Sakshi News home page

కౌలు రైతుల కన్నీళ్లు

Published Thu, Jan 9 2014 2:56 AM

rural water bowl to cool. Arutadi bodies of water by crops, to ensure not only the phases

కౌలు రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రబీలో ఆరుతడి పంటలకు మాత్రమే
 విడతల వారీగా సాగునీరు అందిస్తామని, వరి పంటకు సాగునీరు ఇవ్వబోమని, ఒకవేళ
 వరి పంట సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదంటూ ఎన్‌ఎస్‌పి అధికారులు
 ప్రకటనలు చేస్తుండటంతో ఏం చేయాలో పాలు పోక కౌలు రైతులు తలలు పట్టుకొని
 కూర్చున్నారు. ఆరుతడి పంటలకు సైతం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే సాగునీరు
 అందిస్తామని, తదనంతరం కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామని ఎన్‌ఎస్‌పి
 ఎస్‌ఈ సన్యాసినాయుడు ఇటీవల చేసిన ప్రకటన అశనిపాతంగా మారింది.
 
 
 సాక్షి, నరసరావుపేట : మూడేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవక, పంటలు సరిగా పండక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో ముందుగా వర్షాలు కురవడంతో కొండంత ఆశతో పంటలు సాగు చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు మూడేళ్లుగా పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు పడి ఈ ఏడాది ఎక్కువ పొలం తీసుకొని సాగు చేశారు. మొదట్లో అనుకూలించిన వాతావరణం అతివృష్టి రూపంలో  పంటలను దెబ్బతీసింది. అధిక వర్షాలకు దిగుబడి తగ్గింది. ఎకరాకు 20 నుంచి 25 బస్తాలు మాత్రమే ధాన్యం పండింది. దీంతో కౌలు రైతుల ఆశలు అడియాశలయ్యాయి. వరి సాగు చేసిన రైతులు మొదటి పంటకు ఎకరాకు 15 బస్తాలు, రెండో పంటకు 10 బస్తాల చొప్పున  కౌలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మొదటి పంటకు ప్రకృతి అనుకూలించక దిగుబడి తగ్గింది.
 
 వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 6,58,700 ఎకరాల్లో వరిసాగు చేశారు, దీంట్లో 70 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఎకరాకు 10 బస్తాల చొప్పున 65 లక్షల 87 వేల బస్తాల ధాన్యం దిగుబడులు తగ్గాయి. అంటే జిల్లాలో వరిరైతులు సుమారు రూ. 800 కోట్లు నష్టపోయారని అంచనా. ఇందులో కౌలు రైతులకు సుమారు రూ. 550 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో రెండో పంటగా వరి పండించుకునేందుకు ప్రభుత్వం సాగునీరు అందిస్తే కొంతమేర నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన కౌలు రైతులకు ప్రభుత్వ ప్రకటన అశనిపాతంగా మారింది. ఆరుతడి పంటలు వేసినా పది బస్తాల చొప్పున కౌలు చెల్లించాల్సిందేనంటూ భూ యజమానులు కౌలు రైతులపై ఒత్తిడి తెస్తుండటంతో కొందరు అసలు పంటలు సాగు చేయకుండా వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.
 
 రుణాలకు అవకాశం లేదు...
 కనీసం బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వరి పంట సాగు చేసి కొంతమేరకైనా నష్టాన్ని పూడ్చుకుందామని కౌలు రైతులు ఆశించారు. అయితే రబీలో వరిపంట సాగు చేస్తే  రైతులకు రుణాలు ఇవ్వొద్దంటూ జిల్లా కలెక్టర్ బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంతో వీరికి రుణాలు కూడా మంజూరు కావడం లేదు. కొందరు రైతులు ఇప్పటికే నార్లుపోసుకోగా మరికొందరైతే వరినాట్లు కూడా వేశారు. ప్రభుత్వం, అధికారుల ప్రకటనలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతుసంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రబీకి సాగునీరు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement