‘సాక్షి’ ప్రసారాలంటే భయమెందుకో? | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ప్రసారాలంటే భయమెందుకో?

Published Fri, Jun 17 2016 12:36 AM

‘సాక్షి’ ప్రసారాలంటే భయమెందుకో? - Sakshi

పునరుద్ధరించకుంటే ట్రాయ్‌కు ఫిర్యాదు
మాల మహానాడు నిరసన

 

నందిగామ రూరల్ :ప్రజాహిత కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాక్షి చానల్‌ను చూసి బెంబేలెత్తిపోతున్న ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాజకీయ దురుద్దేశంతో సాక్షి ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్‌వోలపై ట్రాయ్‌కు ఫిర్యాదు చేయనున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా  గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో  నిరసన కార్యక్రమాలు జరిగాయి. నందిగామాలో జరిగిన కార్యక్రమంలో ముందుగా  అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఫ్రాన్సిస్ మాట్లాడుతూ  ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు చేస్తున్న మోసాలను బయటపెడుతున్నందునే సాక్షి ప్రసారాలను సర్కారు నిలిపి వేయించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి ప్రసారాలు నిలిపివేసిన ఎంఎస్‌వోలు నష్టపోవాల్సి ఉంటుం దని, గురువారం సాయంత్రం 5 గంటల లోపు ప్రసారాలు పునరుద్ధరించేందుకు సమయం ఇస్తున్నామని, దీనికి వారు స్పందించకుంటే శుక్రవారం ట్రాయ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో ఓటుకు కోట్లు కేసు విషయంలో సైతం చంద్రబాబు సర్కారు ఇదే తీరుతో వ్యవహరించిందన్నారు. మీడియా గొంతు నొక్కితే నష్టం ప్రభుత్వానికేనన్న వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
 

పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?...
ఇబ్రహీంపట్నం : పత్రికాస్వేచ్ఛను రాష్ట్రప్రభుత్వం హరించడంపై రాష్ట్ర బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సభ్యులు స్థానిక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన జరిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.రామారావు, ఏపీబీజేఏ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి వి.ఆనందరరావు అధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీకి  వైఎస్సార్ సీపీ నేతలు, ఎంపీటీసీ సభ్యులు తమ సంఘీభావం తెలిపారు.   ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ సమస్యలపై అనేక మంది ఉద్యమాలు చేస్తున్నారని వాటిని ప్రసారం చేస్తున్న సాక్షి, నంబర్ వన్ న్యూస్ చానెల్స్ ప్రసారాలు నిలిపేయడం అత్యంత ధారుణమైన చర్య అన్నారు.  రామారావు మాట్లాడుతూ చానల్స్‌ను నిలిపేయడం వలన సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. తక్షణమే సాక్షి,నంబర్ వన్ చానల్స్‌ను పునరుద్ధరించాలని అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.   పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్స్ మీడియా సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

 
నున్నలో నిరసన...

నున్న(విజయవాడరూరల్): రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా  సాక్షి చానల్  ప్రసారాలను నిలివేసినందుకు నిరసనగా నున్న గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.సీఎస్‌ఐ చర్చి సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ మండల కమిటీ సభ్యుడు పరసా చైతన్య,పంచాయతీ 4వ వార్డు సభ్యుడు తగరం యోహాను పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ప్రదర్శన చేశారు. చంద్రబాబు  చట్టవ్యతిరేక చర్యలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు ప్రసారం చేయడం వలనే సాక్షి చానల్‌లో ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు.

 

సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాల్సిందే   పైపుల రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన
గాంధీనగర్ (అజిత్‌సింగ్‌నగర్) : సాక్షి చానల్‌పై ప్రభుత్వానికి ఎందుకింత అక్కసు అంటూ అభిమానులు మండిపడ్డారు. ముద్రగడ దీక్ష సాకుతో సాక్షి ప్రసారాలను నిలిపివేసి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ అజిత్‌సింగ్‌నగర్ పైపుల రోడ్డులో సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, పాయకాపురానికి చెందిన సాక్షి అభిమానులు గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధికార ప్రతినిధి బి.జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో జరిగే అవినీతిని సాక్షి చానల్ కళ్లకు కట్టినట్టు చూపినందుకే కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి సాక్షిపై కక్ష పెంచుకున్నారన్నారు. ముద్రగడ దీక్షను సాకుగా చూపి చానల్  ప్రసారాలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు.  కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ  చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. సాక్షి ప్రసారాలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో సాక్షి అభిమానులు, మాజీ కార్పొరేటర్ వీర్ల వరలక్ష్మి, దుర్గారావు, పెద్దిరెడ్డి శివారెడ్డి, టెక్యం కృష్ణ, కిషోర్, కంచి ధనశేఖర్, నాగిరెడ్డి, పూర్ణ, దుర్గారావు   పాల్గొన్నారు.

 

చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించండి
అంబేడ్కర్‌కు వినతి

విజయవాడ(భవానీపురం) : నిలిపివేసిన ‘సాక్షి’, నంబర్ వన్ టివి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు గురువారం వినతి పత్రం సమర్పించారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత వినతిపత్రం సమర్పించారు.  ఎస్సీ మోర్చా నాయకులు మాట్లాడుతూ భావ స్వేచ్ఛ అనేది పత్రికల హక్కని, ఆ హక్కును కాలరాసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల ఉద్యమాన్ని సాకుగా చూపుతూ చానల్స్ గొంతునొక్కడం అప్రజాస్వామికమన్నారు. ఎస్సీ మోర్చా నగర ప్రధాన కార్యదర్శులు పుట్ల రమణ, కొమర కిరణ్‌కమార్, ఇన్‌చార్జ్ సర్వశుద్ధి రాజు, ఉపాధ్యక్షుడు కొమర యల్లారావు, కార్యదర్శులు మాతంగి ప్రకాష్, పి.దుర్గాప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు దాసరి జాన్‌బాబు  పాల్గొన్నారు.

 

‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేయడం తగదు
ఎమ్మెల్యే రక్షణనిధి

తిరువూరు : ప్రసారసాధనాలపై ప్రభుత్వం పెత్తనం చెలాయించాలని చూడడం తగదని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అభిప్రాయపడ్డారు.  గురువారం తిరువూరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.  కాపు ఉద్యమాన్ని అన్ని చానల్స్ ప్రసారం చేస్తుండగా కేవలం సాక్షి చానల్‌ను నిలిపివేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.  జననేత వై.ఎస్.జగన్‌హన్‌రెడ్డిపైన, సాక్షి మీడియాపైన ఎప్పటినుంచో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకున్న అక్కసు ఈ విధంగా వెళ్లగక్కుతున్నారని రక్షణనిధి విమర్శించారు.  ఇటువంటి కుయుక్తులతో పాలన చేద్దామని చూస్తే ప్రజలే తిరగబడతారని, వెంటనే సాక్షి చానల్‌ను పునరుద్ధరించకపోతే ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చలమాల సత్యనారాయణ, పార్టీ నాయకులు రేగళ్ళ మోహనరెడ్డి, తంగిరాల వెంకటరెడ్డి, ఏరువ ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement