కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులు | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులు

Published Tue, Sep 23 2014 3:23 AM

కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులు

ముత్తుకూరు : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, కేంద్రంలో పీఎం నరేంద్రమోడీ కార్మికుల చట్టాలను కాలరాస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ విమర్శించారు. ముత్తుకూరులో సీఐటీయూ నూతన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గఫూర్ మాట్లాడుతూ చంద్రబాబు పరిశ్రమలు కావాలంటూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర,రాష్ట్ర పాలకులు కార్మిక చట్టాలకు ఎసరు పెట్టడం దుర్మార్గమన్నారు. ముత్తుకూరు మండలంలోని పరిశ్రమలు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని మండిపడ్డారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనులు చేసే కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.
  సీపీఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య మాట్లాడుతూ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల హక్కులు, ప్రయోజనాలు పరిరక్షించేందుకు సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.మోహనరావు, ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత నక్కా రాధయ్య, మండల కార్యదర్శి అంకయ్య  పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement