దేశంలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం

27 Feb, 2020 08:06 IST|Sakshi
ఆనందపురం మండలం వేములవలస వద్ద సిద్ధమైన లేఅవుట్‌

మహిళల పేరిట పేదలకు ఇళ్లస్థలాలు

జిల్లాలో 2.50 లక్షల మందికి లబ్ధి

‘సాక్షి’తో జేసీ వేణుగోపాలరెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: ‘రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే కార్యక్రమంలో భాగంగా సొంత ఇల్లు లేని అర్హులైన వారికి నివాస స్థల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు, పట్టణ ప్రాంతంలో కనీసం ఒక సెంటు చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమం అంతా మార్చి 25వ తేదీ ఉగాది రోజున ఒక పండుగలా జరగనుంది. స్థలం ఇవ్వడమంటే పట్టా ఇచ్చేయడమనే గత విధానానికి భిన్నంగా సాగుతుంది ఇప్పటి ప్రక్రియ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏవిధంగా అయితే లేఅవుట్లు అభివృద్ధి చేస్తారో ఆ మాదిరిగా ప్రభుత్వమే అన్ని ప్రాథమిక వసతులు కల్పించి ఇవ్వాలనేది ఉద్దేశం. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయడమే గాక ఆ లేఅవుట్‌లో సామాజిక అవసరాలకు స్థలం కేటాయింపు ఉంటుంది. సరిహద్దులు గుర్తించి, ఆ ప్రకారం రాళ్లు వేయిస్తున్నాం. ఆ స్థలంపై లబ్ధిదారుల కుటుంబంలోని మహిళకు యాజమాన్య హక్కు ఉంటుంది. గతంలో ఇచ్చినట్లు అసైన్డ్‌ పట్టా మాదిరిగా గాకుండా యాజమాన్య హక్కు పత్రం (కన్వీయన్స్‌ డీడ్‌) తయారుచేసి ప్రభుత్వం ఇస్తోంది. 

అర్హులందరికీ స్థలం
కుల, వర్గ, మత, రాజకీయాలకు అతీతంగా ఈ స్థలాల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది. ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో, మండల కార్యాలయాల్లో ప్రదర్శించాం. దరఖాస్తు చేసుకున్నా కొంతమందికి ఎందుకు అర్హత లేదో స్పష్టంగా పేర్కొంటూ అనర్హుల జాబితాలను ఉంచాం. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి పునఃపరిశీలన చేయించాం. ఆ దశలోనూ అర్హులైనవారికి అవకాశం కల్పించాం.

జిల్లాలో 2.50 లక్షల మందికి లబ్ధి
జిల్లాలో ఇప్పటివరకూ లెక్క తేలిన లబ్ధిదారులు 2.50 లక్షల మంది. గ్రామీణ ప్రాంతంలో సుమారు 66 వేల మంది ఉన్నారు. వారికి ఒకటిన్నర సెంట్లు చొప్పున స్థలం కేటాయించాలంటే లేఅవుట్లు వేసేందుకు 1,613 ఎకరాల భూమి అవసరమవుతోంది. దీనిలో 1,393 ఎకరాలు అంటే దాదాపు 1,400 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాం. అదీ ఏ గ్రామంలో లబ్ధిదారులకు ఆ గ్రామ పరిధిలోనే స్థలం ఇవ్వాలనేది లక్షం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. వేరే గ్రామంలో స్థలం ఇచ్చినా అక్కడ నివాసానికి వెళ్లకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ ఒక గ్రామంలోని లబ్ధిదారుల కోసం ఆ గ్రామ పరిధిలోనే లేఅవుట్‌ వేయిస్తున్నాం. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట 171 ఎకరాల అసైన్డ్‌ భూమి మాత్రమే తీసుకున్నాం. జిరాయితీ భూమి ధరతో సమానంగా పరిహారం ఇచ్చిన తర్వాతే వాటిని సేకరించాం. ఇక ప్రభుత్వ, అసైన్డ్‌ భూమి అందుబాటులో లేనిచోట 47.64 ఎకరాల మేర జిరాయితీ భూమి కూడా తీసుకున్నాం. ఇందుకు రూ.46.83 కోట్ల మేర బిల్లులు పంపించాం. కొంతమందికి ఇప్పటికే ఆ మొత్తం అందింది కూడా. 

వీఎంఆర్‌డీఏకు బాధ్యతలు..
విశాఖ మెట్రోపాలిటన్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) అనేది ఒక ప్రభుత్వ సంస్థ. విశాఖ నగర పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి బాధ్యతలు దీనికే ప్రభుత్వం అప్పగించింది. ప్రతి లేఅవుట్‌లోనూ పక్కాగా రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాల సహా మౌలిక వసతులన్నీ కల్పించి ఇస్తుంది. ఇందుకు రూ.150 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 25వ తేదీన ఉగాది రోజున పట్టాల పంపిణీకి అన్నీ సిద్ధమవుతాయి. 20 బ్లాక్‌ల్లో లేఅవుట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీఎంఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ బ్లాక్‌లన్నీ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వార్డుల వారీ లబ్ధిదారులకు వారికి సమీప బ్లాక్‌లోనే స్థలం కేటాయించేలా మ్యాపింగ్‌ చేస్తున్నాం.

 కన్వీయన్స్‌ డీడ్స్‌ సిద్ధం చేస్తున్నాం 
ప్రతి లబ్ధిదారుడికి కేటాయించిన స్థలానికి సంబంధించి కన్వీయన్స్‌ డీడ్‌ (ఆస్తి హక్కు పత్రం)ను ప్రభుత్వం ఇస్తుంది. వాటిని లబ్ధిదారుల కుటుంబంలో మహిళ పేరిట అన్ని వివరాలతో సిద్ధం చేస్తున్నాం.  

పట్టణంలోనే ల్యాండ్‌ పూలింగ్‌..
విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)తో పాటు నర్సీపట్నం, యలమంచిలి పురపాలక ప్రాంతాల్లో మొత్తం 1,84,704 మందికి ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించాం. వారిలో 28,152 మందికి టిడ్కో ఇళ్లను కేటాయిస్తాం. మిగతా 1,56,552 మందికి ఇళ్ల స్థలం ఇవ్వాల్సి ఉంది. జీవీఎంసీ పరిధిలోనే సుమారు 1.52 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూమి సమీకరించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికి 5,200 ఎకరాల భూసమీకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అసైన్డ్‌ భూమి అనుభవదారులైన రైతులు, ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు చాలామంది తమ ఆమోదం తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు. వారికి ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో స్థలం ఇస్తారని ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అధికార యంత్రాంగంపై విశ్వాసం ఉంది. 

తక్కువ ఖర్చుతోనే..
రాష్ట్రంలో ఇంత తక్కువ మొత్తం ఖర్చుతో భూసేకరణ పూర్తి అయ్యింది మన జిల్లాల్లోనే. దాదాపుగా ప్రభుత్వ భూమి, అసైన్డ్‌ భూమినే లేఅవుట్ల కోసం వినియోగిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 845 లేఅవుట్లు వేస్తున్నాం. వాటిలో 493 లేఅవుట్లు అన్ని విధాలా సిద్ధమయ్యాయి. వాటిలో 33,192 ప్లాట్లను సిద్ధం చేసేశాం. మిగతావి కూడా మరో ఒకటీ రెండు వారాల్లో సిద్ధమవుతాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు