ఆర్టీసీలో సమ్మె సైరన్ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమ్మె సైరన్

Published Tue, Dec 24 2013 12:22 AM

ఆర్టీసీలో సమ్మె సైరన్ - Sakshi

=జనవరి 3 వరకు గడువు
 =సమస్యలు పరిష్కరించకుంటే 12 నుంచి సమ్మె
 =యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు
 =రైల్వేలోనూ సమ్మెపై బ్యాలెట్

 
సాక్షి, విజయవాడ : ప్రగతిరథ చక్రాలు మళ్లీ నిలిచిపోనున్నాయి. ఆర్జీసీలో ఇప్పటికే సమ్మె హారన్ మోగగా, దక్షిణ మధ్య రైల్వేలో కూడా సమ్మె చేయాలా వద్దా అనే అంశంపై మజ్దూర్ యూనియన్ బ్యాలెట్ నిర్వహించింది. ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసే అంశంలో యాజమాన్య నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్, తె లంగాణ మజ్దూర్ యూనియన్ రెండు రోజుల క్రితం సమ్మె నోటీసు ఇవ్వగా, మంగళవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ వారు సమ్మె నోటీసు ఇస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 282 మంది కాంట్రాక్టు కార్మికులను నాలుగు దశల్లో పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటి, నవంబర్ ఒకటికి రెండు దశల్లో, వచ్చే ఏడాది మే ఒకటి, సెప్టెంబర్ ఒకటికి మరో రెండు దశల్లో వీరిని పర్మినెంట్ చేయాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం ఇప్పటికి రెండు దశల్లో కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉండగా, ఆ పని ఇంతవరకూ చేయలేదు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్‌గా ఉంది.

వీటి అమలు విషయంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మరోవైపు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. ఉద్యోగుల పేస్కేల్స్ రివిజన్ అక్టోబర్ నాటికి జరగాల్సి ఉండగా అవి కూడా జరగడం లేదు. ఈ నేపథ్యంలో సమ్మె అనివార్యం కానుందని ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు.

 సమస్యలు పరిష్కరించకుంటే  సమ్మె తప్పదు...
 
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని వైవీ రావు చెప్పారు. వచ్చే నెల మూడు వరకు గడువిచ్చామని, ఆ తర్వాత కార్మిక శాఖతో కూడా మాట్లాడతామని వివరించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే జనవరి 12 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రైల్వేలోనూ...
 
మరోవైపు రైల్వేలో కూడా కార్మికులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై వారు సమ్మెకు వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు.  విజయవాడ రైల్వే డివిజన్‌లో మజ్దూర్ యూనియన్ గత వారంలో సమ్మె బ్యాలెట్ నిర్వహించింది. విజయవాడ డివిజన్‌లో మొత్తం 19 వేల 120 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 15 వేల 322 మంది ఈ బ్యాలెట్‌లో పాల్గొన్నారు. వీరిలో 15 వేల 227 మంది అనుకూలంగా ఓటు వేయగా, కేవలం 97 మంది వ్యతిరేకించారు. వచ్చే నెల 17, 18 తేదీలలో రైల్వే మజ్దూర్ సంఘ్ కూడా సమ్మెపై బ్యాలెట్ నిర్వహించనుంది. సమ్మెకు జోనల్ స్థాయిలో మంచి మద్దతు వస్తుండటంతో వారు కూడా సమ్మెకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది.
 

Advertisement
Advertisement