దుంగల దొంగలు | Sakshi
Sakshi News home page

దుంగల దొంగలు

Published Wed, Jul 16 2014 12:10 AM

దుంగల దొంగలు - Sakshi

 బాపట్ల టౌన్: అడవులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోవడం దొంగల చేతికి తాళం ఇచ్చినట్టుగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా అడవిలోని జామాయిల్, సరుగుడు, జీడిమామిడి చెట్లను నరికి మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. బాపట్ల, కర్లపాలెం మండలాల్లో వేలాది ఎకరాల్లో అడవులు ఉన్నాయి. పేరలి, ముత్తాయ పాలెం సెక్షన్ల పరిధిలో జామాయిల్, సరుగుడు, జీడిమామిడి తోటలు సుమారు 25 వేల హెక్టార్ల పరిధిలో ఉన్నాయి.
 
 రూ. లక్షలు హెచ్చించి ఈ తోటలు పెంచుతున్నారు. అయితే అవి పెరిగిన తరువాత వేలం నిర్వహించాలి, లేదంటే టన్నుల ప్రకారం కలపను విక్రయించాలి. వచ్చిన సొమ్ముతో మిగిలిన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.
 
 అయితే అధికారులు స్థానికంగా ఉండకపోవడం, తోటలకు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోతుండటం వల్ల రాత్రికి రాత్రే  వందల సంఖ్యలో జామాయిల్ బాదులను మార్కెట్‌కు తరలిస్తున్నారు.
 
 ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియదన్నట్లుగా అధికారులు వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది.
 
 అక్రమంగా తరలించేదిలా...
 కొందరు స్మగ్లర్లు రాత్రికి రాత్రే అడవిని నరికి కలపను పడవల సాయంతో కాలువలు దాటించడం ఆ తరువాత ట్రాక్టర్లు, ఆటోలతో వేరే ప్రాంతానికి తరలించడం పరిపాటిగా మారింది.
 
 ఫారెస్ట్ అధికారుల కళ్లు కప్పేందుకు పట్టణంలోని వివిధ అడితీల్లో కలప కొనుగోలు చేసినట్లుగా ఫోర్జరీ బిల్లులు సృష్టిస్తున్నారు.
 
 నిప్పటించి నరుకుతున్నారు :
 పచ్చని చెట్లు నరికి తరలిస్తే అటవీశాఖాధికారులు పట్టుకుంటారనే  భయంతో పది పదిహేను రోజులు ముందుగా  చెట్లపై పెట్రోలు, డీజిల్ పోసి నిప్పంటిస్తున్నారు.  ఆ తర్వాత వాటిని నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.
 
 గతంతో ఫారెస్ట్ అధికారులు అడవిలోని కలపను ఎవరైనా వేరేప్రాంతాలకు తరలిస్తే తనిఖీలు నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకునేవారు.
 
 ప్రస్తుతం చర్యలు కాదుకదా, కనీసం తనిఖీచేసే నాథుడే కరువయ్యారు. ఇదే అదనుగా భావించిన దొంగలు రోజుకు కనీసం 500 నుంచి వెయ్యి చెట్లు నరికి తరలించుకుపోతున్నారు.
 
 పరిశీలించి చర్యలు తీసుకుంటాం
 అక్రమంగా కలపను తరలిస్తున్న వారిపై దృష్టి సారిం చాం. ఇప్పటికే కొంత మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నాం. అయితే ఏఏ బీట్‌ల్లో ఎక్కువగా కలప అక్రమంగా తరలిపోతుందో గమనించి సంబంధిత బీట్ ఆఫీసర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
 - రమణారెడ్డి, రేపల్లె రేంజ్ ఫారెస్టు ఆఫీసర్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement