ఉద్యోగం ఊడితే తిరుగుబాటే ! | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఊడితే తిరుగుబాటే !

Published Mon, Dec 29 2014 3:47 AM

ఉద్యోగం ఊడితే తిరుగుబాటే ! - Sakshi

వారంతా పంచాయతీ కార్మికులు. రోడ్లను ఊడ్చడం, మురికి కాల్వలను శుభ్రం చేయడం, మలమూత్రాలను చేత్తో ఎత్తేయడం వీరి విధి నిర్వహణలో భాగం. అయినా ఏళ్ల తరబడి అరకొర వేతనాలే. ప్రభుత్వం ఎప్పటికైనా పర్మినెంట్ చేయకపోతుందా అనే చిన్న ఆశతో అన్ని కష్టాలనూ భరించారు. అయితే కార్మికులందరినీ విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వేలాది మంది పంచాయతీ కార్మికులను ఇంటికి పంపనున్నారు. దీంతో కార్మికులు జిల్లాలోని పంచాయతీ కార్యాలయాల వద్ద 14 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. కార్మికుల సమస్యలు, వారి డిమాండ్లు తెలుసుకునేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు.

నియోజకవర్గంలోని చంద్రగిరి, తిరుచానూరు, శెట్టిపల్లి పంచాయతీల్లో జరుగుతున్న దీక్షా శిబిరాలను సందర్శించారు. తమ తరఫున అసెంబ్లీలో గళమెత్తి, స్వయంగా దీక్షా శిబిరాలకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయకపోతే చంద్రబాబును తరిమికొడతామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హామీ ఇచ్చారు.


సాక్షి విఐపి రిపోర్టర్: డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే
 
చెవిరెడ్డి: నమస్తే అన్నా..నా పేరు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేని. మీ సమస్య ఏంటి. ఎందుకు దీక్ష (శెట్టిపల్లెలో) చేస్తున్నారు?
నరసింహులు: రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. పంచాయతీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని కలెక్టర్ చట్టవిరుద్ధంగా కార్మికులను రోడ్డున పడేశారు. కలెక్టర్ పంచాయతీల ప్రయివేటీకరణకు తెర తీస్తున్నారు. ప్రయివేటు ఏజెన్సీలకు కార్మికుల శ్రమను దోచిపెట్టే పనిలో కలెక్టర్ నిమగ్నమయ్యారు. కలెక్టర్ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా కార్మికులందరూ రోడ్డు ఎక్కాం. దీక్ష చేస్తున్నాం.
 
చెవిరెడ్డి:  కార్మికుల దీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు పలుకుతున్నారా?
నరసింహులు: న్యాయం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కా ళ్లావేళ్లాపడ్డాం. ఆయన కనీసం స్పందించలేదు. పైగా మీరే కాంట్రాక్టు తీసుకోండి అంటూ ఉచి త సలహాలు పడేశారు. స్థానిక శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ మునికృష్ణయ్య మద్దతు పలికారు. కార్మికులకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు.
 
చెవిరెడ్డి: చంద్రబాబుకు తెలిసే అధికారులు కార్మికులను వే ధిస్తున్నారా?
మాధవయ్య: సీఎంకు తెలి యకుండా కలెక్టర్ వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేయరుకదా. గతంలో కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం గతం లో వైఎస్ రాజశేఖరరెడ్డి  చాలా చేశారు. మారిన మనిషినంటూ చంద్రబాబు మాటలకు మోసపోయాం. జీవితకాలం ఇక ఆయన్ను నమ్మం.
 
చెవిరెడ్డి: గ్రామంలోనే పుట్టి పంచాయతీ కార్మికుల సమస్యలను దగ్గరగా చూశా. ఉద్యో గం పోయే పరిస్థితే వస్తే ఏం చేస్తారు?
మాధవయ్య: పేదల కడుపు కొట్టేందుకే చంద్రబాబు ప్రయివేటీకరణ మోజులో పోతున్నాడు. పంచాయతీలను నాశనం చేసే కుట్ర జరుగుతోంది. కార్మికుల కడుపు కొడుతున్నా డు. 30 ఏళ్లుగా అరకొర వేతనాలతో పనిచేస్తున్నాం. అర్హులందరినీ పర్మినెంట్ చేస్తామంటూ ఉన్న ఉద్యోగాలనుంచి తొలగించే పనికి శ్రీకారం చుడుతున్నారు.
 
చెవిరెడ్డి: మీ స్థానాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోవాలంటే అంగీకరిస్తారా ?
రమణ: బాబూ ! మీ సింగపూర్ మాకొద్దు, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలోనే భవిష్యత్ తరాలు హాయిగా ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగులు పంచాయతీలోకి వస్తామంటే ఊరుకోం. ప్రాణాలను అడ్డువేసైనా హక్కుల కోసం నిలబడతాం.
 
చెవిరెడ్డి: కార్మికులు కుటుంబాల తో సహా వీధినపడ్డారు. 14 రోజులుగా కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు?
నాగరత్నమ్మ: మా కడుపులు కొట్టి చంద్రబాబు, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఎలా బాగుపడుతారో చూస్తాం, కుక్క చచ్చినా మేమే వచ్చి ఎత్తేయాలి. కానీ కంపు కొడుతున్న ప్రభుత్వ పెద్దల ఆలోచన తీరువల్ల అల్లాడుతున్నాం. చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడునుకుంటే ఉన్న ఉద్యోగాలను పెరికి రోడ్డున పడేస్తున్నాడు. మేం ఊరుకోం ...రోడ్లు ఊడ్చుతున్న చేతులతోనే ప్రభుత్వం దిగివచ్చే వరకు పరుగెత్తిస్తాం.
 
చెవిరెడ్డి: చంద్రబాబు ప్రయివేటీకరణ మోజు నుంచి మారాడని భావిస్తున్నారా?
నాగమ్మ: బాబు మారితే మేం రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు. ఆయన మారడు. మారని చంద్రబాబును క్షమించం.
 
తిరుచానూరులో..

తిరుచానూరులో దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. భిక్షాటన చేసి సంపాదించిన బియ్యం, పప్పులతో వారు దీక్షా శిబిరం వద్ద చేస్తున్న వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులతో మాట్లాడారు.
 
చెవిరెడ్డి: భిక్షాటన  చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
కేశవులు: కలెక్టర్ నిరంకుశ ధోరణి, చేతకా ని చంద్రబాబు పాలన వల్లే పంచాయతీ కార్మికులు భిక్షాటన చేయాల్సి వచ్చింది. కార్మికులను భిక్షగాళ్లుగా మార్చిన చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు.

చెవిరెడ్డి: డి గ్రీలు చదివిన మీరు పంచాయ తీ కార్మికులుగానే ఎందుకు మిగులుతున్నారు?
ప్రసన్న కుమార్: తండ్రి నుంచి వస్తున్న వారసత్వంగా పంచాయతీ కార్మికులుగానే మిగి లిపోయా. బీఎస్సీ చదివినా ఎప్పటికైనా ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుందనే ఆశతోనే ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం కడుపుకొట్టాలని చూస్తోంది.
 
చెవిరెడ్డి: బాబు వస్తే జాబ్ వస్తుందని చం ద్రబాబు ప్రచారం చేశారు కదా! మరి మీకెం దుకు ఈ పరిస్థితి ?
చంద్రమ్మ: చంద్రబాబు ఉడాల్ మాటల కు, చేతలకు సంబంధం ఉండదు. ఉద్యోగం ఇవ్వడం దేవుడు ఎరుగు మా ఉద్యోగాలనే లాక్కొని వీధిన పడేశాడు.     
 
చంద్రగిరిలో..

చంద్రగిరిలో కార్మికుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. చిన్నబిడ్డలతో కార్మికులు చేస్తున్న దీక్షలను చూసి ఆయన చలిం చిపోయారు. వారితో మాట్లాడారు.
 
చెవిరెడ్డి: చంద్రబాబుకు రాజకీయంగా జ న్మనిచ్చిన చంద్రగిరిలో పంచాయతీ కార్మికులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది?
రాణి: ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడే రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు చంద్రగిరికి చేసింది శూన్యం. ఆయనే మంచోడైతే కార్మికు లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేదికాదు. ప్రస్తుత కలెక్టర్‌ను తెలంగాణకు తరమాలి. ఆయనా ప్రయివేటు మోజులో పడి కార్మికుల ను నాశనం చేయాలని చూస్తున్నాడు.
 
చెవిరెడ్డి: కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వస్తుందనే ఆశిస్తున్నారా ?
సుధ: 14 రోజులుగా చంటిబిడ్డలతో రోడ్డు ఎక్కినా అధికార పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదట్లో చంద్రబాబు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉండేది. ఇప్పుడు లేదు. పోరాటాలకు దిగాల్సిందే. గతంలో చంటిబిడ్డతో యుద్ధం చేసిన ఝాన్సీ రాణి స్ఫూర్తితో ప్రభుత్వంపై తిరగబడతాం.
 
చెవిరెడ్డి: ముఖ్యమంత్రి స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ?
వెంకటరమణ: ఇది ప్రజాస్వామ్యం. నిరంకుశంగా పాలించే నాయకులకు స్థానముండ దు. ముఖ్యమంత్రి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే ఉద్యమాన్ని ఉద్ధృ తం చేస్తాం. 14 రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో గ్రామాలన్నీ గబ్బు పట్టిపోతున్నాయి. ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఇప్పటికే మేం ఎందుకు విధులు బహిష్కరించాల్సి వచ్చింది, దీక్షలో ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాం.
 
చెవిరెడ్డి: మీ డిమాండ్లతో పాటు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదా ?
ప్రకాష్: వాస్తవమే ప్రజల ఆరోగ్యం ముఖ్యమే. కానీ మా బతుకులను బుగ్గిపాలు చే యాలని కలెక్టర్ ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా. పదిరోజులకే ప్రజల ఆరోగ్యాలు పాడవుతుంటే ఏళ్ల తరబడి అదే గబ్బులో, అదే మురికి కూపంలో పనిచేస్తున్నామే మా గురించీ ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఇదంతా ప్రభుత్వ నిరంకుశ ధోరణివల్లేనని గుర్తించాలి. కార్మికులకు న్యాయం చేయాలని అధికారుల కాలర్ పట్టుకోవాలి.
 
చెవిరెడ్డి: అంటే అధికారులను నిలదీయాలని పిలుపునిస్తున్నారా?
జయకుమార్: ఔను అధికారులను నిలదీయాలనే పిలుపునిస్తున్నాం. దీక్షలు చేస్తున్న కార్మికులు అధికారులకు కనిపించడంలేదా. వారికి న్యాయం చేయాలని వారికి అనిపించడం లేదా. అలాంటి అధికారులను నిలదీస్తే తప్పేంటి.
 
చెవిరెడ్డి హామీ
పంచాయతీ కార్మికుల సమస్యలు, వారి డిమాండ్లు విన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి చలించిపోయారు. వారి న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలో పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశామని గుర్తు చేశారు. కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుని అర్హులైనవారిని పర్మినెంట్ చేసే వరకు కార్మిక ఉద్యమాలకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement