రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు | Sakshi
Sakshi News home page

సదావర్తి భూములను దక్కించుకున్న సత్యనారాయణరెడ్డి

Published Mon, Sep 18 2017 2:21 PM

రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు - Sakshi

చంద్రబాబు సర్కార్‌ కుట్రకు బ్రేక్‌
సదావర్తి భూముల వేలానికి అనూహ్య స్పందన
అనూహ్య ధర పలిగిన సదావర్తి సత్రం భూములు
గంటపాటు పోటా పోటీగా సాగిన వేలం పాట
రూ.60.30 కోట్లకు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్‌


సాక్షి, అమరావతి : సదావర్తి ట్రస్ట్ భూముల వ్యవహారంలో చంద్రబాబు భాగోతం బట్టబయలైంది. చౌకగా సదావర్తి భూములను తన అనుయాయులకు కట్టబెట్టాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు షాక్‌ తగిలింది.  సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి సత్రం భూములు మూడింతల ఎక్కువ ధర పలికాయి.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం చెన్నైలో నిర్వహించిన వేలం పాటలో...సదావర్తి భూములు ఏకంగా 60 కోట్ల 30 లక్షల ధర పలికాయి. వేలం పాటలో 83.11 ఎకరాల భూమిని  కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌ వేలం పాటలో దక్కించుకుంది. సత్యనారాయణ బిల్డర్స్‌ తరఫున ప్రొద్దుటూరు ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బద్వేలు శ్రీనివాస్‌ రెడ్డి వేలంలో పాల్గొన్నారు. కాగా, ఆ సంస్థలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డితో పాటూ పలువురు భాగస్వాములుగా ఉన్నారు.

రూ.27కోట్ల 45 లక్షల నుంచి ప్రారంభమైన వేలం పాట ముందు నుంచి పోటాపోటీగా సాగింది. ఈ-టెండర్లలో 54 కోట్లకు బ్రహ్మనంద కోట్ చేశారు. అయితే బహిరంగ వేలంలో మాత్రం 60 కోట్ల 30 లక్షలకు సత్యనారాయణ బిల్డర్స్‌ దక్కించుకుంది. గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అంటే...37 కోట్ల 90 లక్షల అధిక ధర పలకడంతో.... చంద్రబాబు ప్రభుత్వానికి చెంప పెట్టుగా మారింది. వేలం పాట ప్రక్రియ మొత్తాన్ని సుప్రీం కోర్టు నివేదిస్తామని దేవదాయ శాఖ కమిషనర్ అనురాధ ప్రకటించారు.

చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటలకు  సదావర్తి సత్రం భూముల అమ్మకానికి బహిరంగ వేలం ప్రక్రియ మొదలైంది. ఈ–టెండరు కమ్‌ సీల్డు కవర్‌ కమ్‌ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి మళ్లీ వేలం నిర్వహించారు. దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ నేతృత్వంలో భూముల వేలం కొనసాగింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బహిరంగ వేలానికి ఎమ్మెల్యే ఆర్కే హాజరు అయ్యారు. ఈ-టెండర్లలో హరి అసోసియేట్‌ కంపెనీ అర్హత సాధించగా, బి. రామకృష్ణ, ఆళ్ల రామకృష్ణ, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఆర్‌కే కిషోర్‌, డి.బ్రహ్మానందం, వెంకట జయరామిరెడ్డి టెండర్లు అర్హత పొందాయి.

కాగా  సదావర్తి సత్రం పేరిట ఉన్న 83.11 ఎకరాల భూముల అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడాది మార్చి 28న చెన్నై నగరంలో బహిరంగ వేలం నిర్వహించింది. అప్పుడు జరిగిన వేలం ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, సర్కారు పెద్దలు ఆ భూములు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టుకు వెళ్లడంతో ఏడాదిన్నరగా దీనిపై వివాదం కొనసాగుతోంది.

అయితే సదావర్తి సత్రం భూములుగా పేర్కొంటున్నవి తమ ఆస్తులని, ఏపీ ప్రభుత్వం నిర్వహించే వేలం ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో 83.11 ఎకరాలను రూ.22.40 కోట్లకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వారికి సదావర్తి భూములు కట్టబెట్టిన విషయం విదితమే. తాజా వేలంలో సదావర్తి భూములకు అనూహ‍్యంగా ధర పెరిగి చంద్రబాబు సర్కార్‌కు చుక్కెదురు అయినట్లు అయింది.

సదవర్తి భూములపై సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి

 

 

Advertisement
Advertisement