పెళ్లిళ్లకూ సమైక్య సెగ | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లకూ సమైక్య సెగ

Published Sat, Aug 17 2013 12:09 AM

పెళ్లిళ్లకూ సమైక్య సెగ - Sakshi

* భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు, కూరగాయల ధరలు
* రెట్టింపవుతున్న పెళ్లి బడ్జెట్
 
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగ పెళ్లిళ్లకూ తాకింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. ప్రైవేటు వాహనాలు, కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో బడ్జెట్ అంచనాలను మించుతోందని పెళ్లిళ్లు చేసే వారు చెబుతున్నారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెల  21, 23, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి.

అయితే పరిస్థితులు అనూహ్యంగా మారి సీమాంధ్రలో సకలజనుల సమ్మె మొదలవ్వడంతో బస్సులు రోడ్డెక్కడంలేదు, దుకాణాలు తెరుచుకోవడంలేదు. దీంతో పెళ్లిళ్ల కోసం ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. కిలో మీటరుకు 6 నుంచి 15 రూపాయలుగా ఉన్న వాహనాల ఛార్జీలను ఏకంగా 20 నుంచి 30 రూపాయల వరకూ పెంచారు. అయినా కొన్ని చోట్ల వాహనాలు దొరకడం కూడా కష్టంగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీమాంధ్రకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణా ప్రాంతం నుంచి పెళ్లికి వెళ్లాల్సిన వధూవరుల పరిస్థితి మరోలా ఉంది. ఆందోళనలు జరిగితే వాహనాలు నిలిపివేస్తారనే వారు భయపడుతున్నారు. షామియానాలు, ఇతర టెంట్ సామాన్లకు కూడా అనుకోని విధంగా గిరాకీ పెరిగింది. ప్రతీ చోట ఆందోళనల కోసం టెంట్లను తీసుకెళ్ళడంతో పెళ్లిళ్లకు అవి లభించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలామంది దేవాలయాలనో, కల్యాణ మండపాలనో ఆశ్రయించాల్సి వస్తోంది.
 
 కొండెక్కిన ధరలు
 ఉద్యమసెగతో కేటరింగ్ రేట్లు కూడా కొండెక్కాయి. నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న కేటరింగ్ రేట్లను ఒక్కసారిగా పెంచారు. ఆందోళనల కారణంగా తమకు నిత్యావసరాలు దొరకడమే కష్టంగా ఉందని, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని, అందువల్ల ఒప్పందం మేరకు కేటరింగ్ చేయలేమని వారు తెగేసి చెబుతున్నారు.

సీమాంధ్ర ఆందోళనలతో కూరగాయల రవాణా పూర్తిగా స్తంభించింది. వారంరోజుల క్రితం వరకూ కిలో రూ. 20 వరకు ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 50 పైగా పలుకుతున్నాయి. పచ్చిమిర్చి ఏకంగా రూ. 100 దాటింది. ఉల్లి ధర వారంలోనే 25 నుంచి 70 రూపాయలకు చేరింది.

Advertisement
Advertisement