40 వేలకు 3 వేలే మాఫీ! | Sakshi
Sakshi News home page

40 వేలకు 3 వేలే మాఫీ!

Published Tue, Dec 9 2014 9:35 AM

40 వేలకు 3 వేలే మాఫీ! - Sakshi

రూ.50 వేల లోపు రుణమున్నా దశల వారీ మాఫీయే?
సాక్షి, విజయవాడ బ్యూరో: ఈ నెల 4వ తేదీన చంద్రబాబు రుణమాఫీపై విధాన ప్రకటన చేశారు. యాభై వేల లోపు రుణమైతే ఒకేసారి మాఫీ అన్నారు. 6వ తేదీన అర్హులైన రైతుల జాబితా వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామన్నారు. 6 పోయింది. 7వ తేదీ వచ్చినా రైతులకు ఎదురుచూపులు తప్పలేదు. చివరకు ఆదివారం రాత్రి జాబితా పెట్టినట్లు ప్రకటించారు. సోమవారం రైతులంతా బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంతో ఉత్కంఠతో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు ప్రయత్నించిన రైతులకు నిరాశే ఎదురయ్యింది. సంబంధిత వెబ్‌సైట్ ఓ పట్టాన ఓపెన్ అయితే ఒట్టు. ఎట్టకేలకు ఓపెన్ అయినా ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలన్నీ నమోదు చేయమనడంతో అన్నదాతలు బిత్తరపోయారు. సోమవారం కూడా వెబ్‌సైట్ సరిగ్గా ఓపెన్ కాని పరిస్థితి. ఓపెన్ అయినచోట వివరాలన్నీ ఎంటర్ చేసిన రైతులకు మతిపోయినంత పనైంది. అర్హులైన అనేకమంది రైతుల పేర్లు లేనేలేవు. 50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకూ చుక్కెదురే. కొన్ని చోట్లయితే 40 వేల రుణం ఉన్న రైతుకు 3 వేలే మాఫీ అయినట్టుంది. 30 వేల రుణం ఉన్న రైతుకు 4 వేలే మాఫీ అయినట్టుంది.
 
పైగా సమగ్ర వివరాలు లేకపోవడంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రెండు రోజులుగా వీరు పరీక్షా ఫలితాలు చూసుకునే విద్యార్థుల్లా మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వివరాలు లభించడం లేదు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 2013 డిసెంబర్ నాటికి 8,70,321 మంది రైతులు రుణాలు తీసుకోగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇందులో 4.73 లక్షల మంది మాత్రమే రుణమాఫీకి అర్హత పొందారు. ప్రభుత్వం ప్రకటించిన తొలి దశ మాఫీకి (రూ.50 వేల లోపు రుణమున్నవారు) 1.98 లక్షల మంది అర్హత పొందారు. వీరికి రూ.473 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. ఈ మేరకు రూ.40 వేల రుణమున్న రైతుకు ఒక్కసారే మాఫీ కింద రూ.40 వేల మాఫీ జరగాల్సి ఉండగా, ఆన్‌లైన్‌లో మాత్రం ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకూ మాఫీ జరిగినట్లుగా అప్‌లోడ్ చేశారు. దీన్ని చూసి రైతులు తాము తీసుకున్న రుణం ఎంతని నమోదైందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 4.75 లక్షల మంది రుణాలు తీసుకున్న వారుండగా, ఇందులో తొలి విడత మాఫీకి 1.20 లక్షల మంది అర్హులని అంచనా.
 
అయితే బ్యాంకుల వారీగా ఎంతమంది, బ్రాంచీల వారీగా ఎందరు, మొత్తం ఎంత మాఫీ కావాలన్న వివరాలు అందలేదు. ఏ జిల్లాకు కూడా ఇప్పటి వరకూ ఎంతమంది రైతులు రుణ అర్హత పొందారు, ఎంత మాఫీ అవుతుందన్న సమగ్ర వివరాలు అందలేదు. రైతులు, మీడియాకు సమాధానం చెప్పలేక వివిధ జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌బీసీకి ఫోన్లు చేస్తే అక్కడినుంచి సమాధానం రావడం లేదు. ప్రభుత్వం బ్యాంకుల వారీగా నోటీసు బోర్డులపై పూర్తి వివరాలతో కూడిన జాబితాలను పెట్టే వరకూ వేచి ఉండాల్సిందేనని ఆయా జిల్లాల్లో బ్యాంకర్లు బదులిస్తున్నారు. మరోవైపు రైతుల రుణం పూర్తిగా మాఫీ అయ్యే వరకూ రైతులు స్వయంగా ఆయా రుణాలను క్లియర్ చేయకూడదన్న నిబంధనలు కూడా మింగుడు పడటం లేదు. ఇదిలా ఉండగా, రబీ సీజను ఊపందుకున్న జిల్లాల్లో అన్నదాతలకు మళ్లీ పెట్టుబడుల భారం మొదలైంది. మాఫీ అవుతున్న మొత్తమెంతో తెలిస్తే, దాన్నిబట్టి కొత్త అప్పులు తీసుకునే వీలుంటుందన్న ఆలోచనలో రైతులున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ‘తాంబూలాలిచ్చాం..తన్నుకు చావండి’ అన్న చందాన ఆన్‌లైన్‌లో మొక్కుబడిగా కొంత సమాచారం అప్‌లోడ్ చేసి చేతులు దులుపుకొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement