సమైక్య ఉద్యమంలో దీక్షల హోరు | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమంలో దీక్షల హోరు

Published Thu, Aug 22 2013 2:16 AM

Samaikyandhra bandh against Telangana in Srikakulam

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు చేపట్టిన పోరాటం జిల్లాలో ఉద్ధృతంగా సాగుతోంది. ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పు కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతుండగా నిరాహార దీక్షలు చేపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సీతంపేట ఐటీడీఏలో బుధవారం ఏర్పాటు చేసిన అధికారిక సమావేశానికి వెళుతున్న జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను సమైక్యవాదులు పాలకొండ ఏలాం సెంటర్‌లో అడ్డుకున్నారు. దాదాపు అరగంట సేపు ఆయన వాహనాన్ని నిలుపుదల చేసి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గుంటూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంతోపాటు నరసన్నపేట, పాలకొండ, పాతపట్నం, రాజాం, ఇచ్ఛాపురం, పలాస, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. 
 
 శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు వరుసగా రెండో రోజు బుధవారం కూడా బంద్ నిర్వహించారు. దీంతో రవాణా పూర్తిగా స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఎక్కువగా వివాహాలు ఉండడంతో పెళ్లివారు, బంధుమిత్రులు ఇక్కట్ల పాలయ్యారు. చాలామంది కిలోమీటర్ల దూరం నడిచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రైవేట్ టాక్సీలవారు కళ్లు తిరిగే చార్జీలు వసూలు చేశారు. శ్రీకాకుళంలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరాయి. రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ, పురపాలక సంఘం, జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగులు రిలే దీక్షలను కొనసాగించారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహిం చారు. మోబైల్ మెకానిక్‌లు ర్యాలీ చేపట్టారు. ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులు లారీలు, బస్సులతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు బంద్ పాటిస్తుండటంతో ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
 
 =  ఎచ్చెర్ల నియోజకవర్గంలో సమైక్యాంధ్ర నిరసనలు కొనసాగాయి. వై.ఎస్.విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, రణస్థలం మండలం పైడిభీమవరం, జి.సిగడాం మండలం పాలఖండ్యాం, లావేరు మండలం అదపాకల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు దీక్షలు కొనసాగించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ దీక్షా శిబిరాలను సందర్శించారు. అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
 
 =  ఇచ్ఛాపురంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వేర్వేరుగా రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. విద్యార్థులు తొలుత ర్యాలీ నిర్వహించారు. ఎంవీఐ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని టాక్సీలు, ఆటో యూనియన్ల సభ్యులు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. సోంపేటలో సంస్కార భారతి జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
 
 =  వై.ఎస్.విజయమ్మ దీక్షకు మద్దతుగా ఆమదాలవలసలో పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. సమైక్యాంధ్రవాదులు మౌన ప్రదర్శన చేశారు. జిల్లా జేఏసీ పిలుపు మేరకు మెయిన్ రోడ్డును దిగ్బంధించారు. వాహనాల రాకపోకలను గంట సేపు నిలిపివేశారు. న్యాయవాదులు, జ్యుడీషియల్, మున్సిపల్, ట్రెజరీ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పొందూరులో ఆటోల బంద్ నిర్వహించారు. సరుబుజ్జిలి జంక్షన్, రొట్టవలస జంక్షన్‌ల వద్ద విద్యార్థులు, గ్రామస్తులు రోడ్డుపై గంట సేపు ధర్నా చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
 
 =  పలాసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం ఆధ్వర్యంలో కాశీబుగ్గ వైఎస్సార్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పలాస ఇందిరా చౌక్ వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. యువనాట్యకళా మండలి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. వజ్రపుకొత్తూరు, మందసల్లో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి.
 
 =  వై.ఎస్.విజయమ్మ దీక్షకు మద్దతుగా పాతపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ ఒక రోజు దీక్ష చేపట్టారు. వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.  బూరగాంలో నిర్వహించిన రాస్తారోకోలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు. కొత్తూరులో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
 
 =  సీతంపేట ఐటీడీఏలో జరుగుతున్న సమావేశానికి వెళుతున్న కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను సమైక్యవాదులు పాలకొం డలో అడ్డుకున్నారు. అరగంటసేపు ఆయన వాహనాన్ని నిలుపుదల చేసి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున విడిచిపెట్టాలని కలెక్టర్ అభ్యర్థించడంతో సమైక్యవాదులు అనుమతించారు. పాలకొండ-శ్రీకాకు ళం ప్రధాన రహదారిలో గాయత్రీ మంత్రాలయం వద్ద ఆటోవర్కర్లు ఆటోలను అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌ను దిగ్బంధించారు. మోటార్ వర్కర్లు, స్టిక్కరింగ్ దుకాణాల యజమానులు మహా ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఎన్‌జీఓ భవ న్ వద్ద కొనసాగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పాలవలస కరుణాకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. భామిని మం డలం బత్తిలిలో వసతిగృహ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గురండిలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
 
 = టెక్కలిలో ఆర్టీసీ, రెవెన్యూ, ఉద్యోగ, రాజ కీయ జేఏసీ ప్రతినిధులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళిల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
 
 =  నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రైవేట్ జూనియర్, డిగ్రీ  కళాశాలల విద్యా సంస్థల యాజమాన్యాలు ర్యాలీ నిర్వహించాయి. కాలేజీ రోడ్డు జంక్షన్ వద్ద మానవ హరం చేపట్టాయి. అధ్యాపకులు రోడ్డుపై ఖోఖో ఆడారు. సారవకోట మండలం చీడిపూడిలో యువసేవా యువజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సారవకోటలో పాఠశాల విద్యార్థులు రోడ్డుపై మాస్ డ్రిల్ చేశారు. పోలాకిలో ఉపాధ్యాయులు ఉదయం ర్యాలీ, సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపట్టారు.

Advertisement
Advertisement