కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు

Published Sun, May 10 2015 3:47 AM

Rtc strike fourth day

 పలుచోట్ల వంటావార్పుతో నిరసన
 కదిరిలో పోలీసుల తీరుపై నిరసన
 గుంతకల్లులో బస్సు అద్దాలు ధ్వంసం  
 15 బస్సులకు గాలి తీసేసిన  కార్మికులు
 నాల్గవ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

 
 అనంతపురం రూరల్ :  ఆర్టీసీ కార్మికులు వంటావార్పు, నిరసనలు, ర్యాలీలతో కదంతొక్కుతున్నారు. మొక్కవోని దీక్షతో విధులకు హాజరుకాకుండా ఉద్యమ తీవ్రతను పెంచుతున్నారు. అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు తిప్పుతున్నా... శాంతియుతంగానే నిరసన తెలుపగా, పలు చోట్ల బస్సుల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు, టైర్లకు గాలి తీసి ఆందోళనలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శనివారం నాటికి నాల్గవ రోజుకు చేరుకుంది. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐతో పాటు ఎస్‌యుసీఐ, తదితర పార్టీలు మద్దతుగా నిలిచి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

గుంతకల్లు పట్టణంలో ఒక బస్సు అద్దాలు పగలకొట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులు వెళ్లకుండా ఆపుతున్న కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించారు. బలవంతంగా కార్మికులు, సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి పోలీసుల తీరును తప్పుబట్టారు. న్యాయబద్ధమైన డిమాండ్ కోసం నిరసన తెల్పుతుంటే పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు.

కాసేపు స్టేషన్ ముందు పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే విధంగా చిత్తూరులో మహిళా కండక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా కదిరిలో కార్మికులు ర్యాలీతో పాటు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరికి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్ బాషా మద్దతు తెలిపారు. కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు.

కార్మికుల పట్ల ప్రభుత్వమే ఉద్ధేశ్యపూర్వకంగా పోలీసులతో ఇబ్బందికి గురి చేస్తుందని ఆరోపించారు. ఇక జిల్లా కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం హైలైట్‌గా నిలిచింది. కార్మిక  నేతలు కొండయ్య, గోపాల్, వెంకటేశ్, రామాంజినేయులు, రామిరెడ్డి, ఆదాం,  తదితరుల ఆధ్వర్యంలో  వేల మంది కార్మికులు వంటావార్పులో పాల్గొని డిపో ఆవరణంలోని భోజనాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాఉ చేశారు.

వీరికి ఎమ్మెల్సీ గేయానంద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, సీపీఎం నేతలు నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ నుంచి నాగరాజు, దాదాగాంధీ, ఎస్‌యుసీఐ సుబ్రమణ్యం తదితరులు మద్దతు తెల్పి ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా ధర్మవరం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, రాయదుర్గం, తదితర డిపోల్లో వంటావార్పు కార్యక్రమం జరిగింది.

కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు- ఎమ్మెల్సీ గేయానంద్ :
 ఆర్టీసీ కార్మికులు ఎంతో మందికి ఆదర్శమని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. విధి నిర్వహణలో లక్షల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ తమ కర్తవ్యాన్ని చాటుకుంటున్నారన్నారు. ఇవాల టీడీపీ అధికారంలోకి వచ్చాకి వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్మికుల్లో అభద్రతాభావం నెలకొల్పోలే ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ చేసేలా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కార్మికులకు అది చేస్తాం... ఇది చేస్తామని చెప్పి ఇవాల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటదాట వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

బస్టాండ్ వెలవెల
 ఆర్టీసీ యాజమాన్యం అరకొరగా బస్సులు తిప్పుతున్నా... బస్టాండ్‌లు మాత్రం వెలవెలబోతున్నాయి. ప్రయాణీకులు గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకుండా పోతోంది. బస్టాండ్‌లలోనే కునుకు తీసుకుంటున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో వెళ్తూ తిప్పలు పడుతున్నారు.

అభద్రత లో ప్రజలు
 ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఎలాగైనా తిప్పాలనే ఉద్ధేశంతో హెవీ లెసైన్స్ కల్గిన వారిని రంగంలోకి దింపింది. హైవే రోడ్లపై అనుభవం తక్కువ ఉన్న వారు డ్రైవింగ్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ నెల 8న బత్తలపల్లిలో తృటిలో పెద్ద ప్రమాదం జరిగేది. అదే  విధంగా ఈ నెల 7న అనంతపురంలో బస్టాండ్ ఆవరణంలోనే ఓ ఇండికా వాహనాన్ని ఢీకొట్టారు. దీని ప్రభావంతోనూ చాలా మంది బస్సుల్లో ప్రయాణించేందుకు నిరాకరిస్తున్నారు.

 412 బస్సులు తిప్పిన ఆర్టీసీ : ఇవాల ఆర్టీసీ రీజియన్ వ్యాప్తంగా 412 సర్వీసులను తిప్పింది. డీఎస్సీ నేపథ్యంలో ఉదయం నుంచి అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. కానీ ఆదాయం మాత్రం కనీసం రూ 10 లక్షలు కూడా రాలేదని అధికారులు చెబుతున్నారు. రూ. కోటి పది లక్షలు వచ్చే రీజియన్‌లో అరకొరగా రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు కండక్టర్లు దోపిడీ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement