రాజకీయ గద్దలు | Sakshi
Sakshi News home page

రాజకీయ గద్దలు

Published Sat, Jan 25 2014 5:53 AM

Sand mining in prakasam district

కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: మసుబ్బారావు: ఏంటన్నా సంగతులు...  
 వెంకయ్య: ఏముందీ.. నువ్వే చెప్పాల..ఈ ఏడాది ఏ పైర్లేశారేంటి..?
 సుబ్బారావు: మా ఊళ్లో పొలాలపై పంటలు పండించే రోజులు పోయాయి...!


 వెంకయ్య: అదేంటి అలా అంటున్నావు...!
 సుబ్బారావు: అవునన్నా మా ఊళ్లో పక్కన పాలేరుంది.   రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ట్రాక్టర్ కొని.. పాలేరులో పది అడుగుల ఇసుక కొంటే చాలు కాసులే కాసులు.


 వెంకయ్య: అక్కడ ఇసుకకు అంతా డిమాండా..! రేటు ఎలా ఉంది. ఎవరమ్ముతున్నారు?
 సుబ్బారావు:  పలుకూరుకు చెందిన ఎస్సీలు జామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడా జామాయిల్ కొట్టేసి కొందరు రాజకీయ నాయకులు కొని అడుగుల లెక్కన అమ్ముతున్నారు. ఎటు చూసినా పది అడుగులు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోంది.
 
 వెంకయ్య: ఎన్ని ఎకరాలుంది?
 సుబ్బారావు: సుమారు వంద ఎకరాలుంది. ఇప్పటికే 80 శాతం తవ్వేశారు. నీకు కావాలనుకుంటే  చెప్పు..
 
 వెంకయ్య: పాలేరులో ఇసుక బాగుంటుందా...!
 సుబ్బారావు: వెంకన్నపాలెం, రామనాథపురం దగ్గర ఉన్న పాలేరులో ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. కందుకూరు మండలమే కాదు.. టంగుటూరు, సింగరాయకొండ, ఒంగోలు, జరుగుమల్లి, కొండపి మండలాలకు చెందిన ట్రాక్టర్లు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తాయి.
 
 వెంకయ్య: ట్రాక్టర్ ఇసుక ఎంతేంటి?
 సుబ్బారావు: దూరాన్ని బట్టి రేటు. కేవలం ఇసుక తరలించేందుకే నేను రెండు ట్రాక్టర్లు కొన్నా.. ట్రాక్టర్ పెట్టుబడి ఏడాదిలోపే సంపాదించాను. రోజుకు పది ట్రక్కులకు పైగా ఇసుక తోలతా.
 
 వెంకయ్య: అధికారులు పట్టుకుంటే..?
 సుబ్బారావు: ఇప్పటికే అధికారులందరికీ మామూళ్లు ఇచ్చేశాం. గుంపులో గోవింద... నిన్ను పట్టుకునేది ఎవరూ. ఆ వైపు రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఎవరూ రారు. నా మాట విని ఒక ట్రాక్టర్ కొను. ఎంత కాలం పొలంపై పడి పాకులాడతావు. అసలుకే వర్షాలు లేక పాయే..

 కందుకూరులోని ఓ సెంటర్‌లో జరిగిన సంభాషణ ఇది (పేర్లు కల్పితం). ఇటువంటి సంభాషణలు ఇక్కడ సర్వసాధారణం.  మండలంలోని పలుకూరు పంచాయతీ పరిధిలో ఉన్న వెంకన్నపాలెం, రామనాథపురం గ్రామాల సమీపంలో పాలేరును ఇష్టారీతిగా తవ్వేస్తున్నారు. పలుకూరుకు చెందిన ఎస్సీలు చాలా కాలం నుంచి పాలేరు ఒడ్డున జామాయిల్ సాగు చేసుకుంటున్నారు.
 
 దానిపై ఆ పంచాయతీలోని కొందరు రాజకీయ నాయకులు, పెత్తందారుల కన్ను పడింది. దీనికి అధికార పార్టీ నాయకులు తోడు కావడంతో ఇసుక తరలించే ట్రాక్టర్ యజమానులకు మరింత అండ దొరికినట్లయింది. ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా..అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఎస్సీలకు ఎంతోకొంత ముట్టచెప్పి సుమారు వంద ఎకరాలకుపైగా వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎటు చూసినా పది అడుగుల ఇసుక రూ. 10 నుంచిరూ. 20 వేల వరకు విక్రయిస్తున్నారు. కొన్న వ్యక్తి ఆ పది అడుగుల్లో ఎంత లోతునైనా ఇసుక తవ్వుకోవచ్చు. ఇలా పాలేరులో ఇప్పటి వరకు సుమారురూ. 50 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా.  వెంకన్నపాలెం సమీపంలో ఇసుక కుప్పలు తోలి రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక వెయ్యి నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది. పక్క మండలాలైన సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు, ఒంగోలు, కొండపిలోని గ్రామాలకు తరలించాలంటే రేటు ఎంత పలుకుతుందో అర్థం చేసుకోవచ్చు. వెంకన్నపాలెంలో 25 ట్రాక్టర్లు, రామనాథపురంలో 20, పలుకూరులో 30 ట్రాక్టర్లు కేవలం ఇసుక తరలిచేందుకే కొనుగోలు చేశారు. ఇతర మండలాల నుంచి వచ్చే ట్రాక్టర్లతో రోజుకు సుమారు 250 ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది.
 
 15 అడుగుల లోతు తవ్వకాలు...
 పాలేరులో  సుమారు 15 అడుగుల దాకా తవ్వకాలు జరిగాయి. దీని కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. అధికారులు అప్పుడప్పుడూ ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. పాలేరు వైపు వచ్చిన ఏ అధికారీ పరిశీలించిన పాపాన పోలేదు. ఈ తవ్వకాలు ఇలాగే కొనసాగితే మంచినీటికి ఇబ్బందులు తప్పవని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
 దెబ్బతింటున్న మంచినీటి పథకాలు...
 పాలేరులో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు దెబ్బతింటున్నాయి. మంచినీటి పైపుల వద్ద కూడా ఇసుక తవ్వుతుండటంతో పైపులు బయటపడ్డాయి. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడుకు చెందిన  మంచినీటి పథకం మోటార్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోయింది. నీరు కూడా అడుగంటి పోవడంతో ఆ పథకాన్ని పక్కకు మార్చుకున్నారు. అదే విధంగా పలుకూరు పంచాయతీలోని వెంకన్నపాలెం, రామనాథపురం, పలుకూరు గ్రామాలకు సంబంధించిన మంచినీటి పథకాల మోటార్లు అక్కడే ఏర్పాటు చేశారు. ఇసుక తవ్వకాలకు పైపులు బయటపడి మరమ్మతులకు గురవుతున్నాయి. ఇక వేసవిలో నీరు అడుగంటి మోటార్లకు అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
 
 మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం...
 ఇసుక అక్రమ తరలింపును అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ యంత్రాంగం మామూళ్ల మత్తులో మూలుగుతోంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే ఇసుక ట్రాక్టర్ల యజమానులకు సమాచారం వస్తుంది. అధికారులు వచ్చే లోపే అక్కడి నుంచి ట్రాక్టర్లు వెళ్లిపోతున్నాయి. దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలు సతమతమవుతున్నారు.
 
 ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
 ఎం.రాజ్‌కుమార్, తహసీల్దార్
 ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. వాల్టా చట్టాన్ని ఉపయోగించి అక్రమంగా తరలించే వారిపై గట్టి చర్యలు తీసుకుంటాం.  జీవో నంబర్ 188  ప్రకారం పంచాయతీ ఆస్తులు కాపాడేందుకు పంచాయతీ అధికారులు, ఈఓఆర్డీ, సర్పంచ్‌లతోపాటు ఇరిగేషన్ అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఇసుక తరలింపు అరికట్టేలా చూస్తాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement