వాల్మీకులు దగాపడిన తమ్ముళ్లు | Sakshi
Sakshi News home page

వాల్మీకులు దగాపడిన తమ్ముళ్లు

Published Mon, Dec 29 2014 2:54 AM

S.P R.K ravikrishna

కర్నూలు(అర్బన్): ‘‘వాల్మీకులు ఫ్యాక్షనిస్టులు కాదు. వారంతా దగాపడిన తమ్ముళ్లు. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వేలాది కుటుంబాలు దుర్భర జీవనం గడుపుతున్నాయి.’’ అని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్‌పీఎస్) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధ్యక్షతన వాల్మీకుల శాంతి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి వారసులైన బోయలు ముఠా నాయకులకు దూరంగా ఉండాలన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడే ఫ్యాక్షనిస్టు ముద్రను చెరిపేసుకోవడం సాధ్యమవుతుందన్నారు.
 
 జిల్లాలో వాల్మీకుల జనాభా 12 లక్షలకు పైగా ఉన్నా.. ముఖ్యమైన అధికార హోదాల్లో అతి తక్కువ మంది ఉండటం బాధాకరమన్నారు. బడి బయటి వాల్మీకుల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు పోలీసు శాఖ తరఫున తమ వంతు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు కారణమవుతున్న మద్యానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో దాదాపు 30 ఏళ్లుగా అనేక మంది వాల్మీకులపై రౌడీషీట్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని.. సత్ప్రవర్తన కలిగిన వారిపై వీటిని ఎత్తేసేందుకు డీఎస్పీలచే విచారణ చేయిస్తామన్నారు. ఫ్యాక్షన్ కారణంగా మృతి చెందిన, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారి తల్లుల కన్నీళ్లు చూసైనా మార్పు దిశగా అడుగులు వేయాలన్నారు. కేసుల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేలా పోలీసులకు తగిన ఆదేశాలిస్తామన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లోని యువతలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వీఆర్‌పీఎస్ ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ దశాబ్ధాల చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఘటనలో హంతకులు, హతులు వాల్మీకులే ఉంటున్నారన్నారు. ఈ సంస్కృతిలో మార్పు అవసరమన్నారు. వాల్మీకులు అన్ని రంగాల్లో రాణించాలంటే ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోవడం ఒక్కటే మార్గమన్నారు.
 
 వీఆర్‌పీఎస్ కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ వెంకన్న మాట్లాడుతు ఫ్యాక్షన్ ఊబి నుంచి వాల్మీకులు బయటకు రావాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యపరంగా వాల్మీకులు వెనకబాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సి.తిక్కన్న, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, వీఆర్‌పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వలసల రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, కార్యదర్శులు జి.రాంభీంనాయుడు, సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎల్.వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షురాలు బీటీ అనురాధ, నాయకులు బేవినహాల్ హనుమంతప్ప, బోయ గోపితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకులు పాల్గొన్నారు.
 
 అండగా నిలుస్తాం
 జిల్లాలో వాల్మీకులకు ఎక్కడ అన్యాయం జరిగినా వీఆర్‌పీఎస్ అండగా నిలుస్తుంది. హత్యా రాజకీయాలకు వాల్మీకులు దూరంగా ఉండాలి. అనేక గ్రామాల్లో ముఠా, రాజకీయ నాయకులు వాల్మీకులను అణగదొక్కేందుకు సోదరులైన ఎస్సీలతో అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. ఈ కేసుల్లో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి. కుటంబంలో ఒకరు తప్పు చేస్తే ఆ వ్యక్తిపైన మాత్రమే కేసులు నమోదు చేయాలి. అలా కాదని మొత్తం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం తగదు.
 - ఎం.సుభాష్ చంద్రబోస్,
 వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
 

Advertisement
Advertisement