జిల్లాకు సాగర్ జలాలు | Sakshi
Sakshi News home page

జిల్లాకు సాగర్ జలాలు

Published Thu, Oct 3 2013 3:47 AM

Sagar water released to Prakasam district

త్రిపురాంతకం,న్యూస్‌లైన్: సాగర్ ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా లింగాలపల్లి వద్ద సాగర్ ప్రధాన కాలువకు గండి పడడంతో నాలుగు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతన్నలు గాభరా పడ్డారు. కానీ బుధవారం నాటికి పరిస్థితి చక్కబడింది. మేజర్లకు నీటి సరఫరా జరుగుతుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గుంటూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దు 85-3 వద్ద మొదటి రోజు 2070 క్యూసెక్కుల నీరు విడుదలకాగా.. గురువారం 2700 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు డీఈఈ సత్యకుమార్ తెలిపారు.
 
 మొన్నటి దాకా నీరు లేక వరినాట్లు ఎండుముఖం పట్టడంతో కష్టాలు తప్పవని అన్నదాత నిరాశ చెందాడు. కానీ పరిస్థితి అనుకూలంగా మారడంతో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. భూములను దమ్ము చేస్తున్నారు. నీటి సరఫరా ఇదేవిధంగా కొనసాగితే ఆయకట్టు చివరి భూములకు కూడా ఇబ్బంది ఉండదు. దీని కోసం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది. కాగా సాగర్ జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఖరీఫ్‌లో సక్రమంగా నీరు విడుదలవ్వక చాలా చోట్ల పంటలు సాగులోకి రాలేదు.
 
 ఇప్పటికి నలభై శాతమే!
 జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద 4.35 లక్షల ఎకరాలుండగా ఇప్పటికి సుమారు నలభై శాతం భూముల్లో మాత్రమే వరి సాగులోకి వచ్చింది. ప్రస్తుతం కాలువకు ఎగువ భూములే కళకళలాడుతున్నాయి. సాగర్ కాలువకు సమృద్ధిగా నీరు వస్తే తప్ప మిగిలిన భూములు తడవవు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా రైతులు అప్పులతో మిగిలిపోవాల్సిందే.

Advertisement
Advertisement