సమైక్య నాదం | Sakshi
Sakshi News home page

సమైక్య నాదం

Published Sat, Aug 24 2013 3:28 AM

Samaikyandhra bandh against Telangana in guntur

సాక్షి, గుంటూరు : సమైక్యాంధ్ర ఉద్యమాలపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో  జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా అన్ని చోట్లా సమైక్యవాదులు శుక్రవారం రిలేదీక్షలు కొనసాగించారు. ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. సమైక్యాంధ్ర , రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌జీవో సంఘ ప్రతినిధులు స్థానిక కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలకు కూర్చొన్నారు. 
 
 రాజకీయ జేఏసీ నేతృత్వాన జరుగుతున్న దీక్షలకు విశాలాంధ్ర సమితి నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల  జేఏసీ నేతలు సైతం భారీర్యాలీ, హిందూకళాశాల సెంటర్‌లో మానవహారం చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేటలలో ఆర్టీసీ ఉద్యోగులు మౌనప్రదర్శన, బైక్‌ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. రేపల్లెలో న్యాయవాదులు కళ్లకు గంతలు కట్టుకుని  నిరసన తెలిపారు.    
 
 ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు.. 
 జిల్లావ్యాప్తంగా ఏపీఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మె చేస్తుండగా, కార్యాలయాల్లో పౌరసేవలన్నీ నిలిచిపోయాయి. అదే విధంగా వీరికి మద్దతుగా జిల్లా గజిటెడ్ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే విధులు బహిష్కరణ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ల సమావేశం తెనాలిలో జరగ్గా.. వారుకూడా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. పౌరసరఫరాల శాఖ ఇప్పటికే సమ్మె నోటీసు జారీచేసి కార్యాలయాలకు తాళాలేశారు. మంగళగిరి, తాడేపల్లిలో ్రపభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేయగా, ప్రకాశం బ్యారేజీ వద్ద ఉద్యోగులు రిలేదీక్షలకు కూర్చొన్నారు. మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయ సంఘాలు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది రిలేదీక్షలు నడిచాయి. నగరపాలకసంస్థ ఉపాధ్యాయులు కూడా రిలేదీక్షల శిబిరంలో కూర్చొన్నారు. నరసరావుపేటలో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టిబొమ్మకు ఉరితీశారు.
 
 ఆంధ్రకేసరికి పాలాభిషేకం..
 తెనాలి స్వరాజ్ టాకీస్ సెంటర్‌లో రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వివేకా విద్యాసంస్థల విద్యార్థులు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సర్వమత ప్రార్థనలు చేశారు. ముస్లింలు  భారీ ర్యాలీ చేయగా, చిలకలూరిపేట కావూరులో సమైక్యాంధ్ర కోసం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. బాపట్లలో ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు. 
 

Advertisement
Advertisement