వీటిని పరిశీలించిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టరు, పరిపాలనా సిబ్బంది నిబంధనల మేరకు చెల్లించాల్సిన ఫీజులపై యజమానులకు ఎండార్స్‌మెంట్‌లు పంపేవారు.

ఉదాహరణకు ఒక అపార్టుమెంట్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలంటే కార్పొరేషన్‌కు నాలుగు లక్షల రూపాయలు ఫీజుగా చెల్లించాలని ఎండార్స్‌మెంట్ పంపేవారు. యజమాని నుంచి ఈ డబ్బు తీసుకున్న లెసైన్స్‌డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు కేవలం రూ. 40 వేలు మాత్రమే కార్పొరేషన్‌కు చెల్లించేవారు. రశీదులో నలభైవేల పక్కన సున్నాలు కలిపి నాలుగు లక్షలుగా చూపి దరఖాస్తు ఫారానికి జత చేసేవారు. మిగిలిన రూ. 3.60 లక్షలు పంచుకొనేవారు. ఇలా మూడేళ్లలో రూ. 22 కోట్లు నొక్కేశారు.

 బయటపడిందిలా..
 నగరపాలక సంస్థలో మూడు సంవత్సరాలుగా జరిపిన లావాదేవీలపై ఆడిట్ అధికారులు ఈ నెలలో తనిఖీలు నిర్వహించారు. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా మంజూరు చేసిన భవనాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అసలు బాగోతం బయటపడింది. దీనిలో కొంతమంది లెసైన్స్‌డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు పాత్రధారులుగా గుర్తించారు. ఆడిట్ అధికారులు సంబంధిత ఫైళ్లు ట్యాంపరింగ్ అయిన సొమ్ము, బాధ్యులైన అధికారుల పేర్లను గత కమిషనర్ కన్నబాబుకు అందజేసినట్టు సమాచారం.

 బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు....
 పట్టణ ప్రణాళికా విభాగంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌లో ప్రధాన పాత్రదారులపై చర్యలు తీసు కోవాల్సిందిగా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అదేవిధంగా  మూడేళ్లుగా పట్టణ ప్రణాళికా విభాగం మంజూరు చేసిన భవనాల ప్లాన్లు, తదితర అంశాలపై విజిలెన్స్ విచారణకు లేఖ రాస్తున్నారు.

 బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ...
 నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల ధన దాహంతో అక్రమ నిర్మాణాలకు ఊతం ఇస్తూ కార్పొ రేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. నగరంలో నెలకు 80 నుంచి వంద నిర్మాణాలు జరుగుతు న్నాయి. వీటిద్వారా కార్పొరేషన్ ఆదాయానికి గండిపడటంతో పాటు పట్టణ ప్రణాళికాధికారుల జేబు లు నిండుతున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.
 - ఈదర వీరయ్య,పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షులు

Advertisement
Advertisement