మిన్నంటిన ‘సమైక్యం’ | Sakshi
Sakshi News home page

మిన్నంటిన ‘సమైక్యం’

Published Tue, Aug 13 2013 6:29 AM

Samaikyandhra bandh against Telangana in Srikakulam

కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది. సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు జరి గాయి. యువత, కుల, వృత్తి  సంఘాలు ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యువ ఇంజినీర్లు గళం విప్పారు. జేఏసీ, విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కూడలి వద్ద అన్ని రాజకీయ పార్టీల నాయకులతో భారీ బహిరంగ సభ జరిగింది. వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ప్రతినిధులు సమైక్య ఉద్యమ సారాంశాన్ని వివరించారు. దొంగ రాజీనామాల వల్ల న్యాయం జరగదని, రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు తమ లేఖ లను స్పీకర్‌కు అందజేయాలని డిమాండ్ చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆటో యూని యన్, ఆటో కన ్సల్టింగ్ యూనియన్లు శ్రీకాకుళంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించాయి. 
 
 రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ ఏపీ ఎలక్ట్రీసిటీ ఉద్యోగుల సంఘం, మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం జరిగింది. పాలకొండ-విశాఖపట్నం రహదారిలో గోపాలపురం వద్ద  ప్రజలు, యువజన సంఘాల ప్రతినిధులు నాటుబండ్లు, ట్రాక్టర్ ట్రాలీలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ విద్యార్థులు ఆంటోని కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఇచ్ఛాపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. నరసన్నపేటలో కేసీఆర్, సోనియగాంధీ దిష్టిబొమ్మలను ఊరేగిస్తు ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద దహనం చేశారు.
 
 ఏడు రోడ్ల కూడలిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ధర్మాన పద్మప్రియ, వరుదు కల్యాణి, హనుమంతు కిరణ్, బొడ్డేపల్లి పద్మజ, అంధవరపు సూరిబాబు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.వి.పద్మావతి, ధర్మాన రామ్‌మనోహరనాయుడు, టీడీపీ నాయకులు గుండ అప్పలసూర్యనారాయణ, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎన్‌జీవో నాయకులు పురుషోత్తంనాయుడు, సాయిరాం, విద్యాసంస్థల ప్రతినిధులు దుప్పల వెంకటరావు, జామి భీమశంకర్, డి.విష్ణుమూర్తి, బలగ ప్రకాష్, జర్నలిస్టు నాయడుకు నల్లి ధర్మారావులు తదితరులు పాల్గొని సమైఖ్యవాదాన్ని వినిపించారు. ఇప్పటికే కొంత మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారని, మిగిలిన వారుకూడా రాజీనామా చేయకంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. యువతంతా ఉప్పెనలా ఉప్పొంగి, సునామీలా ఉద్యమాల్లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం కొట్టుకు పోయేలా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.  పెరంబదూరు సూరిబాబు సత్సంగం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. బాపూజీ కాళా మందిరంలో సమైక్యాంధ్రాను బలపరుస్తూ నృత్య కార్యక్రమం జరిగింది.  
 
 మెకానిక్‌లు, ఆటో కన్సల్టింగ్ యజమానులు సూర్యమహల్ నుంచి పాతబస్టాండ్, వైఎస్‌ఆర్ కూడలి వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైకులన్నీ మానవహారంగా ఏర్పాటు చేసి కేసీఆర్, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లు, నెట్‌వర్క్ ఉద్యోగులు పాతబస్టాండ్ నుంచి కాం ప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రక్రియను ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరసన ధ్వనులు చేస్తామని ఏపీ ఎలక్ట్రీసిటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గోపీ, వెంకటేశ్వరరావులు అన్నారు. ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార శిబిరంలో వారు ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగినట్లైతే సీమాంధ్రాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని శ్రీకాకుళం మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు డీఈ సుగుణాకర్, టీపీఎస్ వై.ఉమామహేశ్వరరావులు అన్నారు.
 
 సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ ఫాజుల్‌బేగ్ పేటలో సమైక్య దండోరా కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను కాంప్లెక్స్ సెంటర్‌లో దహనం చేశారు. గోపాలపురం వద్ద ఆ గ్రామానికి చెందిన ప్రజలు, యువజన సంఘాల ప్రతినిధులు నాటుబండ్లు, ట్రాక్టర్ ట్రాలీలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిని రెండు గంటల పాటు దిగ్బంధించారు. వీరఘట్టంలో ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులు కబడ్డీ ఆడుతూ ఒక పక్క జై సమైక్యాంధ్ర, మరో పక్క కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ కబడ్డీ కూతను మార్చి వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. భామిని మండలం చిన్నదిమిలిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. 
 
 ఎచ్చెర్లలో ఆంటోని కమిటీని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణ ప్రకటన చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు బడే రామారావు, కె.ధనరాజ్,పి.ప్రసాద్,కంబాల వశిష్ట,విజయరాజ్ తదితరులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేసి నిరసన తెలియజేశారు. కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి ప్లెక్సీకి గడ్డితినిపించారు. ఇచ్ఛాపురంలో పలు పాఠశాలల విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పాతపట్నం నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహనాల భారీ ర్యాలీ నిర్వహించారు. నరసన్నపేటలో జేఏసీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున సమైక్యవాదులు, మహిళలు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్‌టీసీ కాంప్లెక్స్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తు కేసీఆర్, సోనియగాంధీ దిష్టిబొమ్మలను ఊరేగించారు. అనంతరం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద వాటిని దహనం చేశారు.

Advertisement
Advertisement