సమైక్యాంధ్ర సాధనే లక్ష్యం | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర సాధనే లక్ష్యం

Published Tue, Oct 1 2013 2:34 AM

samaikyandhra is our target

 సమన్వయకర్తలదే బాధ్యత:
 సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా అక్టోబర్ 2  నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ప్రతి జిల్లాలో తలపెట్టిన సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాలని గోపాల్‌రెడ్డి సూచించారు. వారు తమ పరిధిలోని మండల, గ్రామస్థాయి నాయకులను,  అన్ని విభాగాల కన్వీనర్లను కలుపుకొని పార్టీ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిజాయతీతో, పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో కార్యక్రమాలు నిర్వహించాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించారన్నారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికే ఉన్నత స్థానం లభిస్తుం దని, పార్టీ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.  వైఎస్సార్ పై ఎవరైనా నిందాపూర్వక ఆరోపణలు చేస్తే సహించవద్దన్నారు. గ్రామ స్థాయి నుంచి విలేకరుల సమావేశాలు నిర్వహించి ఖండించాలని యల్లసిరి గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒక వైపు రాహుల్‌గాంధీ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాక ఆ పార్టీ నేతలే తలలు బాదుకుంటుంటే ఆయనతో వైఎస్సార్‌సీపీ కుమ్మక్కైందని ఆరోపించడం అర్థంలేనిదన్నారు.
 
 చంద్రబాబుకు ఎన్‌టీఆర్ పేరెత్తే అర్హత కూడా లేదు:
 జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సోనియా వదిలిన బాణాలని, తాను మాత్రం రామబాణం అని చంద్రబాబు పేర్కొనడం గురివింద గింజ సామెతను గుర్తుకు తె స్తోందని గోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఆయన పేరెత్తే అర్హత కూడా లేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్నది ఎన్‌టీఆర్ తెలుగుదేశం కాదని, చంద్రబాబు తెలుగుదేశం అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ లాంటి కొంతమంది టీడీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని  వాటిని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర విభజన దిశగా సీడబ్ల్యూసీ  తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వారికి సరైన గుణపాఠం చెప్పేందుకు జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారని,  ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయనకు సంఘీభావంగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మోడీవైపు యువత ఆకర్షితులవుతున్నారని తెలుసుకున్న చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా లబ్ధి పొందాలని యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డికి కోర్టు నుంచి అనుమతి లభిస్తే అక్టోబరు 4న గుంటూరు నుంచి విజయవాడ వరకు జరిగే ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన పాల్గొనే అవకాశం ఉందన్నారు.  
 
 వారికి సంస్కారం లేదు...
 టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్, రేవంత్‌రెడ్డి వంటివారు కుసంస్కారులని, ఎదుటివారిని గౌరవించడం కూడా చేతగానివారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌తోకానీ, బీజేపీతోకానీ కలిసే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక లేఖను విజయమ్మకు పంపారన్నారు. అందులో గుజరాత్‌లో మారణకాండను సృష్టించిన నరేంద్రమోడీకి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని పేర్కొన్నారని, ఆ దిశగా లౌకికంగా వ్యవహరించే  మూడోఫ్రంట్‌కు మద్దతునిచ్చేందుకు వైఎస్సార్‌సీపీ దృష్టి సారిస్తుందని తెలిపారు.  
 
 వచ్చేనెల 7వ తేదీన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కాకుండా సంబంధిత నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా నవంబరు 1న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పంచాయతీల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేయించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు,  కనిగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముక్కు కాశిరెడ్డి, పర్చూరు నియోజకవర్గకోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య, గిద్దలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్లు  ముత్తుముల అశోక్‌రెడ్డి,  వై.వెంకటేశ్వరరావు, చీరాల నియోజకవర్గ కోఆర్డినేటర్ అవ్వారు ముసలయ్య, మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నా హనుమారెడ్డి, కందుకూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉన్నం వీరాస్వామి, సంతనూతలపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ వరికూటి అమృతపాణి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణరవీంద్రబాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర విభాగం అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement