ఆర్టీసీకి ‘పండగ’ తాకిడి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి ‘పండగ’ తాకిడి

Published Mon, Jan 12 2015 12:27 AM

ఆర్టీసీకి ‘పండగ’ తాకిడి

 విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగ తాకిడి ఆర్టీసీకి బాగానే తాకింది. పండగ నేపథ్యంలో జిల్లాకు ప్రయాణికుల రాకపోకలు  పెరగడంతో ఆర్టీసీ బస్సులకు రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో 50 అదనపు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు సెలవులు ప్రకటించడంతో శనివారం రాత్రి నుంచి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీ పెరిగింది. పండగ సందర్భంగా కొనుగోళ్లు చేసేందుకు జిల్లా కేంద్రానికి రావడం, దూరప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల ద్వారా జిల్లాకు వచ్చేవారు ఎక్కువవఆర్టీసీకి ఆదివారం రద్దీ బాగా కనిపించింది.  
 
 ఈ మేరకు జిల్లా కేంద్రం నుంచి  జిల్లాలోని నాలుగు డిపోల సర్వీసులను క్రమబద్ధీకరించారు.  జిల్లా కేంద్రానికి వచ్చినవారు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, ఎస్‌కోట, రాజాం, గరివిడి, చీపురుపల్లి, శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులకు  వెళ్లడంతో  జిల్లాలోని వివిధ డిపోల నుంచి దూరప్రాంతాలతోపాటు ఉత్తరాంధ్రజిల్లాల పరిధిలో అదనపు సర్వీసులను నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖ నుంచి పట్టణం మీదుగా పార్వతీపురం, సాలూరు వెళ్లే డెరైక్ట్ బస్సులకు రద్దీ ఉంది. పట్టణంలోని రైల్వేస్టేషన్ మూడు రాష్ట్రాల జంక్షన్ కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా అధికంగానే ఉంటున్నారు. దూరప్రాంతాల నుంచి రాజాం, చీపురుపల్లి, నాతవలస, రణస్థలం ప్రాంతాలకు వెళ్లేందుకు  రైళ్లలో వచ్చే వారు పట్టణ రైల్వేస్టేషన్‌లో దిగుతారు. ఇక్కడ నుంచి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు.
 
 అదనపు సర్వీసులివే..!
 విజయనగరం డిపో పరిధిలో విశాఖ-రాజాం 5, బొబ్బిలి-విశాఖ 5, విశాఖ-రాజాం మధ్య 2, రాజాం-రాజమండ్రి 2, విజయనగరం-హైదరాబాద్ 2,  బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ డిపోల నుంచి సాలూరు-విశాఖ 10, పార్వతీపురం- విశాఖ 10, పార్వతీపురం -విజయవాడ 2, ఎస్‌కోట-రాజమండ్రి 3, ఎస్‌కోట-కాకినాడ 2, సాలూరు-రాజమండ్రి 2, సాలూరు-రావులపాలెం 1 అదనంగా సర్వీసులను నడుపుతున్నామని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు తెలిపారు. దూరప్రాంతాల నుంచి రైళ్లద్వారా వచ్చే ప్రయాణికుల కోసం రైళ్ల సమయాలకు అనుగుణంగా జిలాల్లోని  రైల్వేస్టేషన్‌లను కలుపుతూ పలు పల్లెవెలుగు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Advertisement
Advertisement