గ్రామీణ విద్యకు గ్రహణం | Sakshi
Sakshi News home page

గ్రామీణ విద్యకు గ్రహణం

Published Thu, Sep 19 2013 3:37 AM

Rural education eclipse in srikakulam

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం దెబ్బకు సంక్షేమం కుదేలైంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం పుణ్యమా అని సర్కారు విద్య పూర్తిగా మూలన పడింది. సమైక్యాంధ్ర పరిరక్షణ డిమాండ్‌తో ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న వసతి గృహాలు మూతపడ్డాయి. చదువుకోవాల్సిన సమయంలో విద్యార్థులు ఇళ్లకు పరిమితమై ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. దీనంతటికీ కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వ నిర్వాకమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జూన్ నెల మధ్యలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఖర్చుతో కూడుకున్న ప్రైవేట్ చదువులు చదివించలేని పేద కుటుంబాల వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చేర్పించారు. జూలై నెలాఖరు వరకు తరగతులు సజావుగానే సాగాయి. ఆ నెల 30న రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. 
 
 దీనిపై సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తి ఉద్యమ రూపం దాల్చాయి. వివిధ శాఖల ఉద్యోగులు క్రమంగా సమ్మె బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల సిబ్బంది కూడా సమ్మెలో చేరడంతో ఆగస్టు 21 నుంచి అవి పూర్తిగా మూతపడ్డాయి. విద్యార్థులకు ఇంతవరకు యూనిఫారాలే అందకపోగా.. విద్యార్థులకు వంట చేసి భోజనం పెట్టేవారు కూడా లేకపోవడంతో వారంతా ఇంటి బాట పట్టారు. ఉద్యమం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం కోల్పోతామేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే సమ్మెను మాత్రం ఏ ఒక్కరూ తప్పు పట్టడం లేదు. రాష్ట్రం విడిపోతే నేటి విద్యార్థులతోపాటు భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని.. అందువల్ల విభజన నిర్ణయం ఉపసంహరించే వరకు ఉద్యమం కొనసాగాల్సిందేనని అటు తల్లిదండ్రులు, ఇటు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
 
 జిల్లాలో 78 బీసీ వసతి గృహాలు ఉండగా వీటిలో సుమారుగా 8400 మంది, 60 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సుమారు 6.300 మంది, 9 ఎస్టీ వసతి గృహాల్లో వెయ్యి మంది విద్యార్థులు కలిపి మొత్తం 15,700 మంది విద్యార్థులు చదువుతున్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఈ  విద్యా సంవత్సరంలో ఇంతవరకు యూనిఫారాలు అందజేయలేదు. ఏడాదికి ఒక్కో విద్యార్థికి నాలుగు జతల యూనిఫారాలు అందజేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన వస్త్రాలు జూలైలోనే జిల్లా సంక్షేమాధికారులకు అందాయి. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల ఆధికారులు దుస్తులు కుట్టడానికి ఆర్డర్ ఇచ్చినా బీసీ సంక్షేమ ఆధికారిణి సకాలంలో ఆ పని చేయలేదు.  ఈ శాఖలో వివాదాలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలిసింది. ఇదంతా జరిగి రెండు నెలలు గడిచించి.. ఇంతలోనే ఉద్యమం మొదలైంది. దీంతో ఇంతవరకు విద్యార్థులకు ఒక్క జత యూనిఫారమైనా అందలేదు. గత ఏడాది అంజేయాల్సిన యూనిఫారాలను మాత్రం కొంతమేరకు సీనియర్ విద్యార్థులకు అంజేశారు. ఈ సమస్యలు ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు.
 

Advertisement
Advertisement