చనిపోయిన వారిని బతికిస్తా... | Sakshi
Sakshi News home page

చనిపోయిన వారిని బతికిస్తా...

Published Mon, Dec 1 2014 2:25 AM

Rs.10 thousand charge collect the midwife

చనిపోయిన వారిని బతికిస్తానంటూ టోకరా
రూ.10 వేలు వసూలు చేసిన మంత్రగత్తె

కొండాపురం: చనిపోయిన వారిని తాను బతికిస్తానని, ఇప్పటికే అలా 10 మందిని బతికించానంటూ ఓ మహిళ రూ.10 వేలు తీసుకుని ఉడాయించింది. ఆమె చెప్పినట్లు చేసిన తర్వాత మోసపోయామని బాధిత కుటుంబసభ్యులు గుర్తించి లబోదిబోమన్నారు. ఈ ఘటన ఇస్కదామెర్ల పంచాయతీలోని కేవీఆర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు..కాలనీకి చెందిన కొట్టాపల్లి నారాయణ, బుజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడైన చిన్నసత్యనారాయణ(16) బేల్దారీ పనుల కోసం మూడు నెలల క్రితం కరీంనగర్ జిల్లా జగిత్యాల వెళ్లాడు.

అక్టోబర్‌లో అక్కడ పనిచేస్తుండగా ఇటుక రాయి కాలిపై పడటంతో తీవ్రంగా గాయపడి ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని పలు ఆస్పత్రులతో పాటు ఆలయాలకు కూడా తిప్పారు. అక్టోబర్ 26న చిన్నసత్యనారాయణ మృతిచెందాడు. ఈ క్రమంలో నవంబర్ 25న ఓ గుర్తుతెలియని  మహిళ గ్రామానికి వచ్చింది. స్థానిక పాఠశాల వద్ద కూర్చుని తాను దైవాంశ సంభూతురాలినని పరిచయం చేసుకుంది. కాలనీలో ఇటీవల ఓ యువకుడు మృతి చెందాడని, చేతబడే అందుకు కారణమని పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ, బుజ్జమ్మ దంపతులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు.

చిన్నసత్యనారాయణను తాను బతికిస్తానని, గతంలోనూ పది మందికి ప్రాణం పోశానని నమ్మబలికింది. పూజ ఖర్చు రూ.30 వేలు అవుతుందని చెప్పి అడ్వాన్సుగా రూ.10 వేలు తీసుకుంది. వెళుతూవెళుతూ పూజ చేసిన వస్తువులని పేర్కొంటూ కొంత సామగ్రిని వారికిచ్చి వెళ్లింది. శనివారం రాత్రి 7 నుంచి 12 గంటల మధ్యలో శ్మశానానికి వెళ్లి చిన్నసత్యనారాయణను ఖననం చేసిన చోట కాళ్ల వద్ద ఆ వస్తువులను ఉంచి అతడిని పిలవాలని సూచించింది.

ఆమె చెప్పినట్లే చేసిన బాధిత కుటుంబసభ్యులకు ఒక్కసారిగా దుర్ఘందం వెదజల్లడంతో మోసపోయామని గ్రహించి, గుంటను పూడ్చేసి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనవిజ్ఞానవేదిక జిల్లా కార్యదర్శి టీఎస్ కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు మేడం నరసింహారెడ్డి,  కలిగిరి ప్రతినిధులు రావుల లక్ష్మీనారాయణ, మస్తాన్‌రెడ్డి, మంజాన్ రావు, పౌరహక్కుల సంఘం నేత డాక్టర్ అంకయ్య తదితరులు ఆదివారం కాలనీని సందర్శించారు. మూఢనమ్మకాలతో మోసపోవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement