Sakshi News home page

సై‘ఖతం’

Published Wed, Dec 17 2014 12:46 AM

సై‘ఖతం’

‘ఇసుక’ దోచేస్తున్న తెలుగు తమ్ముళ్లు
పేరు మహిళా సంఘాలది .. పెత్తనం టీడీపీ నేతలది
అనధికారిక ర్యాంపుల్లోనూ రాత్రిపూట తవ్వకాలు  
గుల్లవుతున్న నదీతీరాలు
మామూళ్ల మత్తులో చేష్టలుడిగిన అధికారగణం

 
రాకరాక చేతికి పగ్గాలు రావడంతో తెలుగుతమ్ముళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇసుక నుంచి కోట్లు పిండుకునే పనిలో పడ్డారు. నోరుమెదపలేని మహిళా సంఘాల  మాటున యథేచ్ఛగా రేయింబవళ్లు  అధికారిక రీచ్‌లలోనే కాదు.. అనధికారిక రీచ్ లలోనూ ఇసుక తవ్వకాలు సాగిస్తూ రెండు  చేతులా ఆర్జిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
 
విశాఖపట్నం:  పదేళ్లుగా ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంలో జిల్లాలోని ఇసుకాసురులకు పండుగలా ఉంది. నదుల పరిధిలో సుమారు ఐదులక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక నిల్వలుంటాయని అంచనా. రీచ్‌ల్లో ఎక్కడా యంత్రాలతో, రాత్రి పూట తవ్వకాలు జరపకూడదు. కానీ పగలంతా మహిళా సంఘాల సమక్షంలోనే  తవ్వకాలు జరుగుతుండగా, రాత్రిళ్లు ఆయా మండలాల్లోని పలుకుబడి ఉన్న అధికార పార్టీ నేతల సమక్షంలో తవ్వకాలు చేపడుతున్నారు. ఇంకా అనుమతులివ్వని రీచ్‌ల్లో సైతం గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. చీడికాడ మండలం దిబ్బపాలెం, శిరిజాం రీచ్‌లకు అనుమతులు ఇవ్వకున్నప్పటికీ రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోతున్నాయి. పగటి పూట కూలీలతోనూ..రాత్రుళ్లు చిన్నా చితకా యంత్రాలతో తవ్వకాలు సాగిస్తున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. చీడికాడ మండలం కట్టవానిఅగ్రహారం వద్ద రైతు వారధి సమీపంలోనే తవ్వకాలు సాగుతున్నా యి. దీంతో అది ఎప్పుడు కూలి పోతుందోననే భయం రైతులను వెన్నాడుతోంది. ఈ వంతెనను రైతులే స్వయంగా రూ.60లక్షల సొంతనిధులతో నిర్మించుకున్నారు. ఇదే పరిస్థితి మిగిలిన ప్రాంతాల్లోనూ నెలకొంది. ఈ అక్రమార్జనలో స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా వాటాలు వెళ్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుమాది..పెత్తనం మాత్రం టీడీపీ నేతలదంటూ పలు రీచ్‌లు నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘాల ప్రతినిధులు బాహాటంగానే పేర్కొంటున్నారు.

జిల్లాలో గుర్తించిన రీచ్‌లివే..

తొలుత కోనాం(చీడికాడ మండలం), సగరం(వి.మాడుగుల), జి.కోడూరు (మాకవారిపాలెం), దార్లపూడి(ఎస్.రాయవరం), పండూరు (కోటవురట్ల), గౌరీపట్నం (చోడవరం) రీచ్‌లను గుర్తించి స్థానిక గ్రామైక్యసంఘాలకు కేటాయించారు. ప్రభుత్వాదేశాలతో సర్వే చేసి మరో 16రీచ్‌లను గుర్తించారు. ఇలా జిల్లాలో మొత్తం 21 రీచ్‌లలో 3,17,848 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టు లెక్కతేల్చారు. వాస్తవంగా ఈ ప్రాంతాల్లో సుమారు ఐదున్నర లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉన్నట్టుగా భావిస్తున్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన రీచ్‌ల్లో గత నెలాఖరు నుంచి తవ్వకాలు ప్రారంభించారు. గజపతినగరం(చోడవరం), మంగబంద (పెదబయలు), ఎరుకువాడ (వి.మాడుగుల), దిబ్బపాలెం (చీడికాడ) రీచ్‌ల్లో మరో వారంరోజుల్లో తవ్వకాలకు అనుమతులివ్వనున్నారు. మిగిలిన వాటిలో గౌరవరం(చోడవరం), పెదగరువు (హుకుంపేట), కురిడి (డుంబ్రిగుడ), తిమ్మరం,కలిగొట్ల, వేచలమ్-1,2, బయిలకింతాడ (దేవరాపల్లి), ఎం.కె. వల్లాపురం, వీరనారాయణపురం, లక్ష్మీపురం(వి.మాడుగుల), సిరిజం(చీడికాడ)కు అనుమతులు మంజూరుచేయాల్సి ఉంది.

20 రోజుల్లో 50వేల క్యూబిక్ మీటర్ల అమ్మకాలు

ఆరు రీచ్‌ల్లో 59,790 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 11,958 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరపాల్సి ఉంది. కానీ 22,784 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరపడం ద్వారా కోటి 14లక్షల 77వేల ఆదాయం వచ్చిందని ప్రభుత్వానికి నివేదించారు. కానీ అనధికారిక తవ్వకాల ద్వారా ఇప్పటికే సుమారు 50వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలతో టీడీపీ నేతలు సుమారు  రెండున్నర కోట్ల మేర జేబులు నింపుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 
అవకతవకలకు ఆస్కారం లేదు
 
మంగబంద, పెదగరువు, కలిగొట్ల, ఏరుకువాడ, దిబ్బపాలెం ఐదురీచ్‌లకు అనుమతులిచ్చాం. ఈరోజే తవ్వకాలు మొదలయ్యాయి. మిగిలిన 10 రీచ్‌లకు రిజిస్ట్రేషన్ సమస్య వల్ల కేటాయింపులు జరపలేదు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపే తవ్వకాలు జరపాలి. అలా కాదని రాత్రుళ్లు తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. డ్వాక్రా సంఘాలకు సహాయకులుగా ఏపీఎంలు వ్యవహిస్తున్నారు. అంతా ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్నందున ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు.
 -సత్యసాయిశ్రీనివాస్, పీడీ, డీఆర్‌డీఏ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement